నా తీరే ‘బర్నింగ్ స్టార్’ని చేసింది
దోసకాయలపల్లిలో ‘సంపూ’
దోసకాయలపల్లి (మధురపూడి) : ఆయన హీరోగా నటించింది కేవలం ఒకే ఒక్క సినిమా (హృదయకాలేయం). 25 సినిమాలలో నటించినంత గుర్తింపు పొందారు. ప్రస్తుతం రెండు సినిమాలలో హీరోగా నటిస్తూ..మరో ఆరు సినిమాలలో కేరక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా మారిపోయారు. ఆయనే ‘బర్నింగ్‌స్టార్’ సంపూర్ణేష్‌బాబు. ఇ.వి.వి. సినిమా బ్యానర్ పై ఆయన వారసులు ఆర్యాన్ రాజేష్ నిర్మాతగా,‘అల్లరి’ నరేష్ హీరోగా నిర్మిస్తున్న ‘బందిపోటు’ సినిమా షూటింగ్ కోరుకొండ మండలం దోసకాయలపల్లిలోని బొమ్మనరాజ్‌కుమార్ తోటలో నిర్విరామంగా జరుగుతోంది. ఈ సినిమాలో నరేష్‌కు స్నేహితుడిగా సంపూ నటిస్తున్నారు.
ఆయనతో చిట్‌చాట్...
ప్ర: హలో...సంపూర్ణేష్‌బాబూ...ఎలా వున్నారు ?
జ: చాలా బాగున్నాను..సార్....
ప్ర : ఒకే ఒక్క సినిమాతో స్టార్ అయిపోయారు..?
ఇది ఎలా సాధ్యమైంది.?
జ: నేను చిన్నప్పటి నుంచి ప్రత్యేకంగా వుండాలని కోరుకునేవాడ్ని. ఆ స్వభావమే నన్నీస్థాయికి తీసుకొచ్చింది.
ప్ర : సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?
జ : సోషల్ మీడియా ద్వారా అందరికీ సుపరిచితుడ్ని. చిన్నప్పటి నుంచి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. ‘హృదయకాలేయం’ సినిమా దర్శకుడు స్టీవెన్‌శంకర్ పరిచయంతో ఆ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. జన్మనిచ్చింది..స్టీవెన్‌శంకర్ అయితే..జీవం పోసింది..మీడియా సోదరులే. ఆ సినిమా ఆడియో వేడుకలో నేను మాట్లాడిన తీరు చిత్రపరిశ్రమను,ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ప్ర : మీ స్వస్థలం ఎక్కడ..
జ: మెదక్ జిల్లా సిద్దిపేట మండలం మిట్టపల్లి..
హైదరాబాద్‌లో స్థిరపడ్డాను.
ప్ర : ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు..
ప్రస్తుతం ఏ చిత్రాలు చేస్తున్నారు.?
జ: హీరోగానే కాకుండా ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తా. మంచి నటుడిగా స్థిరపడాలనుంది. త్వరలో ‘కొబ్బరిమట్ట’ సినిమాలో హీరోగా చేస్తున్నాను. మరో ఆరు సినిమాలు ఒప్పుకున్నాను. బందిపోటులో అల్లరి నరేష్ స్నేహితుడిగా గుర్తింపు ఉన్న పాత్రలో నటిస్తున్నాను.
ప్ర : నటనలో మీకు ఎవరు స్ఫూర్తి?
జ : మొదటి నుంచి మోహన్‌బాబుగారంటే చాలా ఇష్టం.అలాగే పవన్‌కళ్యాణ్, కన్నడ హీరో ఉపేంద్ర. వీరి నటన,స్టైల్ చాలా ఇష్టం.
ప్ర: ఈ జిల్లా వాతావరణం...షూటింగ్ అనుభవాలు..?
జ: గోదావరి జిల్లాలంటే నాకు ప్రాణం. ఇక్కడున్న పచ్చదనం...
ప్రశాంతత...ప్రజల ఆదరాభిమానాలు జీవితంలో మరవలేను.