N. T. Rama Rao
-
నైతికతకు పట్టం కట్టాల్సిన పోరు
డేట్లైన్ హైదరాబాద్ నంద్యాల ఉపఎన్నికలో గెలవడానికి చంద్రబాబు ఇంత అవస్థ ఎందుకు పడుతున్నారు? ఆయనా, ఆయన మంత్రులు, అనుచరగణం కలసి వందలు, వేల కోట్ల రూపాయల పనులు చేస్తామని నంద్యాల ప్రజలను ప్రలోభ పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? తన పాలన పట్ల ప్రజాభిప్రాయం ఎట్లా ఉందో ఆయన చేయించుకున్న సర్వేలే స్పష్టం చేశాయి మరి. ఏ మాత్రం వీలున్నా, ఎన్నికల కమిషన్ కూడా స్పీకర్ల వ్యవస్థ లాగా తన చెప్పుచేతల్లో నడిచేదే అయితే, తప్పకుండా ఆయన ఈ ఉపఎన్నికను జరగకుండా ఆపించి ఉండేవారు. నందమూరి తారక రామారావు 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొత్తలో కాంగ్రెస్ వాళ్లను తిట్టడానికి ఒక మాట వాడేవారు. ఆయనకు ఆ మాటంటే చాలా మోజు. పదే పదే వాడే వారు. జనానికి కూడా బాగా నచ్చింది. ఆయన నోటి వెంట ఆ మాట వచ్చిన ప్రతిసారీ సభ ఆవరణ అంతా ఈలలూ, చప్పట్లతో మార్మోగేది. కొన్ని వందల బహిరంగ సభల్లో ఆయన ఆ మాట వాడి ఉంటారు. రాజకీయాల్లో ఆ మాట బాగా ప్రసిద్ధి చెందింది కూడా ఆయన కారణంగానే. ఆ రోజుల్లో కాంగ్రెస్ వాళ్లను తిట్టడానికి ఆయన వాడిన ఆ మాట ‘‘కుక్కమూతి పిందెలు’’. రాజకీయాల్లో అక్కడక్కడ కుక్కమూతి పిందెలు మొలవడం సహజమే. కానీ, తాను స్థాపించిన పార్టీయే తరువాత కాలంలో, తన సొంత అల్లుడి నేతృత్వంలోనే కుక్కమూతి పిందెలకు నిలయం అవుతుందని మహానుభావుడు ఎన్టీ రామారావు ఊహించి కూడా ఉండరు. ఆయనే జీవించి ఉంటే తెలుగుదేశం పార్టీ ఇంకా ఆయన అదుపులోనే ఉంటే కచ్చితంగా ఈ కుక్కమూతి పిందెలను ఎరివేసేవారు, అది సాధ్యం కాదనుకుంటే పార్టీనే రద్దు చేసి ఉండేవారు. కొందరు ఆయన చర్యలను మూర్ఖత్వం కింద కొట్టిపారేసినా, నమ్మిన దానికోసం అధికారాన్నే తృణప్రాయంగా ఎడమ చేత్తో విదిలించి పారేసిన నాయకుడు ఎన్టీఆర్. విలువలకు పట్టంగట్టిన నేత ఎన్టీఆర్ ఆయన రాజకీయ జీవితం కేవలం పద్నాలుగు సంవత్సరాలే. ఆ స్వల్ప కాలంలోనే ఆయన రెండుసార్లు అధికారం కోల్పోతానని తెలిసి కూడా తాను చెయ్యదల్చుకున్నది చేసేశారు. అంతే తప్ప, అధికారాన్ని కాపాడుకోవాలని, పట్టుకుని వేళ్లాడాలని కుక్క మూతి పిందెలను దరిచేరనివ్వలేదు. ఎన్నికల ముంగిట్లో నిలబడి కూడా మంత్రి వర్గాన్ని మొత్తంగా రద్దు చేసి పారెయ్యగలిగిన ధైర్యం ఆయనది. ఆ కారణంగానే ఆయన 1989లో అధికారం కోల్పోయారు. మళ్లీ 1995లో అదే జరిగింది. శ్రేయోభిలాషుల సలహా పాటించి ఒంటరిగా వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు ఏర్పాటు చేసిన క్యాంప్‌కు వెళ్లి ఎంఎల్ఏలను కలసి ఉంటే అల్లుడి రాజకీయ జీవితం అక్కడితో ముగిసి ఉండేది. వైస్రాయ్ హాటల్ క్యాంప్ రాజకీయాలను ఒక ప్రధాన దినపత్రిక ముఖ్య విలేకరిగా ప్రత్యక్షంగా చూసిన జర్నలిస్ట్‌గా ఆ మాట కచ్చితంగా చెప్పగలను. విలేకరులం ఆ క్యాంప్‌లోని ఏ శాసన సభ్యుడిని కదిలించినా ఎన్టీ రామారావుకు ద్రోహం చేస్తున్నామన్న బాధ, ఆవేదన వారిలో స్పష్టంగా కని పించేది. ఒక్కసారి అన్నగారు క్యాంప్‌కు వచ్చి భరోసా ఇస్తే మూకుమ్మడిగా ఆయన వెంట బయటికి వెళ్లిపోయి ఉండేవారు ఎంఎల్ఏలు. ఎక్కువ మంది ఎంఎల్ఏలు క్యాంప్‌లో ఉండిపోయి చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇవ్వడానికి కారణం ఎన్టీఆర్ శాసన సభ రద్దు కోసం గవర్నర్‌కు సిఫారసు చెయ్యబోతున్నాడనే ప్రచారాన్ని చంద్రబాబు బలంగా వ్యాపింప చెయ్యడమే. ఎన్టీఆర్ స్వయంగా, ఒంటరిగా వచ్చి, అట్లా చెయ్యబోనని ఒక్కమాట అని ఉంటే ఆ భరోసాతో వారు ఆయనతో వెళ్లి ఉండే వారు. చంద్రబాబు పని ఆనాడే ‘‘ఖేల్ ఖతం దుకాన్ బంద్’’ అయ్యుండేది. కానీ ఎన్టీఆర్ ఆ పని చెయ్యలేదు. అధికారం కోల్పోయారు. అయితేనేం విలువలకు కట్టుబడి ఉన్న పేరు నిలిచిపోయింది. అధికారం శాశ్వతం అనో లేదా అది శాశ్వతంగా తనకే ఉండాలనో కోరుకున్న వారు కాదు కాబట్టే ఎన్టీ రామారావు ఆ పని చెయ్యగలిగారు. ఆయన చనిపోయి రెండు దశాబ్దాలు దాటినాక, ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోవడం ఇప్పుడెందుకు? అని ఎవరయినా అడగొచ్చు. కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ స్థానానికి ఈ నెల 23వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న సందర్భంగా... అటు అధికార పక్షం అయిన తెలుగుదేశం పార్టీ, దాని అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలకిందులుగా చేస్తున్న విన్యాసాలనూ, ఇటు రాజకీయాల్లో విలువలను ముందుకు తీసుకుపోతానని చెప్పడమే కాదు, పాటించి చూపుతున్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్నీ పోల్చి చూస్తుంటే ఎన్టీఆర్ నడిపిన రాజకీయాలను గుర్తు చేసుకోవడం అవసరం అనిపించింది. అధర్మ యుద్ధం సాగిస్తున్న అధికార పక్షం ఎన్టీ రామారావు జీవించి ఉంటే జగన్మోహన్రెడ్డిని, శిల్పా చక్రపాణిరెడ్డిని మనస్ఫూర్తిగా అభినందించి ఉండేవారు. ఒక పార్టీ ద్వారా ఎన్నికై, ఇంకో పార్టీలోకి వెళ్లాలనుకునే వారు వారి పదవులకు రాజీనామా చెయ్యాల్సి ఉంటుందని పార్టీ పెట్టిన కొద్ది రోజులకే తిరుపతి మహానాడులో నిర్ణయించి, దానికి కట్టుబడనందుకు ఆదయ్య, నారాయణ వంటి వారిని పార్టీ నుండి బహిష్కరించారు. అలాంటి తన విగ్రహానికి మొక్కుబడిగా దండలు వేసి తన విధానాలను, విలువలను ఏట్లోకి విసిరేసిన నేటి తెలుగుదేశం పార్టీని, దాని ప్రస్తుత నాయకుడిని కచ్చితంగా ఛీత్కరించుకుని ఉండేవారు. ఎన్టీఆర్ కోరుకున్న విలువలను పాటిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆయన చీదరించుకున్న, ద్వేషించిన కుక్కమూతి పిందెలతో నిండిన అధికార పక్షం చేస్తున్న అధర్మ యుద్ధాన్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లో సమర్థించి ఉండేవారు కాదు. తెలుగుదేశం పార్టీ ద్వారా సంక్రమించిన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసి, దొంగ వేషాలూ దొడ్డి దారులూ వెతుక్కోకుండా, స్పీకర్ ఫార్మాట్లో ఆ రాజీనామాను సమర్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన చక్రపాణిరెడ్డి రాజీనామాను పది రోజుల్లో ఆమోదించారు. ఈ పని వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి ఫిరాయించి అధికార పక్షం పంచన చేరిన 21 మంది శాసన సభ్యుల విషయంలో ఎందుకు జరగలేదు. ఆ 21 మందిలో ఒకరు చనిపోయారు, ఆ కారణంగానే నంద్యాలకు ఉప ఎన్నిక అవసరం అయింది. మిగిలిన 20 మంది తమ పదవులకు రాజీనామాలు ఎందుకు చెయ్యలేదు? అందులో నలుగురు మంత్రివర్గంలో చేరిన పూటే రాజీనామాలు సమర్పించారని, అవి స్పీకర్‌కు అందాయని చివరి నిముషంలో చెప్పారు. అలాంటప్పుడు చక్రపాణిరెడ్డి రాజీనామాతో బాటు ఆ నలుగురి రాజీనామాలను కూడా ఆమోదించి ఉండాలి కదా, అదెందుకు జరగలేదు? చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదంలో చూపిన వేగం, వారి విషయంలో ఎందుకు లేకుండా పోయింది? దీనికి సమాధానం చెప్పడం చాలా సులభం. ప్రజాభిప్రాయం, ప్రజాభి మతం, ప్రజామోదం ఎవరి వైపు ఉంటాయో వారికే నైతిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం బలంగా ఉంటాయి. వారు ఏ నిర్ణయం అయినా నిబ్బరంగా తీసుకోగలరు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు ఉన్నది, తెలుగుదేశం పార్టీకి లేనిది అదే. దివాలాకోరు రాజకీయాలను ప్రజలు క్షమించరు, తిరస్కరిస్తారు, బుద్ధి చెపుతారు కాబట్టి వీలయినంత కాలం పదవులు పట్టుకు వేళ్లాడుదామని చూసే వాళ్లనే ఎన్టీ రామారావు కుక్క మూతి పిందెలు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో గెలిచి పదవులు వీడకుండా అధికార పక్షం వైపు వలసపోయిన వాళ్లు ఆ కోవకు చెందిన వారే. నంద్యాల కోసం ఎందుకిన్ని పాట్లు అసలు చంద్రబాబు నాయుడు నంద్యాల ఉప ఎన్నికలో గెలవడానికి ఇంత అవస్థ ఎందుకు పడుతున్నారు? ఆయన అధికారంలోకి వచ్చాక మూడేళ్లు నంద్యాల వైపు తొంగి కూడా చూడని ఆయనా, ఆయన మంత్రివర్గ సహచరులూ, పార్టీ నాయకులూ, కిరాయికి తెచ్చిన వందలాది మంది నకిలీ కార్యకర్తలూ కలసి వందలు, వేల కోట్ల రూపాయల పనులు చేస్తామని నంద్యాల ప్రజలను ప్రలోభ పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? నంద్యాలలో ఓడిపోతే చంద్రబాబు ప్రభుత్వం ఏమీ పడిపోదు. అదసలు ఆయన పార్టీ గెలిచిన స్థానమే కాదు. ఇదో ఉప ఎన్నిక, మేం చేసిన అభివృద్ధిని చూసి జనం ఓట్లేస్తారని, అభ్యర్థిని ప్రకటించి, ప్రచార బాధ్యతలను స్థానిక నాయకత్వానికి అప్పజెప్పి.. తాను ప్రభుత్వాన్ని నడిపే పని చెయ్యెచ్చు కదా! ఈ నెల మూడవ తేదీన జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి చెప్పినట్టు 2019లో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి నంద్యాల ఉప ఎన్నిక ఫలితం నాంది అని చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు. అసలు ఉపఎన్నికలు రావడమే ఆయనకు ఇష్టం లేదు. తన పాలన పట్ల ప్రజాభిప్రాయం ఎట్లా ఉందోనని పలుమార్లు ఆయన స్వయంగా చేయించుకున్న సర్వేలు స్పష్టం చేశాయి, మరి. కానీ భూమా నాగిరెడ్డి హఠాత్తుగా చనిపోవడంతో, ఏదో సామెత చెప్పినట్టు చంద్రబాబు ప్రాణం మీదికి వచ్చింది. ఏ మాత్రం వీలున్నా, ఎన్నికల కమిషన్ కూడా స్పీకర్ల వ్యవస్థ లాగా తన చెప్పు చేతల్లో నడిచేదే అయితే, తప్పకుండా ఆయన ఈ ఉపఎన్నికను జరగకుండా ఆపించి ఉండేవారు. ఎన్నిక తప్పనిసరి కావడంతో ఆయన నంద్యాల ప్రజలకు చంద్రుడిని కూడా తెచ్చిస్తానని చెపుతున్నారు. అయితే నంద్యాలలో మకాం వేసిన మంత్రివర్యులంతా ‘‘మరి చంద్రబాబు నాయుడు చంద్రుడిని సగం దూరం తెచ్చారు, మీరు ఈ ఉప ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించకపోతే ఆ చంద్రుడు వెనక్కి వెళ్లి పోతాడు’’ అన్నట్టు రోజూ హెచ్చరిçకలు చేస్తూ వీధుల వెంట తిరుగుతున్నారు. ఎవరు గెలిచినా ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా జరగాల్సిందే. ప్రతిపక్షాల నియోజకవర్గాలు అభివృద్ధికి, సంక్షేమానికి పనికి రావు అని మన రాజ్యాంగం చెప్పలేదు, చట్టాల్లో రాసి లేదు. అదే నిజమయితే అధికార పక్షం ఓడిపోయిన ప్రతి నియోజక వర్గమూ వెనకబడి పోవాల్సిందే కదా. నంద్యాల ప్రజలకు, ఆ మాట కొస్తే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజలం దరికీ ఆ విషయం బాగా తెలుసు. నిజానికి ప్రస్తుత నంద్యాల ఉపఎన్నికను మిగిలిన అన్ని అంశాలనూ పక్కన పెట్టి రాజకీయాల్లో నైతికత, అనైతికత మధ్య పోరాటంగా పరిగణించి ఓటర్లు తీర్పు చెప్పాలి. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
మసకబారని మహానటి
నేడు సావిత్రి వర్ధంతి ఆమె పేరు నిశ్శంకర సావిత్రి. తెలుగు, తమిళ ప్రజల గుండెల్లో నుండి చెరిగిపోని మహానటి. ఏ పద్మ పుష్పమూ ఆమె సిగలోకి చేరలేదు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్నీ ఆమె అందుకోలేదు. రఘుపతి వెంకయ్య పురస్కారానికీ ఆమె నోచుకోలేదు. అయినా అవార్డులకు అతీతమైనది సావిత్రి. గత 100 ఏళ్లలో అత్యుత్తమ భారతీయ నటుడిగా గుర్తింపుపొందిన ఎన్.టి. రామారావు ఆమె గురించి మాట్లాడుతూ – ‘‘సావిత్రితో నటించడం గొప్ప అనుభవం. ఆమె దర్శకుని ఆలోచనలను మెరుగుదిద్దుతుంది. ఒక్కోసారి ఆమెను అందుకోగలమా! అని భయపడ్డ సంఘటనలూ ఉన్నాయి’’ అన్నారు. ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కాదు. శివాజీ గణేశన్ లాంటి గొప్ప నటుడు కూడా సావిత్రి సరసన నటించాలంటే ఒకింత జంకేవారు. వందేళ్లలో వచ్చిన అత్యుత్తమ భారతీయ చిత్రంగా ‘మాయాబజార్’ గుర్తింపు పొందింది. ఆ చిత్రం చూసిన రాజ్‌కపూర్ అట్లాంటిది వందేళ్లకు కూడా మళ్లీ రాదని చెప్పారు. ఆ సినిమా గురించి అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘మాయాబజారులో డ్యూయెట్లు పాడిన నేను హీరో కాదు. కృష్ణుడు పాత్ర వేసిన ఎన్.టి. రామారావు కూడా హీరో కాదు, ఘటోత్కచుని పాత్ర వేసిన ఎస్.వి. రంగారావు కూడా హీరో కాదు. ఆ సినిమాలో నిజమైన హీరో ఎవరంటే... సావిత్రి’ అన్నారు. ప్రముఖ చిత్రం మిస్సమ్మలో ఎన్.టి. రామారావు, సావిత్రి ఒక జంటగా; నాగేశ్వరరావు, జమున ఒక జంటగా నటించారు. మొదట్లో ఆమె పోషించిన (మేరీ / మహాలక్ష్మి) పాత్రకు సావిత్రిని అనుకోలేదు. ఆమె స్థానంలో భానుమతి ఉండాల్సింది. జమున (సీత) పాత్రకు సావిత్రి ఉండాల్సింది. నిర్మాతలు ఆలూరి చక్రపాణి, బి. నాగిరెడ్డి. దర్శకుడు ఎల్.వి. ప్రసాద్. నిర్మాణ సమయంలో భానుమతి ఆలస్యంగా వస్తున్నారని, చక్రపాణి ఆమె ఎదుటనే అంతవరకు తీసిన 4 రీళ్లను తగులబెట్టి, ఇవ్వాల్సిన పారితోషికం ఇచ్చి ఇంటికి పంపారు. (నిజానికి, భానుమతి ఆలస్యంగా రావడానికి ఆ సమయంలో ఆమె చేస్తున్న వరలక్ష్మీ వ్రతాలు కారణం). భానుమతి స్థానంలో సావిత్రిని తీసుకొని సావిత్రి ఉండాల్సిన స్థానంలో జమునను తీసుకొని సినిమాను పూర్తి చేశారు. తరువాతి జీవితంలో ఈ విషయాన్ని తాత్వికంగా తీసుకున్న భానుమతి ‘‘పోనీ లెండి, నా మూలాన ఒక మహానటికి అవకాశం వచ్చింది కదా!’’ అని నచ్చచెప్పుకున్నారు. సావిత్రి పుట్టింది చిర్రావూరు, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. (డిసెంబర్ 6, 1935) (విక్కీపీడియాతో సహా అనేక చోట్ల ఆమె జన్మించింది. జనవరి 4, 1936గా నమోదయింది. అనేక వ్యయప్రయాసలకోర్చి రచించిన ‘ఎ లెజెండరీ యాక్ట్రెస్, మహానటి సావిత్రి’ పుస్తకంలో వీఆర్ మూర్తి, వీ శోభరాజుగార్లు జనన–మరణ రిజిస్టర్ని అడిగి, పక్కా ఆధారాలతో ఆమె పుట్టిన తేదీని డిసెంబర్ 6, 1935గా నిర్ధారించారు) ఆరు నెలల వయస్సులో తండ్రి నిశ్శంకర గురవయ్య మరణించారు. సంగీతం, నృత్యం అభ్యసించిన సావిత్రి, సుంకర కనకారావు ఆధ్వర్యంలో నడిచే అరుణోదయ సంగీత నాట్యమండలి, ఎన్.టి. రామారావు బావగారైన పుండరీకాక్షయ్య ఆధ్వర్యంలో నడిచే నేషనల్ ఆర్ట్స్ థియేటర్, పెదనాన్న కె.వి. చౌదరి నడిపించే నవభారత నాట్యమండలి తరఫున నాటకాల్లో కొంతకాలం నటించింది. తరువాత సినిమాల కోసం ఆ కుటుంబం మద్రాసు వెళ్లింది. కోన ప్రభాకరరావుకు రాజకీయ నేపథ్యంతో పాటు కళలపై అభినివేశం ఉంది. ఆయన బాపట్లలో పుట్టి మద్రాసులో లా పూర్తిచేశారు. 1967, 1972, 1978లో కాంగ్రెస్ నుండి అసెంబ్లీకి ఎన్నికైనారు. కొంతకాలం ఆం.ప్ర. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1980–81లో అసెంబ్లీ స్పీకర్‌గా, భవనం వెంకట్రామ్ మంత్రివర్గంలో సభ్యునిగా, పుదుచ్చేరి, సిక్కిం, మహారాష్ట్రల గవర్నర్‌గా పనిచేశారు. రాజకీయాలకంటేSముందు నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా పనిచేశారు. 1949లో కె.ఎస్. ప్రకాశరావు నిర్మించి, ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించిన ‘ద్రోహి’ చిత్రంలో ప్రతినాయకుడి భూమిక పోషించారు. 1951లో ఆయన దర్శకత్వం వహించిన ‘రూపవతి’ నటనాపరంగా సావిత్రికి మొదటి చిత్రం. అంతకుముందు ‘సంసారం’ చిత్రంలో నాగేశ్వరరావు సరసన నటించడానికి అవకాశం వచ్చింది. అయితే అప్పటికే ప్రఖ్యాతులైన నాగేశ్వరరావు సరసన మొదటిసారే నటిస్తున్నప్పుడు కలిగే సహజమైన భయాందోళనలతో నామమాత్రమైన చిన్న పాత్ర పోషించింది. తరువాత ‘పాతాళభైరవి’లో ఓ నృత్యానికి మాత్రమే పరిమితమైంది. ఆ రకంగా చూస్తే సినిమా రంగంలో సావిత్రిది గతుకుల ఆరంభమనే చెప్పాలి. 1952లో వచ్చిన ‘పెళ్లిచేసి చూడు’, తమిళ సినిమా ‘కళ్యాణం పన్నిపార్’ సావిత్రిని సినిమా రంగంలో నిలదొక్కుకోనిచ్చాయి. 1953లో వచ్చిన ‘దేవదాసు’ సినిమా ఆమెకు పేరుప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. ఇక ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. 1952లో సావిత్రికి జెమినీ గణేశన్‌తో మద్రాసులోని చాముండేశ్వరి దేవాలయంలో రహస్యంగా పెళ్లయింది. చాలారోజుల వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. కొన్నేళ్ల తర్వాత లక్స్ సబ్బు అడ్వర్టయిజ్మెంట్ కోసం సావిత్రి గణేశ్ అని సంతకం చేయడంతో అది బయటకు పొక్కింది. అప్పటికే పెళ్లయిన జెమినీ గణేశన్‌తో మరో పెళ్లికి తన తల్లి, పెదనాన్న ఒప్పుకోరని పెళ్లిని రహస్యంగా ఉంచింది సావిత్రి.జెమిని గణేశన్‌ను ఒక జ్చిbజ్టీu్చ∙lౌఠ్ఛిటగా భావించవచ్చు. ఆయనది ఆడవాళ్లను ఇట్టే ఆకర్షించే పర్సనాలిటీ. ఈ విషయంలో ఆయనకు, ప్రముఖ హాలీవుడ్ నటుడు గ్యారీ కూపర్‌కు పోలికలున్నాయంటారు. అలమేలు అనే ఆవిడతో ఆయనకు అసలు పెళ్లి జరిగింది. ఆ తరువాత తెలుగు నటి పుష్పవల్లితో సాన్నిహిత్యం ఏర్పడింది. ప్రముఖ హిందీ నటి రేఖ, ఆమె చెల్లెలు రాధ వారి సంతానం. 1966లో 12 ఏళ్ల ప్రాయంలో, తెలుగు సినిమా ‘రంగులరాట్నం’తో సినీరంగ ప్రవేశం చేశారు రేఖ. పుష్పవల్లి సోదరి సూర్యప్రభ వేదాంతం రాఘవయ్య (దేవదాసు సినిమా దర్శకుడు) గారి భార్య. జెమినీ గణేశన్‌కు సావిత్రికి సాన్నిహిత్యం ఏర్పడి పెళ్లికి దారితీసింది. (సాంకేతికంగా జెమినీ గణేశన్కిది రెండవ పెళ్లి). వారి సంతానం విజయ చాముండేశ్వరి, శ్రీరామ నారాయణ సతీష్‌కుమార్. విజయ చాముండేశ్వరి మద్రాసులోనూ, సతీశ్‌కుమార్ అమెరికాలోనూ స్థిరపడ్డారు. జెమినీ గణేశన్‌తో పెళ్లయిన తరువాత 15, 20 ఏళ్ళ దాకా తాను తప్పు చేశానేమో అన్న సందేహం అంతగా కలగలేదు సావిత్రికి. తన భార్య అలమేలుకు, తమ ఇద్దరి మధ్య ప్రేమ గురించి తెలుసనీ, ఆమెకు తన సంబంధం పట్ల అభ్యంతరం లేదని జెమినీ గణేశన్ చెప్పడమూ ఒక కారణం కావచ్చు. కొంతకాలం తర్వాత జెమినీ గణేశన్ నిరాదరణతో సావిత్రికి జీవితంలో అసంతృప్తి మొదలైంది. సావిత్రికి నటనాపరంగా అత్యుత్తమ పురస్కారం ‘చివరకు మిగిలేది’ చిత్రం ద్వారా లభించింది. 1960లో విడుదలైన ‘చివరకు మిగిలేది’ చిత్రానికి ప్రముఖ రచయిత బుచ్చిబాబు అదే పేరుతో రాసిన గొప్ప నవలకు సంబంధం లేదు. ఆయన పేరు మెన్నేని సత్యనారాయణ. మూడుసార్లు ఎంపీగా, ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా, వైయస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గ సభ్యునిగా వ్యవహరించారు. అడపాదడపా వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ విలేకరుల నుండి ఆదరణ పొందారు. సత్యనారాయణరావు గారిని కలుపుకుని ‘చివరికి మిగిలేది’ చిత్ర నిర్మాతలు దాదాపు 10 మంది. ఇందులో ముఖ్యులు అప్పుడు యువజన కాంగ్రెస్ సభ్యులుగా ఉన్న సత్యనారాయణరావు, వి. పురుషోత్తమరెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి. ఈ విషయం తెలిసి అప్పటి మంత్రివర్గ సభ్యుడు బ్రహ్మానందరెడ్డి నాగేశ్వరరావుకు ఫోన్ చేసి ‘వీరు ఉత్సాహవంతులైన యువకులు, వీరికి సహాయం చేయండి’ అని కోరారు. నిర్మాతలు నాగేశ్వరరావుని నటించమని కోరారు. అయితే, ఆయన వ్యక్తిగత కారణాల వల్ల అమెరికాకు వెళ్లవలసి వస్తుందనీ, ఫలితంగా షూటింగ్‌కు అంతరాయం కలగొచ్చనీ, అందువల్ల నటించలేనని చెప్పారు. బాలయ్య, కాంతారావుల పేర్లను నిర్మాతలకు సూచించి, స్వయంగా వారితో మాట్లాడి ఒప్పించారు. నిర్మాతలు మద్రాసులో సావిత్రిని కలిసి చిత్రంలో నటించమంటే, తన షెడ్యూల్ చాలా బిజీగా ఉందనీ, నటించలేనని చెప్పారు. బలమైన కారణం మాత్రం నిర్మాతలు అపరిచితులు, కొత్తవారు కావడమే. హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక, వి. పురుషోత్తంరెడ్డి, యం సత్యనారాయణరావులు నాగేశ్వరరావును కలిసి ‘ఏ విధంగానైనా మీరు ఆమెను ఒప్పించాలి’ అని ప్రాధేయపడ్డారు. నాగేశ్వరరావు సావిత్రికి ఫోన్ చేసి, ‘చూడు సావిత్రీ... మనం అర్టిస్టులం. మన తృప్తికొరకు మనం కొన్ని చేయాలి. మనం బతకాలంటే ప్రజల తృప్తి కొరకు ఎక్కువ సినిమాలు చేయాల్సి వస్తుంది. నీకు ఈ సినిమా అపారమైన పేరు తెచ్చిపెడుతుంది’’ అని చెప్పారు. సావిత్రి ఒప్పుకుంది.నాగేశ్వరరావు అటు బాలయ్య, కాంతారావులను, ఇటు సావిత్రినే కాకుండా మద్రాసులోని విజయా డిస్ట్రిబ్యూటర్స్‌కు ఫోన్ చేసి సహకరించమని చెప్పారు. చివరకు మిగిలేది ఇతివృత్తం – ఒక మానసిక రోగిని మామూలు మనిషిని చేయడానికి నర్సు అతన్ని ప్రేమించినట్లు నటిస్తుంది. పోనుపోను నటనకు, ప్రేమకు హద్దు చెరిగిపోయి అతనితో నిజంగానే ప్రేమలో పడుతుంది. అతను మామూలు మనిషవుతాడు. నర్సు ప్రేమ రోగి అవుతుంది. ఇక మరో వృత్తాంతం ఏమిటంటే... మందాడి ప్రభాకర్‌రెడ్డి అనే ఆర్టిస్టుది నల్గొండ జిల్లా. తుంగతుర్తి పట్టణం. ఆయన వృత్తిరీత్యా డాక్టర్. 1955 నుండి 1960 వరకు ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ చదివారు. 1959లో విడుదలైన ‘మా ఇంటి మహాలక్ష్మి’ సినిమా దర్శకుడైన గుత్తా రామినీడు ‘చివరకు మిగిలేది’ సినిమాకు కూడా దర్శకుడు. ‘మా ఇంటి మహాలక్ష్మి షూటింగ్ కొరకు హైదరాబాద్‌కు వచ్చిన రామినీడు అంతర్గత కళాశాలల నాటక పోటీలో బహుమతి ప్రదానోత్సవానికి వచ్చారు. అక్కడ బహుమతి అందుకున్న ప్రభాకర్‌రెడ్డి తరువాత రామినీడును కలిసి ‘నేను సినిమాలకు పనికొస్తానా?’ అని అడిగారు. రామినీడు అతనికి ధైర్యం చెప్పారు. రామినీడు ‘చివరికి మిగిలేది’ సినిమాకు దర్శకత్వం వహించినప్పుడు ప్రభాకర్‌రెడ్డిని గుర్తుపెట్టుకుని అతనికి డాక్టర్ పాత్రలో సినిమా రంగంలో తొలి అవకాశం ఇచ్చారు. అయితే.... అప్పటికే ఉన్నత శిఖరాన్ని చేరుకున్న సావిత్రితో నటించడానికి, అప్పుడే ఎంట్రీ చేసిన ప్రభాకర్‌రెడ్డి మానసికంగా సిద్ధంగా లేరు. ఒక సన్నివేశంలో, సావిత్రిని ప్రభాకర్‌రెడ్డి చెంపదెబ్బ కొట్టాలి. ఆ పని చేయడానికి ఆయనకు ముచ్చెమటలు పోస్తున్నాయి. పరిస్థితి గమనించిన సావిత్రి ఒక మగ జూనియర్ ఆర్టిస్టును పిలిచి చెంపదెబ్బ కొట్టారు. ఆ సందర్భంలో ఒక మహిళ మరో మగవాడిని చెంపదెబ్బ కొట్టడం ప్రొవొకేటివ్గా పనిచేసింది. ప్రభాకర్‌రెడ్డికి ధైర్యం చెప్పి రిలాక్స్డ్గా నటించమని ప్రోత్సహించారు సావిత్రి. సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ విజయవంతంగా ముగిసింది. ఆ తరువాత ప్రభాకర్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. 472 సినిమాల్లో నటించారు. 27 సినిమాలు నిర్మించారు. 21 చిత్రాలకు కథారచన చేశారు. ‘భూమికోసం’ చిత్రంలో నటించిన ప్రభాకర్‌రెడ్డి సలహా మేరకు అందులో తెరంగేట్రం చేసిన ‘లలితా రాణి’ పేరును ‘జయప్రద’గా (ఎం. ప్రభాకరరెడ్డి గారి వదిన పేరు జయప్రద) మార్చారు. ఈ చిత్రంలో పీపుల్స్‌వార్ గ్రూప్ వ్యవస్థాపకుడు కె.జి. సత్యమూర్తి (శివసాగర్) రెంజిమ్ పేరుతో రాసిన ‘చిన్నారీ చిలకమ్మా, చెల్లీ చంద్రమ్మా’ అనే పాటను జయప్రదపై చిత్రీకరించారు. సావిత్రి నటించి, ఆమె మృతి తరువాత. చివరిగా 1985లో విడుదలైన ‘అందరికంటే మొనగాడు’లో ప్రభాకర్‌రెడ్డి నటించడం ఒక ఆసక్తికరమైన ఘటన.‘చివరకు మిగిలేది’ సినిమా 1960 ఏడాదికి ఉత్తమ తెలుగు సినిమాగా ఫిలిం ఫేర్ పురస్కారాన్ని అందుకుంది. సావిత్రి ఉత్తమ నటిగా రాష్ట్రపతి పురస్కారమందుకున్నారు. తాను నటించిన చిత్రాలన్నిటిలోనూ ‘చివరకు మిగిలేది’లో పోషించిన పాత్ర తనకెంతో నచ్చిందని సావిత్రి చెప్పారు. అయితే ప్రముఖ సినీ విమర్శకుడు నందగోపాల్ ‘దేవదాసు (1953)’ పార్వతి పాత్ర, ‘కన్యాశుల్కం’ (1955)లో మధురవాణి పాత్ర, ‘మాయాబజార్’ (1957)లో శశిరేఖ పాత్ర, సావిత్రి నటజీవితంలో కలికితురాయిలని భావిస్తారు. కొంత విచ్చలవిడిగా ఖర్చుపెట్టి, కొంత వితరణశీలిగా దానం చేసి, మరికొంత మత్తుపదార్థాల వ్యసనానికి బానిసై చాలా డబ్బు పోగొట్టుకుంది సావిత్రి. అదే కాకుండా సావిత్రి సంపాదించిన ఆస్తుల్లో కొన్ని ఇన్‌కంటాక్స్ కేసుల్లో కరిగిపోయాయి. ఆమె కొన్నాళ్లు కూతురు విజయచాముండేశ్వరి దగ్గర ఉన్నారు. అయితే ఆమె పేదరికంలో చనిపోయిందని కొంతమందిలో ఉన్న అభిప్రాయం సరైంది కాదు. చనిపోయేనాటికి ఆమెకు కొన్ని ఆస్తులు మద్రాసు, హైదరాబాద్, బెంగుళూరులలోనూ ఉన్నాయని చెప్తారు. సినీ విమర్శకుడు నందగోపాల్‌కు ఇచ్చిన ఆఖరి ఇంటర్వూ్యలో సావిత్రి తన మనసులో మాటను వెలిబుచ్చారు. – ‘‘నా సమాధిపై నిలిపే సంస్మరణ ఫలకం మీద చెక్కే చివరి వాక్యాలు ఇలా ఉండాలి. ‘జీవితంలోనూ, మరణంలోనూ మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వత విశ్రాంతి పొందుతున్నది. ఎవ్వరూ ఇచ్చట సానుభూతితో వేడి కన్నీటిబొట్టు విడువనక్కర్లేదు. సమాజం దృష్టిలో ఏ తారైనా హీనంగా చూడబడకుండా ఉండటానికి ఇచ్చట నిద్రిస్తున్న మరణం లేని మహా ప్రతిభకు స్మృతిచిహ్నంగా ఒక చిన్ని పూలమాలికను ఉంచండి. అది చాలు’’ అన్నారామె.ఆమెను మనం స్మరించుకున్న రోజున ఆమె అంగీకరించే ఒక చిన్ని పూలమాలికతోపాటు, ఆమె వారించినా కూడా, ఒక వేడి నిట్టూర్పును విడవకుండా ఉండలేం. ఒక బరువెక్కిన కన్నీటి చుక్కను కార్చకుండానూ ఉండలేం. సావిత్రికి వచ్చిన చెప్పుకోదగ్గ గుర్తింపులు: ► 1960లో విడుదలైన ‘చివరకు మిగిలేది’ చిత్రంలో నటనకు రాష్ట్రపతి పురస్కారం. ► 1961లో మద్రాసు ఆళ్వార్‌పేటలో ‘శ్రీనివాస గాంధీనిలయం’ అనే సామాజిక సేవా సంస్థ ‘నడిగయర్ తిలకం’ బిరుదునిచ్చి సత్కరించడం. నడిగయర్ తిలకం అంటే నటీశిరోమణి అని అర్థం. ► 1964లో ఆంధ్ర మహిళా సభకు అనుబంధ సంస్థ అయిన ఆంధ్ర యువతీ మండలి ‘మహానటి’ బిరుదునిచ్చి సత్కరించడం. ► 1968లో తమిళనాడు ప్రభుత్వం తరఫున, అప్పటి ముఖ్యమంత్రి అన్నాదురై గారి చేతుల మీదుగా ‘కలైమామణి’ పురస్కారం. ► ‘‘నా దృష్టిలో సినిమా రంగంలో ముగ్గురు స్త్రీ శిల్పులున్నారు. రాయిని ఉలితో కొడుతూ అందమైన శిల్పాన్ని శిల్పి సృష్టిస్తాడు. కేవలం ఒక ఓర చూపుతో, కనుబొమ ముడితో, పెదవి కదలికతో, చిరునవ్వుతో, తల తిప్పడంతో ఎలాంటి భావాన్నైనా ప్రదర్శించగల ఆ ముగ్గురు స్త్రీ శిల్పుల్లో ఇద్దరు మన తెలుగువారు కావడం యావత్తు భారతదేశం గర్వించదగ్గ విషయం. మన సినిమా రంగంలోని ఆ స్త్రీ శిల్పులు సావిత్రి, జి. వరలక్ష్మి, మూడవ ఆమె హిందీ నటి మీనాకుమారి’’ – శ్రీశ్రీ. ► శ్రీశ్రీ ఉటంకించిన ముగ్గురు స్త్రీ శిల్పుల్లో ఒకరైన మీనాకు మారి సినిమాల్లో ఎక్కువగా దుఃఖపూరితమైన పాత్రలే పోషించారు. సావిత్రి కొన్ని సరదా పాత్రలు, కొన్ని సమతు ల్యమైన పాత్రలు, కొన్ని దుఃఖపూరితమైన పాత్రలు పోషిం చారు. ఇద్దరివీ సంతృప్తికరమైన వైవాహిక జీవితాలు కావు. ► గొప్ప నటి అయిన మీనా కుమారి సావిత్రి గురించి ఇలా చెప్పారు – ‘సావిత్రి నటన చూస్తుంటే చాలాసార్లు నా నటన గురించి నాకే సందేహాలు కలుగుతాయి. భావస్ఫోరకమైన కళ్లు, ఆకర్షణీయమైన పెదవులు, సందర్భోచితమైన హావభావాలు, అన్నీ కలిపి ఆమెను అత్యున్నత నటీమణుల సరసన ఉంచుతాయి.’’ ► సావిత్రికన్నా 7 సంవత్సరాలు పెద్దదైన, ముగ్గురు స్త్రీ శిల్పుల్లో మూడవ వారైన జి. వరలక్ష్మి సంతృప్తికరంగానే జీవితం గడిపారు. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా విభిన్నమైన అనుభవాలను చవిచూశారు. నిర్మాత కె.ఎస్. ప్రకాశరావును పెళ్లి చేసుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు 1995లో రఘుపతి వెంకయ్య పురస్కారమిచ్చారు. ► ఒక సందర్భంలో జి. వరలక్ష్మి ‘అమాయకురాలైన సావిత్రికి రెండవ వివాహం చట్టరీత్యా చెల్లదని తెలియదు’ అని చెప్పడం జరిగింది. 78 ఏళ్ల చివరి దశలో జెమినీ గణేశన్ 36 ఏళ్ల క్రిస్టియన్ అమ్మాయి, నర్సు అయిన జూలియానాను పెళ్లి చేసుకున్నారు. ఈ దశలో పెళ్లేమిటని అడిగితే ముదుసలి దశలో పిన్నవయస్కురాలే సరైన పరిచర్యలు చేయగలుగుతుందన్నారు. కొంతకాలం తరువాత జూలియానా జెమినీ గణేశన్ నుండి విడాకులు తీసుకున్నారు. జీవితంలో సరైన ఆదరణ, ఆప్యాయత చూపని తండ్రి జెమినీ గణేశన్ దహన సంస్కారాలకు రేఖ వెళ్లలేదు. ► 1953లో వచ్చిన దేవదాసు చిత్రం సావిత్రి నటనా జీవితానికి ఒక పెద్ద మలుపు. సావిత్రి మాటల్లో – ‘‘నేను పార్వతి లాంటి కష్టమైన పాత్రను ఎప్పుడూ చేయలేదు. ఈ పాత్రను పోషించవలసి వుందని తెలియగానే చక్రపాణి గారి పుస్తకం (దేవదాసు అనువాదం) అయిదుసార్లు చదివాను. ప్రతిసారి పార్వతి పాత్రలో లీనమైపోయేదాన్ని. ఆ పాత్రను గురించి తలచుకుంటేనే ఏడుపు వచ్చేది. నా పాత్రను నిర్వహించడానికి డైరెక్టరు గారు (వేదాంతం రాఘవయ్య) పూర్తి అవకాశాలిచ్చారు. నాకు తృప్తి లేక మళ్లీ షాట్ తీయమంటే ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా తీసేవారు. అనేకమార్లు నాకు ఆ సంభాషణలు చెబుతుంటేనే పార్వతి జీవితమంతా జ్ఞాపకం వచ్చి దుఃఖం పొంగివచ్చేది. అసలీ పిక్చర్లో గ్లిసరిన్ వాడే అవకాశమే కలగలేదు. షాట్ అయిపోయాక కూడా ఏడ్చేసేదాన్ని. ఒకవంక డైరెక్టర్ గారు (వేదాంతం రాఘవయ్య) కూడా ఏడ్చేస్తుండేవారు. మాకే విచిత్రంగా ఉండేది.’’ ► దానధర్మాల విషయంలో సావిత్రిది ఎముకలేని చెయ్యి. ఒకసారి ప్రఖ్యాత గాయని సుశీల సినీరంగంలోని సీనియర్ల సహాయార్థం విరాళాల కోసం సావిత్రి దగ్గరకు వెళ్లింది. సావిత్రి పర్సులో ఎంత డబ్బుంతో లెక్కపెట్టకుండానే ఉన్న డబ్బంతా తీసి ఇచ్చేసింది. ఒకసారి ఒళ్లంతా బంగారు నగలు వేసుకుని తన భర్త జెమినీ గణేశన్‌ను వెంటబెట్టుకుని ప్రధానమంత్రి లాల్‌బహదూర్ శాస్త్రి మద్రాసుకు వచ్చినప్పుడు కలిసి, తాను ధరించిన ఒక్కొక్క నగను ఒలుచుకుంటూ జాతీయ రక్షణ నిధికి ఇచ్చివేశారు. పేద విద్యార్థుల సహాయార్థం ముఖ్యమంత్రి యంజిఆర్ వేసుకున్న పూలదండను వేలం వేస్తే అందరికంటే ఎక్కువ ధరకు పాడి, ఆ తరువాత కట్టడానికి చేతిలో డబ్బు లేక బంగారం అమ్మి అవస్థలుపడ్డ వ్యక్తి సావిత్రి. ► జ్ఞానపీuŠ‡ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ ‘‘గాలి నిండా సువాసనను నింపే మంచి గ్రంధపు ముక్క వంటిది సావిత్రి! చీకటి చిక్కదనానికి భయపడకుండా ఉజ్వలంగా వెలిగే కర్పూర తునక వంటిది సావిత్రి!’’ అన్నారు. ► ఒక సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావుతో, బాపు, రమణలు అన్నారట – ‘‘ఈ విశ్వంలో మానవాళికి ... ఒకే భూమి, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, ఒకే ఆకాశం! ఒకే సావిత్రి... ఈ సినిమా ప్రపంచానికి!’’ వి.కె. ప్రేమ్‌చంద్ 98480 52486 – వి.కె. ప్రేమ్‌చంద్ -
ఏపీ భవన్లో ‘నందమూరి బొమ్మల కొలువు’
సాక్షి, న్యూఢిల్లీ: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్థంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ భవన్లో ఆదివారం టీమ్ ఆంధ్రప్రదేశ్ భవన్ ఆధ్వర్యంలో ‘అన్నగారి బొమ్మల కొలువు’ అనే చిత్రప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఏపీభవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలానికి చెందిన కె. బాలకోటేశ్వరరావు గీసిన 70 చిత్రాలను ప్రదర్శించారు. ఎన్టీఆర్ చిత్రాలను జీవం ఉట్టిపడేలా గీసిన చిత్రకారుడిని ఆహూతులు అభినందించారు. 2013లోనూ హైదరాబాద్ ఆర్ట్ గ్యాలరీలో మొట్టమొదటిసారిగా 150 చిత్రాలతో ప్రదర్శన నిర్వహించి నట్టు చిత్రకారుడు బాలకోటేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీభవన్ ప్రత్యేకాధికారి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సొంతగడ్డలో బొమ్మా...బొరుసు!
తండ్రికి పట్టాభిషేకం.. తనయుడికి పరాభవం.. గుడివాడలో ఎన్టీఆర్ వారసత్వం సాక్షి, మచిలీపట్నం : ఓటరు దేవుళ్ల కరుణాకటాక్ష వీక్షణలు ఎప్పుడు ఎవరిపై ఎలా ప్రసరిస్తాయన్నది చెప్పడం కష్టమే. అందులోనూ సొంతగడ్డలో జనాధరణ ఎలా ఉందనేది మిగిలిన ప్రాంతాల్లోని ప్రజలు సైతం ఆసక్తిగా గమనిస్తుంటారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా పేరు గడించిన నందమూరి తారక రామారావును పార్టీ పెట్టిన తొలినాళ్లలో బాగా ఆదరించిన గుడివాడ ఆ తరువాత అంతగా ఆదరించలేదనిభావన. హరికృష్ణను అయితే నాలుగో స్థానానికే పరిమితం చేసి...సొంత గడ్డలో ఎన్టీఆర్ వారసులకు ఇమేజ్ తగ్గిందనే సంగతిని రుజువు చేశారు. హరికృష్ణకు నాలుగో స్థానం! ఎన్టీఆర్ మరో తనయుడు నందమూరి హరికష్ణకు గుడివాడ ప్రాంతంతో అనుబంధం ఉంది. చిన్నప్పటినుంచి స్వగ్రామం నిమ్మకూరులో తాతగారి వద్దనే ఆయన ఉండేవారు. పదో తరగతి వరకు హరికృష్ణ అక్కడే చదువుకున్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తరువాత చైతన్య రథానికి హరికృష్ణ సార థి(డ్రైవర్)గా వ్యవహరించారు. ఎన్టీఆర్ మరణానంతరం టీడీపీ నుంచి బయటకు వచ్చిన హరికృష్ణ పెద్ద బావగారైన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 1999 ఎన్నికల్లో హరికృష్ణ గుడివాడ నుంచి పోటీచేసి పరాజయం పొందారు. ఈ ఎన్నికల్లో ఆయనకు నాల్గవ స్థానం దక్కింది. తరువాత హరికృష్ణ టీడీపీలో చేరి, పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడై, రాజ్యసభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యూరు. సమైక్యాంధ్ర కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఆయన ఒక్కడి రాజీనామానే హడావిడిగా ఆమోదించడం వెనుక చంద్రబాబు హస్తం ఉన్నట్టు ప్రచారం జరిగింది. తన తండ్రి ఎన్టీఆర్ పురుటిగడ్డ నిమ్మకూరు నుంచి సమైక్యాంధ్ర బస్సుయాత్రను నిర్వహిస్తానని ప్రకటించిన హరికృష్ణ.... కుటుంబీకుల వత్తిడితో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు ప్రచారం జరిగింది. గతంలోకి ఓమారు.... తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన తొలి ఎన్నికల్లో సొంతగడ్డ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. ఆయన స్వగ్రామం నిమ్మకూరు, అత్తవారి ఊరు కొమరవోలు గ్రామాలు అప్పట్లో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉన్నాయి. 2009 ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో ఎన్టీఆర్ సొంత గ్రామం, అత్తగారి ఊరు రెండు ఇప్పుడు పామర్రు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వచ్చాయి. కాగా, 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ తొలిసారిగా గుడివాడ నుంచి పోటీ చేశారు. పార్టీ అధినేతగా ఎన్టీఆర్ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి రావడంతో ఆయన పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ గుడివాడ నియోజకవర్గంలో తండ్రి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. తరువాత 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ ఎన్టీ రామారావు గుడివాడ నుంచి పోటీచేశారు. రెండోసారి ఎన్టీఆర్‌కు తగ్గిన మెజార్టీ.. గుడివాడ నియోజకవర్గంలో జయకృష్ణ ప్రచారం నిర్వహించినప్పటికీ 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్‌కు 53,906ఓట్లురాగా, కఠారి సత్యనారాయణరావు (కాంగ్రెస్) 27,368ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ 26,538ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా, 1985ఎన్నికల్లో ఇదే గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎన్టీఆర్‌కు 49,600ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి ఉప్పలపాటి సూర్యనారయణబాబు(కాంగ్రెస్)కు 42,003ఓట్లు వచ్చాయి. దీంతో 1985ఎన్నికల్లో ఇక్కడ ఎన్టీఆర్ 7,597ఓట్ల మేజార్టీతో మాత్రమే గెలుపొందారు. తొలి ఎన్నికల కంటే రెండవ సారి పోటీలో దాదాపు 20వేల ఓట్ల మెజార్టీ తగ్గిపోవడం గమనార్హం. -
రసవత్తరం... ఈ ‘నర్తనశాల’
తెలుగు పౌరాణిక చిత్రాల్లో రసవత్తర చిత్రరాజంగా చెప్పుకునే ‘నర్తనశాల’కు నేటికి 50 ఏళ్లు. ఎందరో హేమాహేమీల బృహత్తర ప్రయత్నమిది.ఎన్నిసార్లు వీక్షించినా తనివి తీరకపోవడమే ఈ సినిమాప్రత్యేకత. ఈ తరం సినిమాకీ ఓ ఇన్స్పిరేషన్ ‘నర్తనశాల’. ఆ మధ్యకాలంలో వచ్చిన ఫ్యాక్షన్ చిత్రాలు గమనిస్తే... ఒక ధీరోదాత్తుడైన కథానాయకుడు ఎక్కడో అనామకుడిలా తలదాచుకోవడం, ఆ తర్వాత అతని గతం వెల్లడి కావడం సక్సెస్ఫుల్ ఫార్ములాగా నిలిచింది. ఆ ఫార్ములాకు పుట్టిల్లు ఈ సినిమానే! ఎన్టీఆర్ ఆశ్చర్యంగా మొహం పెట్టారు. వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాలేదాయనకు. ఇన్నేళ్ల కెరీర్లో ఇప్పటివరకూ ఆయనకు రాని ప్రతిపాదన అది. ఆయనకు ఎదురుగా నటి లక్ష్మీరాజ్యం, ఆమె భర్త శ్రీధర్‌రావు కూర్చుని ఉన్నారు. ‘నర్తనశాల’ పేరుతో సినిమా చేయాలనుకుంటున్నామని, కాల్షీట్లు కావాలని అడిగితే ఎన్టీఆర్ ఆనందంగా ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ మెలిక ఏమిటంటే - అర్జునుడి పాత్రతో పాటు అటు ఆడా ఇటు మగా కాని బృహన్నల పాత్ర చేయాలట. రావణాసురుడిగా, భీష్ముడిగా చేయడమే సాహసం అనుకుంటే, పేడిగా నటించడం సాహసానికి పరాకాష్ట. అది ఏమాత్రం అటూ ఇటూ అయినా ప్రేక్షకులు తిరస్కరించడం ఖాయం. ఎన్టీఆర్ సందేహాస్పద వదనం చూడగానే లక్ష్మీరాజ్యంకు విషయం అవగతమైంది. ‘‘కళాదర్శకుడు టీవీయస్ శర్మగారు బృహన్నల పాత్రకు సంబంధించి స్కెచ్‌లు వేస్తున్నారు. అవి చూశాకనే మీ తుది నిర్ణయం వెల్లడించండి’’ అని చెప్పారామె. ఎన్టీఆర్ సరే అన్నారు. ఆయనకు లక్ష్మీరాజ్యంపై అపారమైన గౌరవం ఉంది. ‘శ్రీకృష్ణ తులాభారం’ (1935), ‘ఇల్లాలు’ (1940), ‘అపవాదు’ (1941), ‘పంతులమ్మ’ (1943) తదితర చిత్రాలతో కథానాయికగా ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు లక్ష్మీరాజ్యం. ఆమె భర్త శ్రీధర్‌రావు రెవిన్యూ ఇన్స్పెక్టర్. వీరిరువురూ కలిసి 1951లో రాజ్యం పిక్చర్స్ సంస్థను స్థాపించి ‘దాసి’ (1952), ‘హరిశ్చంద్ర’ (1956), ‘శ్రీకృష్ణలీలలు’ (1959) చిత్రాలు నిర్మించారు. ఆ సమయంలోనే ఒకాయన లక్ష్మీరాజ్యంకు మహాభారతంలోని విరాట పర్వంకు సంబంధించి ‘నర్తనశాల’ అనే పుస్తకాన్ని పంపించి, సినిమాగా తీస్తే బావుంటుందేమో అని సలహా ఇచ్చారు. లక్ష్మీరాజ్యంకు ఆ ఆలోచన చాలా బావుందనిపించింది. నిజానికి విరాట పర్వం నేపథ్యంలో పెద్దగా సినిమాలు కూడా రాలేదు. 1918లో నటరాజ మొదలియార్ ‘కీచక వధ’ అనే మూకీ తీశారు. 1937లో ‘విజయదశమి’ పేరుతో ఓ టాకీ వచ్చింది. అంతకు మించి ఇంకెవరూ సినిమాలు చేయలేదు. దానికి తోడు తెలుగు నాట విరాట పర్వానికి ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఈ విరాట పర్వం చదివితే వానలు కురుస్తాయనేది తెలుగు ప్రజల్లో ఎప్పటినుంచో పాతకుపోయిన నమ్మకం. అందుకే ‘నర్తనశాల’ను తెరకెక్కించడానికి లక్ష్మీరాజ్యం, శ్రీధర్‌రావు సంకల్పించారు. సముద్రాల రాఘవాచార్యులు (సీనియర్) స్క్రిప్టు మొత్తం సిద్ధం చేశారు. బృహన్నలగా ఎన్టీఆర్ ఓకే అంటే సినిమా మొదలు పెట్టేయొచ్చును. కళాదర్శకుడు శర్మ రంగంలోకి దిగి రకరకాల స్కెచ్‌లు వేశారు. ఒకసారి అమలాపురం వెళ్లినప్పుడు అక్కడి స్థూపం మీద ఉన్న ఓ పేడి శిల్పాన్ని ప్రేరణగా తీసుకుని స్కెచ్ వేశారు. దానికి కేరళ ప్రాంతంలోని స్త్రీల శిరోజాలంకరణను జత చేశారు. ఈ స్కెచ్‌లు చూశాక ఎన్టీఆర్‌కు ఓ నమ్మకం వచ్చింది. ప్రసిద్ధ రూపశిల్పి హరిబాబు ఆధ్వర్యంలో నాలుగు గంటలు శ్రమించి గెటప్ వేసుకున్నారు. తన గురువైన కేవీ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ గెటప్ చూపించారు. ఆయన పచ్చజెండా ఊపడంతో బృహన్నలగా చేయడానికి ఎన్టీఆర్ అంగీకారం తెలిపారు. దర్శకత్వ బాధ్యతలు కమలాకర కామేశ్వరరావు తీసుకున్నారు. ఆయనకిదే తొలి పౌరాణిక చిత్రం. ద్రౌపదిగా సావిత్రి, కీచకునిగా ఎస్వీ రంగారావు, ధర్మరాజుగా మిక్కిలినేని, భీమునిగా దండమూడి రాజగోపాల్, దుర్యోధనునిగా ధూళిపాళ, దుశ్శాసనునిగా కైకాల సత్యనారాయణ, విరాటరాజుగా ముక్కామల, సుధేష్ణగా సంధ్య, ఉత్తరగా ఎల్.విజయలక్ష్మి, అభిమన్యునిగా శోభన్‌బాబు, శ్రీకృష్ణునిగా కాంతారావు, ఉత్తర కుమారునిగా రేలంగిని ఎంపిక చేశారు. మద్రాసులోని వాహినీ, భరణీ స్టూడియోల్లో చిత్రీకరణ జరిపారు. గూడూరు సమీప ప్రాంతంలో మాత్రం యుద్ధ సన్నివేశాలు తీశారు. గోగ్రహణ ఘట్టం కోసం ఏకంగా 5 వేల పశువులను రప్పించడం విశేషం. ఈ పతాక సన్నివేశాల కోసం రెండు కెమేరాలను ఉపయోగించారు. సుమారు 4 లక్షల రూపాయల ఖర్చుతో సినిమా సిద్ధమైంది. 1963 అక్టోబరు 11న 26 కేంద్రాల్లో ‘నర్తనశాల’ విడుదలై, 19 కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమైంది. హైదరాబాద్, విజయవాడల్లో 200 రోజులు ఆడింది. బెంగాలీ, ఒరియా భాషల్లో అనువదిస్తే, అక్కడా ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ లేకపోతే ఈ సినిమానే లేదు. ఆయన ఇంతకుముందు చేసిన పౌరాణిక పాత్రలన్నీ ఒకెత్తు అయితే, ఈ బృహన్నల మాత్రం చాలా చాలా ప్రత్యేకం. ఓ పక్క పురుషత్వం, మరో పక్క స్త్రీ లాలిత్యాన్ని కలగలుపుతూ ఆయన చూపిన అభినయం ఓ పాఠ్యాంశమే. అసలీ పాత్ర కోసం అంతటి స్టార్ హీరో శ్రమించిన తీరే అబ్బురంగా అనిపిస్తుంది. బృహన్నల అంటే ఉత్తరకు నాట్యం నేర్పే నాట్యాచార్యుడు. ఉత్తరగా ఎల్.విజయలక్ష్మి చేస్తున్నారంటే, ఆమెకు ధీటుగా నృత్యం చేయగలిగాలి. అందుకోసం నెల రోజులు నృత్య దర్శకులు వెంపటి (పెద) సత్యం దగ్గర నృత్యంలో శిక్షణ తీసుకున్నారు. ఎన్టీఆర్ అంత శ్రద్ధ చూపారు కాబట్టే ఆ పాత్ర అంతలా రక్తి కట్టింది. ఇక ఈ సినిమాకు వెన్నెముకలాంటి పాత్ర ఎస్వీ రంగారావుది. సినిమాలో ఆయన పాత్ర నిడివి చిన్నదే అయినా, ఉన్నంత సేపు దడదడలాడించేశారు. మిగిలిన తారల ప్రతిభ కూడా ఉన్నత ప్రమాణాల్లో సాగింది. తొలితరం సూపర్‌స్టార్ కాంచనమాల చాలా ఏళ్ల విరామం తర్వాత ఇందులో అతిథి పాత్రలో కొన్ని క్షణాలు కనిపించారు. ఆమె ఆఖరి సినిమా ఇదే. సముద్రాల సీనియర్ కలం ఈ చిత్రానికి బలం. సుసర్ల దక్షిణామూర్తి స్వరజీవితంలో మణిమకుటాయమానంగా నిలిచే సినిమా ఇదే. ‘జనని శివ కామిని’, ‘సలలిత రాగ సుధారససారం’, ‘దరికి రాబోకు రాబోకు రాజా’, ‘నరవరా ఓ కురువరా’, ‘ఎవరి కోసం ఈ మందహాసం’, ‘సఖియా వివరించవే’ పాటలన్నీ అమృతంలో ముంచి తేల్చిన రసగుళికలు. ఎం.ఏ.రెహమాన్ ఛాయాగ్రహణ సామర్థ్యం, ఎస్.పి.ఎస్. వీరప్ప ఎడిటింగ్ పనితనం, టీవీఎస్ శర్మ కళాదర్శక నైపుణ్యం... జనం గుండెల్లో ‘నర్తనశాల’ చిరస్థాయిగా నిలిచిపోవడానికి ప్రధాన దినుసులుగా ఉపకరించాయి. ఈ సినిమానొక దృశ్యకావ్యంగా, కళాఖండంలా తీర్చిదిద్దడంలో కమలాకర కామేశ్వరరావు చేసిన కృషి అపూర్వం. ఆయన పౌరాణిక చిత్రబ్రహ్మగా పేరు తెచ్చుకోవడానికి ఈ సినిమానే తొలి మెట్టు. 1963లో జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు సినిమా ఇదే. -
దండాలయ్య... ఉండ్రాళ్లయ్యా...
మన దేశంలో దేవుళ్లకు కొదవ లేదు. అలాగే పండగలక్కూడా. ఒక్కో దేవుడికి ఒక్కో పండగ. అయితే... ఆ పండగ వాతావరణాన్ని ప్రతిబింబించేది మాత్రం పాటలే. సినిమా పాటలైతే మరీనూ. నేడు ‘వినాయకచవితి’. సిద్ధి వినాయకుణ్ణి మన తెలుగు సినిమా రచయితలు, హీరోలు, దర్శకులు ఎన్నడూ మర్చిపోలేదు. ప్రతి తరంలోనూ వినాయకుడిని స్తుతిస్తూ పాటలు పాడుతూనే ఉన్నారు. వాటిలో బాగా హిట్టయిన కొన్నింటిని ఇప్పుడు గుర్తు చేసుకుందామా మరి. *** ‘వాతాపి గణపతింభజే...’ ఇది ఎన్టీఆర్ ‘వినాయకచవితి’(1957) చిత్రంలోని పాట అనే చాలా మంది అనుకుంటుంటారు. కానీ అది నిజం కాదు. స్వరత్రిమూర్తుల్లో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్ రచించి, హంసధ్వని రాగంలో స్వరపరిచిన కీర్తన ఇది. ఆ పాటనే ‘వినాయకచవితి’ సినిమాకు ఉపయోగించుకోవడం జరిగింది. ఈ పాట ఏ రోజు వినిపించినా ఆ రోజే వినాయకచవితేమో అనే ఫీలింగ్. ఘంటసాల అంత తన్మయత్వంతో పాడారు ఈ పాటను. ముత్తుస్వామి దీక్షితార్ స్వరరచన సౌకుమార్యం చెడకుండా, దాన్ని సినీ పక్కీలోకి మార్చడానికి ఆ చిత్ర సంగీత దర్శకుడైన ఘంటసాల అనుభవించిన స్ట్రగుల్ అంతా ఇంతా కాదు. ఈ పాట విన్న ప్రతిసారీ మనకు ఆ విషయం అవగతమవుతూనే ఉంటుంది. ఏది ఏమైనా ఇద్దరు మహనీయుల పుణ్యమా అని ఆ పాట ఇప్పటికీ తెలుగు శ్రోతల్ని భక్తిపారవశ్యంలో తేలియాడిస్తూనే ఉంది. *** ‘ఎవరవయ్యా... ఎవరవయ్యా... ఏ దివ్య భువి నుంచి దిగి.. ఈ అమ్మ ఒడిలోనే ఒదిగి..’ పొత్తిళ్లలో ఉన్న పసిగణపతిని ఉద్దేశించి పరమేశ్వరి పాడే లాలిపాట ఇది. ‘వినాయక విజయం’(1980) చిత్రంలో ఈ పాటను జనరంజకంగా తెరకెక్కించారు దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. ఈ పాటలో పార్వతీదేవిగా వాణిశ్రీ అభినయం అద్భుతం. సాలూరివారి స్వర సోయగం అపూర్వం. *** ‘శ్రీగణనాథం భజామ్యహం...’ ఇది త్యాగరాయకృతి. దీన్నే ‘శ్రుతిలయలు’(1987) సినిమాకోసం ఉపయోగించుకున్నారు దర్శకుడు కె.విశ్వనాథ్. పూర్ణచందర్, శ్రీనివాస్ కలిసి ఆలపించిన ఈ గీతం సంగీత ప్రియులను విశేషంగా అలరించింది. రాజశేఖర్, నరేష్‌లపై ఈ పాటను చిత్రీకరించారు విశ్వనాథ్. ఈ పాట వింటుంటే... ఏదో ఆలయంలో ఉన్న ఫీలింగ్. *** ‘దండాలయ్య.. ఉండ్రాళ్లయ్యా దయుంచయ్యా దేవ...’ వినాయకచవితి పర్వదినం అనగానే... ప్రతి ఇంటా వినిపించే పాట ‘వాతాపిగణపతింభజే’. ఆ పాట తర్వాత మళ్లీ అంత స్థాయిలో మారుమ్రోగే పాట ఇది. ‘కూలీ నెంబర్ 1’(1991) సినిమా కోసం ఇళయరాజా స్వరపరిచిన ఈ పాట మ్రోగని గణేశుని పందిరి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆయన నిమజ్జనం రోజున కూడా ప్రతి చోటా ఈ పాటే. ఆ విధంగా అటు దర్శకుడు రాఘవేంద్రరావుని, ఇటు హీరో వెంకటేష్‌ని పునీతుల్ని చేసిందీ పాట. *** ‘జయజయ సుభకర వినాయక..’ ‘దేవుళ్లు’(2001) సినిమాలో కాణిపాకం గణపతిపై చిత్రీకరించిన పాట ఇది. ఈ పాట సన్నివేశం చాలా నవ్యంగా ఉంటుంది. ఆదిగణపతిగా ఎస్పీ బాలసుబ్రమణ్యం నటన అమోఘం. ఇక బాలు గానం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభ, వందేమాతరం శ్రీనివాస్ సంగీత సామర్థ్యం ఈ పాటను గొప్ప స్థాయిలో నిలబెట్టింది. ఇవి మచ్చుకు మాత్రమే... ‘నర్తనశాల’(1963)లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన ‘శ్రీగణనాయక.. విఘ్న వినాయక’ పాట, ‘మార్నింగ్ రాగా’(2004)లో ముత్తుస్వామి దీక్షితార్ రాసిన ‘మహా గణపతిం.. మనసా స్మరామి’ కీర్తన, ‘జై చిరంజీవా’(2005)లోని ‘జైజై గణేశా... జై కొడుతా గణేశా’ పాట, ‘100%లవ్’ చిత్రంలోని ‘తిరు తిరు గణనాథ దిద్దిద్ధిత్తై... ఇలా చెప్పుకుంటే... వెండితెరను ధన్యం చేసిన విఘ్నపతి పాటలు ఎన్నో... ఎన్నో.. ఎన్నెన్నో... -
ఎన్టీఆర్ కథతో వచ్చిన హిందీ సినిమా!
ఎన్టీఆర్ అంటే సూపర్‌స్టార్... గ్రేట్ డెరైక్టర్... టాప్ ప్రొడ్యూసర్. కానీ ఈ జాబితాలో ఇంకో శాఖను కూడా చేర్చాల్సిందే. ఆయనో ఫెంటాస్టిక్ స్టోరీ రైటర్. ఈ విషయం కొంతమందికే తెలుసు. చాలా గొప్ప గొప్ప సినిమాలకు ఆయనే కథారచయిత. అందులో సాంఘికాలున్నాయి. పౌరాణికాలున్నాయి. చారిత్రకాలు న్నాయి. ఆయన ఏ జానర్లో కథ రాసినా చాలా రీసెర్చి చేస్తారు. టైటిల్స్‌లో కథార చయితగా ఆయన పేరు మొదట కనిపించింది ‘ఉమ్మడి కుటుంబం’లో. ఆ తర్వాత వరకట్నం, కోడలు దిద్దిన కాపురం, తల్లా పెళ్లామా, తాతమ్మ కల, వేములవాడ భీమకవి, చాణక్య-చంద్రగుప్త, అక్బర్-సలీం-అనార్కలి, తిరుపతి వెంకటేశ్వర కల్యాణం, శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మంగారి చరిత్ర, దానవీరశూరకర్ణ... ఇత్యాది చిత్రాలకు కథనందించారు ఎన్టీఆర్. వీటిల్లో అత్యధిక శాతం ఘనవిజయం సాధించినవే. ఇక అసలు విషయానికొస్తే - ఎన్టీఆర్ కథతో ఓ హిందీ సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు ‘బిదాయి’. ఎల్వీ ప్రసాద్ దర్శక నిర్మాత. తెలుగులో విజయం సాధించిన ‘తల్లా పెళ్లామా’ రీమేక్ రైట్స్ తీసుకుని ఎల్వీ ప్రసాద్ హిందీలో ఈ సినిమా చేశారు. జితేంద్ర, లీనా చందావర్కర్, మదన్‌పురి నటించారు. లక్ష్మీకాంత్-ప్యారే లాల్ స్వరాలందించారు. అక్కడ హిందీ పోస్టర్లపై ‘స్టోరీ: ఎన్టీ రామారావు’ అని ప్రత్యేకంగా వేశారు. 1974 అక్టో బర్ 9న విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్లో కనకవర్షం కురిపించింది. లెక్కలేనంత డబ్బు. దాంతో ల్యాబ్ పెట్టాలని, ఎల్వీప్రసాద్ నిర్ణయించారు. అలా ప్రసాద్ ల్యాబ్ ఏర్పడింది. అలాగే ‘మరో చరిత్ర’ను హిందీలో ‘ఏక్ దూజే కే లియే’గా రీమేక్ చేస్తే, బంపర్ హిట్టయ్యింది. ఆ డబ్బుతోనే ప్రసాద్ ల్యాబ్‌ని బాగా విస్తరింపజేశారు. -
‘బందిపోటు సినిమాకు 50 ఏళ్లు
సుందర్‌లాల్ నహతా అంటే ఆ రోజుల్లో ఫేమస్ ఫైనాన్షియర్, ప్రొడ్యూసర్. అందరూ సేఠ్‌గారని పిలిచేవారు. ఫైనాన్స్ సంగతి పక్కనపెడితే, ఆయన చాలా మంచి సినిమాలు తీస్తుండేవారు. డూండీ భాగస్వామ్యంలో రాజలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై ‘శాంతినివాసం’ (1961), ‘ఖైదీ కన్నయ్య’ (1962), ‘రక్త సంబంధం’ (1962)లాంటి సినిమాలు తీశారు. ఈసారి కాంతారావు, రాజనాలను పెట్టి బి.విఠలాచార్య దర్శకత్వంలో బ్రహ్మాండమైన జానపదం తీయాలనుకున్నారు. కథ రాసే బాధ్యతను త్రిపురనేని మహారథికి అప్పగించారు. మహారథి అప్పటికి డబ్బింగ్ సినిమాల కింగ్. డెరైక్ట్ సినిమాకి రాయడం మాత్రం ఇదే ప్రథమం. డూండీకి కుటుంబ మిత్రుడాయన. మహారథి కథ తయారీలో పడ్డారు. ఫ్రెంచ్ విప్లవ యోథుడు స్కార్లెట్ పిప్పర్సన్ జీవితగాథతో పాటు ఇంకొన్ని కథలను మహారథికి రిఫరెన్స్‌గా ఇచ్చారు దర్శకనిర్మాతలు. కథ సిద్ధమైంది. సుందర్‌లాల్ నహతా కథ విని ‘అద్భుతం... అమోఘం’ అన్నారు. కథ విన్నాక నహతా ఆలోచన కూడా మారింది. దీనికి ఎన్టీఆర్ యాప్ట్ అనుకున్నారు. అనుకోవడమే తరువాయి ఎన్టీఆర్‌తో మాట్లాడి కాల్షీట్లు తీసేసుకున్నారు. విఠలాచార్య డైరక్షన్లో ఎన్టీఆర్ చేయడం కూడా అదే ప్రథమం. అలా ‘బందిపోటు’ తెరకెక్కింది. చకచకా షూటింగ్ అయిపోయింది. విఠలాచార్య వర్కింగ్ స్టయిల్, బడ్జెట్ కంట్రోల్ ఇత్యాది పద్ధతులు ఎన్టీఆర్‌ని ఆకట్టుకున్నాయి. అప్పటివరకూ ఎన్టీఆర్ చాలా జానపదాలు చేసినా ఆయనకే ఏదో కొత్త తరహాగా అనిపించింది. 1963 ఆగస్టు 15న ‘బందిపోటు’ విడుదలైనప్పుడు ప్రేక్షకులూ అదే ఫీలయ్యారు. సర్వసాధారణంగా జానపదాలంటే మాయలూ మంత్రాల హంగామా ఎక్కువ ఉంటుంది. ఇందులో ఎక్కువగా మానవ సంబంధాల నేపథ్యాన్ని అనుసరించారు. అందుకే ఈ కొత్త తరహా జానపదాన్ని చూసి ప్రేక్షకుల గుండెలు ఝల్లుమన్నాయి. ఎన్టీఆర్‌ని మాస్ జనం ఎలా చూడాలనుకుంటారో అంతకన్నా ఎక్కువగానే విఠలాచార్య చూపించారు. ఎన్టీఆర్ తిప్పిన కత్తి కన్నా, ఆయన పాత్ర తీరుతెన్నులే పదునుగా అనిపించాయి. ఇక పాటలైతే సూపర్బ్. ముఖ్యంగా ‘ఊహలు గుసగుసలాడె’, ‘వగలరాణివి నీవె’ పాటలైతే ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఘంటసాల సంగీతానికి, గాత్రానికి హేట్సాఫ్ చెప్పాల్సిందే. మహారథి డైలాగ్స్‌కైతే ప్రేక్షకులు సాహో అన్నారు. ఇందులో కృష్ణకుమారి కథానాయిక. అప్పటికే ఎన్టీఆర్, కృష్ణకుమారి జోడీకి యమా క్రేజ్. వీరి కలయికలో ఇది ఏడో సినిమా. విలన్‌గా రాజనాల అదరగొట్టేశారు. రేలంగి, గిరిజల కామెడీ, గుమ్మడి, నాగయ్య, మిక్కిలినేని, రమణారెడ్డిల నటన ఈ సినిమాకు వన్నెలద్దాయి. కథ విషయానికొస్తే - ఓ చందమామ కథలాగానే అనిపిస్తుంది. రాజుగారి బావమరిది రాజ్యంలో అరాచకం సృష్టించడం, దానిని ముసుగు మనిషి వేషంలో కథానాయకుడు ఎదిరించడం, రాజుని బావమరిది బంధించడం, చివరకు కథానాయకుడు రాజుని రక్షించడం... క్లుప్తంగా ఇదీ కథ. దీనికి ఎన్ని హంగులు అద్దాలో అన్నీ అద్దారు విఠలాచార్య. అసలు అద్భుత రసాన్ని వెండితెరపై ఆయన ఉపయోగించినట్టుగా ఇంకెవరూ వాడలేదేమో. అందుకేనేమో కొన్ని కొన్ని హాలీవుడ్ సినిమాలను ప్రపంచమంతా అద్భుతం అని కీర్తించినా, మన తెలుగువాళ్లకు మాత్రం ‘ఇందులో గొప్పేం ఉంది. ఇవన్నీ మనమెప్పుడో విఠలాచార్య సినిమాలో చూసేశాం కదా’ అనిపించేది. ఎన్టీఆర్‌తో చాలామంది దర్శకులు వండర్స్ సృష్టించినా, బి.విఠలాచార్యతో మాత్రం ఎన్టీఆర్‌ది ఓ స్పెషల్ కాంబినేషనే అని చెప్పుకోవాలి. తెలుగు ప్రేక్షకులు బాగా మెచ్చిన హీరో - డెరైక్టర్ కాంబినేషన్‌ల్లో ముందు వరుసలో ఎన్టీఆర్-విఠలాచార్య కాంబినేషన్ కూడా నిలుస్తుంది. ఈ ఇద్దరూ కలిసి మొత్తం 14 సినిమాలు చేశారు. అందులో 11 హిట్లు ఉన్నాయంటే మాటలా మరి! సరిగ్గా ‘బందిపోటు’ విడుదల సమయానికే తెలుగు తెరపై ‘కలర్ ట్రెండ్’ మొదలైంది. అందుకే ఇందులో పతాక సన్నివేశాల్ని రంగుల్లో తెరకెక్కించారు. 5 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుందీ సినిమా. ‘బందిపోటు’ విడుదలై నేటికి 50 ఏళ్లు. ఎప్పటికీ మరిచిపోలేని జానపదం ఇది.