‘బందిపోటు సినిమాకు 50 ఏళ్లు
‘బందిపోటు సినిమాకు 50 ఏళ్లు
Published Thu, Aug 15 2013 1:28 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
సుందర్‌లాల్ నహతా అంటే ఆ రోజుల్లో ఫేమస్ ఫైనాన్షియర్, ప్రొడ్యూసర్. అందరూ సేఠ్‌గారని పిలిచేవారు. ఫైనాన్స్ సంగతి పక్కనపెడితే, ఆయన చాలా మంచి సినిమాలు తీస్తుండేవారు. డూండీ భాగస్వామ్యంలో రాజలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై ‘శాంతినివాసం’ (1961), ‘ఖైదీ కన్నయ్య’ (1962), ‘రక్త సంబంధం’ (1962)లాంటి సినిమాలు తీశారు. ఈసారి కాంతారావు, రాజనాలను పెట్టి బి.విఠలాచార్య దర్శకత్వంలో బ్రహ్మాండమైన జానపదం తీయాలనుకున్నారు. కథ రాసే బాధ్యతను త్రిపురనేని మహారథికి అప్పగించారు. మహారథి అప్పటికి డబ్బింగ్ సినిమాల కింగ్. డెరైక్ట్ సినిమాకి రాయడం మాత్రం ఇదే ప్రథమం. డూండీకి కుటుంబ మిత్రుడాయన. మహారథి కథ తయారీలో పడ్డారు.
ఫ్రెంచ్ విప్లవ యోథుడు స్కార్‌లెట్ పిప్పర్‌సన్ జీవితగాథతో పాటు ఇంకొన్ని కథలను మహారథికి రిఫరెన్స్‌గా ఇచ్చారు దర్శకనిర్మాతలు. కథ సిద్ధమైంది. సుందర్‌లాల్ నహతా కథ విని ‘అద్భుతం... అమోఘం’ అన్నారు. కథ విన్నాక నహతా ఆలోచన కూడా మారింది. దీనికి ఎన్టీఆర్ యాప్ట్ అనుకున్నారు. అనుకోవడమే తరువాయి ఎన్టీఆర్‌తో మాట్లాడి కాల్‌షీట్లు తీసేసుకున్నారు. విఠలాచార్య డైరక్షన్‌లో ఎన్టీఆర్ చేయడం కూడా అదే ప్రథమం. అలా ‘బందిపోటు’ తెరకెక్కింది. చకచకా షూటింగ్ అయిపోయింది. విఠలాచార్య వర్కింగ్ స్టయిల్, బడ్జెట్ కంట్రోల్ ఇత్యాది పద్ధతులు ఎన్టీఆర్‌ని ఆకట్టుకున్నాయి. అప్పటివరకూ ఎన్టీఆర్ చాలా జానపదాలు చేసినా ఆయనకే ఏదో కొత్త తరహాగా అనిపించింది.
1963 ఆగస్టు 15న ‘బందిపోటు’ విడుదలైనప్పుడు ప్రేక్షకులూ అదే ఫీలయ్యారు. సర్వసాధారణంగా జానపదాలంటే మాయలూ మంత్రాల హంగామా ఎక్కువ ఉంటుంది. ఇందులో ఎక్కువగా మానవ సంబంధాల నేపథ్యాన్ని అనుసరించారు. అందుకే ఈ కొత్త తరహా జానపదాన్ని చూసి ప్రేక్షకుల గుండెలు ఝల్లుమన్నాయి. ఎన్టీఆర్‌ని మాస్ జనం ఎలా చూడాలనుకుంటారో అంతకన్నా ఎక్కువగానే విఠలాచార్య చూపించారు. ఎన్టీఆర్ తిప్పిన కత్తి కన్నా, ఆయన పాత్ర తీరుతెన్నులే పదునుగా అనిపించాయి. ఇక పాటలైతే సూపర్బ్. ముఖ్యంగా ‘ఊహలు గుసగుసలాడె’, ‘వగలరాణివి నీవె’ పాటలైతే ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఘంటసాల సంగీతానికి, గాత్రానికి హేట్సాఫ్ చెప్పాల్సిందే.
మహారథి డైలాగ్స్‌కైతే ప్రేక్షకులు సాహో అన్నారు. ఇందులో కృష్ణకుమారి కథానాయిక. అప్పటికే ఎన్టీఆర్, కృష్ణకుమారి జోడీకి యమా క్రేజ్. వీరి కలయికలో ఇది ఏడో సినిమా. విలన్‌గా రాజనాల అదరగొట్టేశారు. రేలంగి, గిరిజల కామెడీ, గుమ్మడి, నాగయ్య, మిక్కిలినేని, రమణారెడ్డిల నటన ఈ సినిమాకు వన్నెలద్దాయి. కథ విషయానికొస్తే - ఓ చందమామ కథలాగానే అనిపిస్తుంది. రాజుగారి బావమరిది రాజ్యంలో అరాచకం సృష్టించడం, దానిని ముసుగు మనిషి వేషంలో కథానాయకుడు ఎదిరించడం, రాజుని బావమరిది బంధించడం, చివరకు కథానాయకుడు రాజుని రక్షించడం... క్లుప్తంగా ఇదీ కథ. దీనికి ఎన్ని హంగులు అద్దాలో అన్నీ అద్దారు విఠలాచార్య. అసలు అద్భుత రసాన్ని వెండితెరపై ఆయన ఉపయోగించినట్టుగా ఇంకెవరూ వాడలేదేమో. అందుకేనేమో కొన్ని కొన్ని హాలీవుడ్ సినిమాలను ప్రపంచమంతా అద్భుతం అని కీర్తించినా, మన తెలుగువాళ్లకు మాత్రం ‘ఇందులో గొప్పేం ఉంది. ఇవన్నీ మనమెప్పుడో విఠలాచార్య సినిమాలో చూసేశాం కదా’ అనిపించేది.
ఎన్టీఆర్‌తో చాలామంది దర్శకులు వండర్స్ సృష్టించినా, బి.విఠలాచార్యతో మాత్రం ఎన్టీఆర్‌ది ఓ స్పెషల్ కాంబినేషనే అని చెప్పుకోవాలి. తెలుగు ప్రేక్షకులు బాగా మెచ్చిన హీరో - డెరైక్టర్ కాంబినేషన్‌ల్లో ముందు వరుసలో ఎన్టీఆర్-విఠలాచార్య కాంబినేషన్ కూడా నిలుస్తుంది. ఈ ఇద్దరూ కలిసి మొత్తం 14 సినిమాలు చేశారు. అందులో 11 హిట్లు ఉన్నాయంటే మాటలా మరి! సరిగ్గా ‘బందిపోటు’ విడుదల సమయానికే తెలుగు తెరపై ‘కలర్ ట్రెండ్’ మొదలైంది. అందుకే ఇందులో పతాక సన్నివేశాల్ని రంగుల్లో తెరకెక్కించారు. 5 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుందీ సినిమా. ‘బందిపోటు’ విడుదలై నేటికి 50 ఏళ్లు. ఎప్పటికీ మరిచిపోలేని జానపదం ఇది.
Advertisement
Advertisement