అల్లరి నరేశ్‌తో ఇంత సడన్‌గా సినిమా చేస్తాననుకోలేదు : ఈషా
పదహారణాల తెలుగు కథానాయిక ఈషా. ‘అంతకుముందు ఆ తరువాత’ చిత్రంతో తెలుగు తెరపై తళుక్కుమన్న ఈషా తన రెండో సినిమాగా ‘అల్లరి’ నరేశ్‌తో ‘బందిపోటు’లో చేసింది. ఇందులో నరేశ్ ‘బందిపోటు’గా కనిపిస్తే, ఆమె ‘బందిపోటి’గా క నిపిస్తుందట. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రాజేశ్ ఈదర నిర్మించిన ‘బందిపోటు’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పాత్ర పరిధి మేరకు కాస్త గ్లామర్‌గా కనిపిస్తానంటున్న ఈషా ‘సాక్షి’తో చెప్పిన ముచ్చట్లు...
ఎవరి మనసులో ఏముందో ఇట్టే పట్టేస్తా....
సినిమాలో నా పేరు జాహ్నవి. చాలా స్వతంత్ర భావాలున్న అమ్మాయిని. ఎవరి మనసులో ఏముందో ఇట్టే కనిపెట్టేస్తాను. నరేశ్ దొంగల్ని దోచుకుంటుంటే, నేను ఆయన మనసును దోచుకునే ‘బందిపోటి’ని. చాలా సరదా పాత్ర. కెరీర్ ప్రారంభంలోనే ఇంత మంచి పాత్ర దొరకడం నా అదృష్టం.
చాలా ఆనందంగా ఉంది
‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమా తరువాత చాలా కథలు విన్నాను. ఆ పాత్రలకు నేను సరిపోనేమో అనిపించింది. అందుకే అంగీకరించలేదు. కొన్నాళ్ల తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ గారే మళ్లీ పిలిచి నాకీ అవకాశం ఇచ్చారు. జాహ్నవి పాత్రకు నేనే సరిపోతానని చెప్పారు. నేషనల్ అవార్డు విన్నింగ్ డెరైక్టర్ అయిన ఇంద్రగంటి దర్శకత్వంలో మళ్లీ నటించడం చాలా ఆనందంగా ఉంది.
తొలుత టెన్షన్ పడ్డా...
అల్లరి నరేశ్‌తో, పైగా ఈవీవీ బ్యానర్‌లో చేయడం చాలా ఆనందంగా ఉంది. సడన్ స్టార్‌తో ఇంత సడన్‌గా కలిసి నటిస్తాననుకోలేదు. ఆయన సినిమా అనేసరికి తొలుత చాలా టెన్షన్ పడ్డా. యాభై సినిమాల హీరోనన్న ఫీలింగ్ ఆయనకెప్పుడూ లేదు. దర్శకుడి నుంచి లైట్‌బాయ్ వరకు అందరినీ సమానంగా చూసేవారు. దాంతో ఆ కంగారంతా పోయింది. ఆయనతో నటించడం చాలా సౌకర్యంగా అనిపించింది. నరేశ్‌కి చాలా ఫాలోయింగ్ ఉంది. మా ఇంట్లోవాళ్లు ఆయన సినిమాలు తెగ చూస్తారు. త్వరలో తమిళంలో దినేశ్ హీరోగా కార్తీక్ రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నా.