తెలుగు పౌరాణిక చిత్రాల్లో రసవత్తర చిత్రరాజంగా చెప్పుకునే ‘నర్తనశాల’కు నేటికి 50 ఏళ్లు. ఎందరో హేమాహేమీల బృహత్తర ప్రయత్నమిది.ఎన్నిసార్లు వీక్షించినా తనివి తీరకపోవడమే ఈ సినిమాప్రత్యేకత. ఈ తరం సినిమాకీ ఓ ఇన్‌స్పిరేషన్ ‘నర్తనశాల’. ఆ మధ్యకాలంలో వచ్చిన ఫ్యాక్షన్ చిత్రాలు గమనిస్తే... ఒక ధీరోదాత్తుడైన కథానాయకుడు ఎక్కడో అనామకుడిలా తలదాచుకోవడం, ఆ తర్వాత అతని గతం వెల్లడి కావడం సక్సెస్‌ఫుల్ ఫార్ములాగా నిలిచింది. ఆ ఫార్ములాకు పుట్టిల్లు ఈ సినిమానే!
ఎన్టీఆర్ ఆశ్చర్యంగా మొహం పెట్టారు. వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాలేదాయనకు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకూ ఆయనకు రాని ప్రతిపాదన అది. ఆయనకు ఎదురుగా నటి లక్ష్మీరాజ్యం, ఆమె భర్త శ్రీధర్‌రావు కూర్చుని ఉన్నారు. ‘నర్తనశాల’ పేరుతో సినిమా చేయాలనుకుంటున్నామని, కాల్షీట్లు కావాలని అడిగితే ఎన్టీఆర్ ఆనందంగా ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ మెలిక ఏమిటంటే - అర్జునుడి పాత్రతో పాటు అటు ఆడా ఇటు మగా కాని బృహన్నల పాత్ర చేయాలట.
రావణాసురుడిగా, భీష్ముడిగా చేయడమే సాహసం అనుకుంటే, పేడిగా నటించడం సాహసానికి పరాకాష్ట. అది ఏమాత్రం అటూ ఇటూ అయినా ప్రేక్షకులు తిరస్కరించడం ఖాయం. ఎన్టీఆర్ సందేహాస్పద వదనం చూడగానే లక్ష్మీరాజ్యంకు విషయం అవగతమైంది. ‘‘కళాదర్శకుడు టీవీయస్ శర్మగారు బృహన్నల పాత్రకు సంబంధించి స్కెచ్‌లు వేస్తున్నారు. అవి చూశాకనే మీ తుది నిర్ణయం వెల్లడించండి’’ అని చెప్పారామె. ఎన్టీఆర్ సరే అన్నారు. ఆయనకు లక్ష్మీరాజ్యంపై అపారమైన గౌరవం ఉంది. ‘శ్రీకృష్ణ తులాభారం’ (1935), ‘ఇల్లాలు’ (1940), ‘అపవాదు’ (1941), ‘పంతులమ్మ’ (1943) తదితర చిత్రాలతో కథానాయికగా ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు లక్ష్మీరాజ్యం. ఆమె భర్త శ్రీధర్‌రావు రెవిన్యూ ఇన్‌స్పెక్టర్. వీరిరువురూ కలిసి 1951లో రాజ్యం పిక్చర్స్ సంస్థను స్థాపించి ‘దాసి’ (1952), ‘హరిశ్చంద్ర’ (1956), ‘శ్రీకృష్ణలీలలు’ (1959) చిత్రాలు నిర్మించారు. ఆ సమయంలోనే ఒకాయన లక్ష్మీరాజ్యంకు మహాభారతంలోని విరాట పర్వంకు సంబంధించి ‘నర్తనశాల’ అనే పుస్తకాన్ని పంపించి, సినిమాగా తీస్తే బావుంటుందేమో అని సలహా ఇచ్చారు.
లక్ష్మీరాజ్యంకు ఆ ఆలోచన చాలా బావుందనిపించింది. నిజానికి విరాట పర్వం నేపథ్యంలో పెద్దగా సినిమాలు కూడా రాలేదు. 1918లో నటరాజ మొదలియార్ ‘కీచక వధ’ అనే మూకీ తీశారు. 1937లో ‘విజయదశమి’ పేరుతో ఓ టాకీ వచ్చింది. అంతకు మించి ఇంకెవరూ సినిమాలు చేయలేదు. దానికి తోడు తెలుగు నాట విరాట పర్వానికి ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఈ విరాట పర్వం చదివితే వానలు కురుస్తాయనేది తెలుగు ప్రజల్లో ఎప్పటినుంచో పాతకుపోయిన నమ్మకం. అందుకే ‘నర్తనశాల’ను తెరకెక్కించడానికి లక్ష్మీరాజ్యం, శ్రీధర్‌రావు సంకల్పించారు. సముద్రాల రాఘవాచార్యులు (సీనియర్) స్క్రిప్టు మొత్తం సిద్ధం చేశారు.
బృహన్నలగా ఎన్టీఆర్ ఓకే అంటే సినిమా మొదలు పెట్టేయొచ్చును. కళాదర్శకుడు శర్మ రంగంలోకి దిగి రకరకాల స్కెచ్‌లు వేశారు. ఒకసారి అమలాపురం వెళ్లినప్పుడు అక్కడి స్థూపం మీద ఉన్న ఓ పేడి శిల్పాన్ని ప్రేరణగా తీసుకుని స్కెచ్ వేశారు. దానికి కేరళ ప్రాంతంలోని స్త్రీల శిరోజాలంకరణను జత చేశారు. ఈ స్కెచ్‌లు చూశాక ఎన్టీఆర్‌కు ఓ నమ్మకం వచ్చింది. ప్రసిద్ధ రూపశిల్పి హరిబాబు ఆధ్వర్యంలో నాలుగు గంటలు శ్రమించి గెటప్ వేసుకున్నారు. తన గురువైన కేవీ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ గెటప్ చూపించారు. ఆయన పచ్చజెండా ఊపడంతో బృహన్నలగా చేయడానికి ఎన్టీఆర్ అంగీకారం తెలిపారు.
దర్శకత్వ బాధ్యతలు కమలాకర కామేశ్వరరావు తీసుకున్నారు. ఆయనకిదే తొలి పౌరాణిక చిత్రం. ద్రౌపదిగా సావిత్రి, కీచకునిగా ఎస్వీ రంగారావు, ధర్మరాజుగా మిక్కిలినేని, భీమునిగా దండమూడి రాజగోపాల్, దుర్యోధనునిగా ధూళిపాళ, దుశ్శాసనునిగా కైకాల సత్యనారాయణ, విరాటరాజుగా ముక్కామల, సుధేష్ణగా సంధ్య, ఉత్తరగా ఎల్.విజయలక్ష్మి, అభిమన్యునిగా శోభన్‌బాబు, శ్రీకృష్ణునిగా కాంతారావు, ఉత్తర కుమారునిగా రేలంగిని ఎంపిక చేశారు. మద్రాసులోని వాహినీ, భరణీ స్టూడియోల్లో చిత్రీకరణ జరిపారు. గూడూరు సమీప ప్రాంతంలో మాత్రం యుద్ధ సన్నివేశాలు తీశారు. గోగ్రహణ ఘట్టం కోసం ఏకంగా 5 వేల పశువులను రప్పించడం విశేషం. ఈ పతాక సన్నివేశాల కోసం రెండు కెమేరాలను ఉపయోగించారు. సుమారు 4 లక్షల రూపాయల ఖర్చుతో సినిమా సిద్ధమైంది.
1963 అక్టోబరు 11న 26 కేంద్రాల్లో ‘నర్తనశాల’ విడుదలై, 19 కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమైంది. హైదరాబాద్, విజయవాడల్లో 200 రోజులు ఆడింది. బెంగాలీ, ఒరియా భాషల్లో అనువదిస్తే, అక్కడా ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ లేకపోతే ఈ సినిమానే లేదు. ఆయన ఇంతకుముందు చేసిన పౌరాణిక పాత్రలన్నీ ఒకెత్తు అయితే, ఈ బృహన్నల మాత్రం చాలా చాలా ప్రత్యేకం. ఓ పక్క పురుషత్వం, మరో పక్క స్త్రీ లాలిత్యాన్ని కలగలుపుతూ ఆయన చూపిన అభినయం ఓ పాఠ్యాంశమే. అసలీ పాత్ర కోసం అంతటి స్టార్ హీరో శ్రమించిన తీరే అబ్బురంగా అనిపిస్తుంది.
బృహన్నల అంటే ఉత్తరకు నాట్యం నేర్పే నాట్యాచార్యుడు. ఉత్తరగా ఎల్.విజయలక్ష్మి చేస్తున్నారంటే, ఆమెకు ధీటుగా నృత్యం చేయగలిగాలి. అందుకోసం నెల రోజులు నృత్య దర్శకులు వెంపటి (పెద) సత్యం దగ్గర నృత్యంలో శిక్షణ తీసుకున్నారు. ఎన్టీఆర్ అంత శ్రద్ధ చూపారు కాబట్టే ఆ పాత్ర అంతలా రక్తి కట్టింది. ఇక ఈ సినిమాకు వెన్నెముకలాంటి పాత్ర ఎస్వీ రంగారావుది. సినిమాలో ఆయన పాత్ర నిడివి చిన్నదే అయినా, ఉన్నంత సేపు దడదడలాడించేశారు. మిగిలిన తారల ప్రతిభ కూడా ఉన్నత ప్రమాణాల్లో సాగింది. తొలితరం సూపర్‌స్టార్ కాంచనమాల చాలా ఏళ్ల విరామం తర్వాత ఇందులో అతిథి పాత్రలో కొన్ని క్షణాలు కనిపించారు. ఆమె ఆఖరి సినిమా ఇదే.
సముద్రాల సీనియర్ కలం ఈ చిత్రానికి బలం. సుసర్ల దక్షిణామూర్తి స్వరజీవితంలో మణిమకుటాయమానంగా నిలిచే సినిమా ఇదే. ‘జనని శివ కామిని’, ‘సలలిత రాగ సుధారససారం’, ‘దరికి రాబోకు రాబోకు రాజా’, ‘నరవరా ఓ కురువరా’, ‘ఎవరి కోసం ఈ మందహాసం’, ‘సఖియా వివరించవే’ పాటలన్నీ అమృతంలో ముంచి తేల్చిన రసగుళికలు. ఎం.ఏ.రెహమాన్ ఛాయాగ్రహణ సామర్థ్యం, ఎస్.పి.ఎస్. వీరప్ప ఎడిటింగ్ పనితనం, టీవీఎస్ శర్మ కళాదర్శక నైపుణ్యం... జనం గుండెల్లో ‘నర్తనశాల’ చిరస్థాయిగా నిలిచిపోవడానికి ప్రధాన దినుసులుగా ఉపకరించాయి.
ఈ సినిమానొక దృశ్యకావ్యంగా, కళాఖండంలా తీర్చిదిద్దడంలో కమలాకర కామేశ్వరరావు చేసిన కృషి అపూర్వం. ఆయన పౌరాణిక చిత్రబ్రహ్మగా పేరు తెచ్చుకోవడానికి ఈ సినిమానే తొలి మెట్టు. 1963లో జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు సినిమా ఇదే.