దండాలయ్య... ఉండ్రాళ్లయ్యా... | Tollywood celebrates Ganesh Chaturthi from begining | Sakshi
Sakshi News home page

దండాలయ్య... ఉండ్రాళ్లయ్యా...

Published Mon, Sep 9 2013 1:18 PM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM

దండాలయ్య... ఉండ్రాళ్లయ్యా...

దండాలయ్య... ఉండ్రాళ్లయ్యా...

మన దేశంలో దేవుళ్లకు కొదవ లేదు. అలాగే పండగలక్కూడా. ఒక్కో దేవుడికి ఒక్కో పండగ. అయితే... ఆ పండగ వాతావరణాన్ని ప్రతిబింబించేది మాత్రం పాటలే. సినిమా పాటలైతే మరీనూ. నేడు ‘వినాయకచవితి’. సిద్ధి వినాయకుణ్ణి మన తెలుగు సినిమా రచయితలు, హీరోలు, దర్శకులు ఎన్నడూ మర్చిపోలేదు. ప్రతి తరంలోనూ వినాయకుడిని స్తుతిస్తూ పాటలు పాడుతూనే ఉన్నారు. వాటిలో బాగా హిట్టయిన కొన్నింటిని ఇప్పుడు గుర్తు చేసుకుందామా మరి. 
 
 ***  ‘వాతాపి గణపతింభజే...’ 
 ఇది ఎన్టీఆర్ ‘వినాయకచవితి’(1957) చిత్రంలోని పాట అనే చాలా మంది అనుకుంటుంటారు. కానీ అది నిజం కాదు. స్వరత్రిమూర్తుల్లో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్ రచించి, హంసధ్వని రాగంలో స్వరపరిచిన కీర్తన ఇది. ఆ పాటనే ‘వినాయకచవితి’ సినిమాకు ఉపయోగించుకోవడం జరిగింది. ఈ పాట ఏ రోజు వినిపించినా ఆ రోజే వినాయకచవితేమో అనే ఫీలింగ్. ఘంటసాల అంత తన్మయత్వంతో పాడారు ఈ పాటను. ముత్తుస్వామి దీక్షితార్ స్వరరచన సౌకుమార్యం చెడకుండా, దాన్ని సినీ పక్కీలోకి మార్చడానికి ఆ చిత్ర సంగీత దర్శకుడైన ఘంటసాల అనుభవించిన స్ట్రగుల్ అంతా ఇంతా కాదు. ఈ పాట విన్న ప్రతిసారీ మనకు ఆ విషయం అవగతమవుతూనే ఉంటుంది. ఏది ఏమైనా ఇద్దరు మహనీయుల పుణ్యమా అని ఆ పాట ఇప్పటికీ తెలుగు శ్రోతల్ని భక్తిపారవశ్యంలో తేలియాడిస్తూనే ఉంది.
 
 ***  ‘ఎవరవయ్యా... ఎవరవయ్యా... ఏ దివ్య భువి నుంచి దిగి.. ఈ అమ్మ ఒడిలోనే ఒదిగి..’
  పొత్తిళ్లలో ఉన్న పసిగణపతిని ఉద్దేశించి పరమేశ్వరి పాడే లాలిపాట ఇది. ‘వినాయక విజయం’(1980) చిత్రంలో ఈ పాటను జనరంజకంగా తెరకెక్కించారు దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. ఈ పాటలో పార్వతీదేవిగా వాణిశ్రీ అభినయం అద్భుతం. సాలూరివారి స్వర సోయగం అపూర్వం.
 
 ***  ‘శ్రీగణనాథం భజామ్యహం...’
 ఇది త్యాగరాయకృతి. దీన్నే ‘శ్రుతిలయలు’(1987) సినిమాకోసం ఉపయోగించుకున్నారు దర్శకుడు కె.విశ్వనాథ్. పూర్ణచందర్, శ్రీనివాస్ కలిసి ఆలపించిన ఈ గీతం సంగీత ప్రియులను విశేషంగా అలరించింది. రాజశేఖర్, నరేష్‌లపై ఈ పాటను చిత్రీకరించారు విశ్వనాథ్. ఈ పాట వింటుంటే... ఏదో ఆలయంలో ఉన్న ఫీలింగ్. 
 
 ***  ‘దండాలయ్య.. ఉండ్రాళ్లయ్యా దయుంచయ్యా దేవ...’
 వినాయకచవితి పర్వదినం అనగానే... ప్రతి ఇంటా వినిపించే పాట ‘వాతాపిగణపతింభజే’. ఆ పాట తర్వాత మళ్లీ అంత స్థాయిలో మారుమ్రోగే పాట ఇది. ‘కూలీ నెంబర్ 1’(1991) సినిమా కోసం ఇళయరాజా స్వరపరిచిన ఈ పాట మ్రోగని గణేశుని పందిరి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆయన నిమజ్జనం రోజున కూడా ప్రతి చోటా ఈ పాటే. ఆ విధంగా అటు దర్శకుడు రాఘవేంద్రరావుని, ఇటు హీరో వెంకటేష్‌ని పునీతుల్ని చేసిందీ పాట. 
 
 ***  ‘జయజయ సుభకర వినాయక..’
 ‘దేవుళ్లు’(2001) సినిమాలో కాణిపాకం గణపతిపై చిత్రీకరించిన పాట ఇది. ఈ పాట సన్నివేశం చాలా నవ్యంగా ఉంటుంది. ఆదిగణపతిగా ఎస్పీ బాలసుబ్రమణ్యం నటన అమోఘం. ఇక బాలు గానం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభ, వందేమాతరం శ్రీనివాస్ సంగీత సామర్థ్యం ఈ పాటను గొప్ప స్థాయిలో నిలబెట్టింది. ఇవి మచ్చుకు మాత్రమే... ‘నర్తనశాల’(1963)లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన ‘శ్రీగణనాయక.. విఘ్న వినాయక’ పాట, ‘మార్నింగ్ రాగా’(2004)లో ముత్తుస్వామి దీక్షితార్ రాసిన ‘మహా గణపతిం.. మనసా స్మరామి’ కీర్తన, ‘జై చిరంజీవా’(2005)లోని ‘జైజై గణేశా... జై కొడుతా గణేశా’ పాట, ‘100%లవ్’ చిత్రంలోని ‘తిరు తిరు గణనాథ దిద్దిద్ధిత్తై... ఇలా చెప్పుకుంటే... వెండితెరను ధన్యం చేసిన విఘ్నపతి పాటలు ఎన్నో... ఎన్నో.. ఎన్నెన్నో...
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement