అవును...2017లో మెగాఫోన్ పడతా
చాలామంది నటీనటులు నటనే కాదు, ఇతర శాఖలపై మక్కువ చూపటం సాధారణ విషయమే. 24 కళల్లో తమకు నచ్చిన శాఖను ఎంచుకుంటున్నారు. అందులో దర్శకత్వం శాఖ అంటే అందరికీ మోజే... అవకాశం దొరికితే తమ సత్తా చాటేందుకు మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా హీరో అల్లరి నరేష్ దర్శకత్వంపై మోజు పడ్డాడు.
త్వరలో మెగా ఫోన్ పడతానని చెబుతున్నాడు. తనకు నటన కన్నా దర్శకత్వం అంటేనే ఇష్టమని తెలిపాడు. నటన, దర్శకత్వం ఒకేసారి చేయడమనేది కొంచెం కష్టమైన పని అని.... 2017లో దర్శకత్వం చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు అల్లరి నరేష్ తన మనసులోని మాట చెప్పాడు.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మోరులో 'బందిపోటు' చిత్రం షూటింగ్ లో పాల్గొన్న అల్లరోడితో చిట్ చాట్..... అన్నయ్య రాజేష్, నేను నిర్మాతలుగా మా బ్యానర్‌లో బందిపోటు తొలి సినిమాగా నిర్మిస్తున్నాం. ఈవీవీ బ్యానర్‌పై వచ్చే సినిమాలను చూసిన జనం మంచి సినిమా వచ్చింది అనుకులేలా ఉండాలన్నదే మా ధ్యేయం. ఇకపై ఏడాదికి ఒక సినిమా సొంత బ్యానర్‌లో, మిగిలినవి ఇప్పటి వరకు నన్ను ప్రోత్సహించిన బ్యానర్లలో నటిస్తా.
* బందిపోటు సినిమా కథాంశం ఏంటి
ఒక్కమాటలో చెప్పాలంటే హీరో పేరు విశ్వా ఘరానా దొంగ. ప్రజలను దోచుకునే దొంగలను తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి దోచుకుంటుంటాడు.
* ఇప్పటికీ ఎన్ని సినిమాల్లో నటించారు
బందిపోటు నా 48వ సినిమా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మాతగా సాయికిశోర్ దర్శకత్వంలో ఓ సినిమా త్వరలో ప్రారంభించనున్నారు. వచ్చేఏడాది జనవరిలో నా 50వ సినిమాలో నటించడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రముఖ నటి రాధ కుమార్తె కార్తీక, మోనాల్‌గజ్జర్ హీరోయిన్లగా సిరి సినిమా బ్యానర్‌పై నూతన దర్శకుడు చిన్నికృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం షూటింగ్‌లో ఉంది.
* లడ్డూబాబు సినిమాపై మీ అభిప్రాయం
తెలుగు పరిశ్రమలో ప్రయోగాత్మకంగా నిర్మించిన చిత్రం ఇది. అయితే కొంత నిరాశను మిగిల్చిన మాట వాస్తవం. ఈ సినిమా షూటింగ్ సమయంలో రోజూ నా శరీరంపై 38 కిలోల బరువున్న మేకప్ వేసేవారు. మేకప్ ఉన్నంతకాలం చాలా కష్టంగా ఉండేది. దీనికోసం నెల రోజులపాటు లండన్‌లో ఉండి మేకప్ గురించి తెలుసుకున్నా. తెలుగులో మొదట త్రీడీ సినిమాలో నటించానన్న తృప్తి మిగిలింది.
*దర్శకత్వం చేసే ఆలోచన ఉందా
నాకు నటన కన్నా దర్శకత్వం అంటేనే ఇష్టం. నటన, దర్శకత్వం ఒకేసారి చేయడమనేది కొంచెం కష్టం. 2017లో దర్శకత్వం చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నాను.
* ప్రేమ వివాహమా.. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా
ప్రేమ వివాహమైతే ఇప్పటికే జరిగిపోయి ఉండేది. పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటాను. బహుశా వచ్చే ఏడాది నా పెళ్లి ఉండొచ్చు.