నైతికతకు పట్టం కట్టాల్సిన పోరు | Devulapalli Amar article on Nandyal By elections | Sakshi
Sakshi News home page

నైతికతకు పట్టం కట్టాల్సిన పోరు

Published Wed, Aug 16 2017 1:04 AM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

నైతికతకు పట్టం కట్టాల్సిన పోరు - Sakshi

నైతికతకు పట్టం కట్టాల్సిన పోరు

డేట్‌లైన్‌ హైదరాబాద్‌
నంద్యాల ఉపఎన్నికలో గెలవడానికి చంద్రబాబు ఇంత అవస్థ ఎందుకు పడుతున్నారు? ఆయనా, ఆయన మంత్రులు, అనుచరగణం కలసి వందలు, వేల కోట్ల రూపాయల పనులు చేస్తామని నంద్యాల ప్రజలను ప్రలోభ పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? తన పాలన పట్ల ప్రజాభిప్రాయం ఎట్లా ఉందో ఆయన చేయించుకున్న సర్వేలే స్పష్టం చేశాయి మరి. ఏ మాత్రం వీలున్నా, ఎన్నికల కమిషన్‌ కూడా స్పీకర్ల వ్యవస్థ లాగా తన చెప్పుచేతల్లో నడిచేదే అయితే, తప్పకుండా ఆయన ఈ ఉపఎన్నికను జరగకుండా ఆపించి ఉండేవారు.

నందమూరి తారక రామారావు 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొత్తలో కాంగ్రెస్‌ వాళ్లను తిట్టడానికి ఒక మాట వాడేవారు. ఆయనకు ఆ మాటంటే చాలా మోజు. పదే పదే వాడే వారు. జనానికి కూడా బాగా నచ్చింది. ఆయన నోటి వెంట ఆ మాట వచ్చిన ప్రతిసారీ సభ ఆవరణ అంతా ఈలలూ, చప్పట్లతో మార్మోగేది. కొన్ని వందల బహిరంగ సభల్లో ఆయన ఆ మాట వాడి ఉంటారు. రాజకీయాల్లో ఆ మాట బాగా ప్రసిద్ధి చెందింది కూడా ఆయన కారణంగానే. ఆ రోజుల్లో కాంగ్రెస్‌ వాళ్లను తిట్టడానికి ఆయన వాడిన ఆ మాట ‘‘కుక్కమూతి పిందెలు’’. రాజకీయాల్లో అక్కడక్కడ కుక్కమూతి పిందెలు మొలవడం సహజమే.

కానీ, తాను స్థాపించిన పార్టీయే తరువాత కాలంలో, తన సొంత అల్లుడి నేతృత్వంలోనే కుక్కమూతి పిందెలకు నిలయం అవుతుందని మహానుభావుడు ఎన్‌టీ రామారావు ఊహించి కూడా ఉండరు. ఆయనే జీవించి ఉంటే తెలుగుదేశం పార్టీ ఇంకా ఆయన అదుపులోనే ఉంటే కచ్చితంగా ఈ కుక్కమూతి పిందెలను ఎరివేసేవారు, అది సాధ్యం కాదనుకుంటే పార్టీనే రద్దు చేసి ఉండేవారు. కొందరు ఆయన చర్యలను మూర్ఖత్వం కింద కొట్టిపారేసినా, నమ్మిన దానికోసం అధికారాన్నే తృణప్రాయంగా ఎడమ చేత్తో విదిలించి పారేసిన నాయకుడు ఎన్‌టీఆర్‌.

విలువలకు పట్టంగట్టిన నేత ఎన్‌టీఆర్‌
ఆయన రాజకీయ జీవితం కేవలం పద్నాలుగు సంవత్సరాలే. ఆ స్వల్ప కాలంలోనే ఆయన రెండుసార్లు అధికారం కోల్పోతానని తెలిసి కూడా తాను చెయ్యదల్చుకున్నది చేసేశారు. అంతే తప్ప, అధికారాన్ని కాపాడుకోవాలని, పట్టుకుని వేళ్లాడాలని కుక్క మూతి పిందెలను దరిచేరనివ్వలేదు. ఎన్నికల ముంగిట్లో నిలబడి కూడా మంత్రి వర్గాన్ని మొత్తంగా రద్దు చేసి పారెయ్యగలిగిన ధైర్యం ఆయనది. ఆ కారణంగానే ఆయన 1989లో అధికారం కోల్పోయారు. మళ్లీ 1995లో అదే జరిగింది.

శ్రేయోభిలాషుల సలహా పాటించి ఒంటరిగా వైస్రాయ్‌ హోటల్‌లో చంద్రబాబు ఏర్పాటు చేసిన క్యాంప్‌కు వెళ్లి ఎంఎల్‌ఏలను కలసి ఉంటే అల్లుడి రాజకీయ జీవితం అక్కడితో ముగిసి ఉండేది. వైస్రాయ్‌ హాటల్‌ క్యాంప్‌ రాజకీయాలను ఒక ప్రధాన దినపత్రిక ముఖ్య విలేకరిగా ప్రత్యక్షంగా చూసిన జర్నలిస్ట్‌గా ఆ మాట కచ్చితంగా చెప్పగలను. విలేకరులం ఆ క్యాంప్‌లోని ఏ శాసన సభ్యుడిని కదిలించినా ఎన్‌టీ రామారావుకు ద్రోహం చేస్తున్నామన్న బాధ, ఆవేదన వారిలో స్పష్టంగా కని పించేది.

ఒక్కసారి అన్నగారు క్యాంప్‌కు వచ్చి భరోసా ఇస్తే మూకుమ్మడిగా ఆయన వెంట బయటికి వెళ్లిపోయి ఉండేవారు ఎంఎల్‌ఏలు. ఎక్కువ మంది ఎంఎల్‌ఏలు క్యాంప్‌లో ఉండిపోయి చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇవ్వడానికి కారణం ఎన్‌టీఆర్‌ శాసన సభ రద్దు కోసం గవర్నర్‌కు సిఫారసు చెయ్యబోతున్నాడనే ప్రచారాన్ని చంద్రబాబు బలంగా వ్యాపింప చెయ్యడమే. ఎన్‌టీఆర్‌ స్వయంగా, ఒంటరిగా వచ్చి, అట్లా చెయ్యబోనని ఒక్కమాట అని ఉంటే ఆ భరోసాతో వారు ఆయనతో వెళ్లి ఉండే వారు. చంద్రబాబు పని ఆనాడే ‘‘ఖేల్‌ ఖతం దుకాన్‌ బంద్‌’’ అయ్యుండేది. కానీ ఎన్‌టీఆర్‌ ఆ పని చెయ్యలేదు. అధికారం కోల్పోయారు. అయితేనేం విలువలకు కట్టుబడి ఉన్న పేరు నిలిచిపోయింది. అధికారం శాశ్వతం అనో లేదా అది శాశ్వతంగా తనకే ఉండాలనో కోరుకున్న వారు కాదు కాబట్టే ఎన్‌టీ రామారావు ఆ పని చెయ్యగలిగారు.

ఆయన చనిపోయి రెండు దశాబ్దాలు దాటినాక, ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోవడం ఇప్పుడెందుకు? అని ఎవరయినా అడగొచ్చు. కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ స్థానానికి ఈ నెల 23వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న సందర్భంగా... అటు అధికార పక్షం అయిన తెలుగుదేశం పార్టీ, దాని అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలకిందులుగా చేస్తున్న విన్యాసాలనూ, ఇటు రాజకీయాల్లో విలువలను ముందుకు తీసుకుపోతానని చెప్పడమే కాదు, పాటించి చూపుతున్న ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, దాని అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రచారాన్నీ పోల్చి చూస్తుంటే ఎన్‌టీఆర్‌ నడిపిన రాజకీయాలను గుర్తు చేసుకోవడం అవసరం అనిపించింది.

అధర్మ యుద్ధం సాగిస్తున్న అధికార పక్షం
ఎన్‌టీ రామారావు జీవించి ఉంటే జగన్‌మోహన్‌రెడ్డిని, శిల్పా చక్రపాణిరెడ్డిని మనస్ఫూర్తిగా అభినందించి ఉండేవారు. ఒక పార్టీ ద్వారా ఎన్నికై, ఇంకో పార్టీలోకి వెళ్లాలనుకునే వారు వారి పదవులకు రాజీనామా చెయ్యాల్సి ఉంటుందని పార్టీ పెట్టిన కొద్ది రోజులకే తిరుపతి మహానాడులో నిర్ణయించి, దానికి కట్టుబడనందుకు ఆదయ్య, నారాయణ వంటి వారిని పార్టీ నుండి బహిష్కరించారు. అలాంటి తన విగ్రహానికి మొక్కుబడిగా దండలు వేసి తన విధానాలను, విలువలను ఏట్లోకి విసిరేసిన నేటి తెలుగుదేశం పార్టీని, దాని ప్రస్తుత నాయకుడిని కచ్చితంగా ఛీత్కరించుకుని ఉండేవారు. ఎన్టీఆర్‌ కోరుకున్న విలువలను పాటిస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో ఆయన చీదరించుకున్న, ద్వేషించిన కుక్కమూతి పిందెలతో నిండిన అధికార పక్షం చేస్తున్న అధర్మ యుద్ధాన్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లో సమర్థించి ఉండేవారు కాదు.

తెలుగుదేశం పార్టీ ద్వారా సంక్రమించిన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసి, దొంగ వేషాలూ దొడ్డి దారులూ వెతుక్కోకుండా, స్పీకర్‌ ఫార్మాట్‌లో ఆ రాజీనామాను సమర్పించి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరిన చక్రపాణిరెడ్డి రాజీనామాను పది రోజుల్లో ఆమోదించారు. ఈ పని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుండి ఫిరాయించి అధికార పక్షం పంచన చేరిన 21 మంది శాసన సభ్యుల విషయంలో ఎందుకు జరగలేదు. ఆ 21 మందిలో ఒకరు చనిపోయారు, ఆ కారణంగానే నంద్యాలకు ఉప ఎన్నిక అవసరం అయింది. మిగిలిన 20 మంది తమ పదవులకు రాజీనామాలు ఎందుకు చెయ్యలేదు? అందులో నలుగురు మంత్రివర్గంలో చేరిన పూటే రాజీనామాలు సమర్పించారని, అవి స్పీకర్‌కు అందాయని చివరి నిముషంలో చెప్పారు.

అలాంటప్పుడు చక్రపాణిరెడ్డి రాజీనామాతో బాటు ఆ నలుగురి రాజీనామాలను కూడా ఆమోదించి ఉండాలి కదా, అదెందుకు జరగలేదు? చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదంలో చూపిన వేగం, వారి విషయంలో ఎందుకు లేకుండా పోయింది? దీనికి సమాధానం చెప్పడం చాలా సులభం. ప్రజాభిప్రాయం, ప్రజాభి మతం, ప్రజామోదం ఎవరి వైపు ఉంటాయో వారికే నైతిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం బలంగా ఉంటాయి. వారు ఏ నిర్ణయం అయినా నిబ్బరంగా తీసుకోగలరు. ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఉన్నది, తెలుగుదేశం పార్టీకి లేనిది అదే. దివాలాకోరు రాజకీయాలను ప్రజలు క్షమించరు, తిరస్కరిస్తారు, బుద్ధి చెపుతారు కాబట్టి వీలయినంత కాలం పదవులు పట్టుకు వేళ్లాడుదామని చూసే వాళ్లనే ఎన్‌టీ రామారావు కుక్క మూతి పిందెలు అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో గెలిచి పదవులు వీడకుండా అధికార పక్షం వైపు వలసపోయిన వాళ్లు ఆ కోవకు చెందిన వారే.

నంద్యాల కోసం ఎందుకిన్ని పాట్లు
అసలు చంద్రబాబు నాయుడు నంద్యాల ఉప ఎన్నికలో గెలవడానికి ఇంత అవస్థ ఎందుకు పడుతున్నారు? ఆయన అధికారంలోకి వచ్చాక మూడేళ్లు నంద్యాల వైపు తొంగి కూడా చూడని ఆయనా, ఆయన మంత్రివర్గ సహచరులూ, పార్టీ నాయకులూ, కిరాయికి తెచ్చిన వందలాది మంది నకిలీ కార్యకర్తలూ కలసి వందలు, వేల కోట్ల రూపాయల పనులు చేస్తామని నంద్యాల ప్రజలను ప్రలోభ పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? నంద్యాలలో ఓడిపోతే చంద్రబాబు ప్రభుత్వం ఏమీ పడిపోదు. అదసలు ఆయన పార్టీ గెలిచిన స్థానమే కాదు. ఇదో ఉప ఎన్నిక, మేం చేసిన అభివృద్ధిని చూసి జనం ఓట్లేస్తారని, అభ్యర్థిని ప్రకటించి, ప్రచార బాధ్యతలను స్థానిక నాయకత్వానికి అప్పజెప్పి.. తాను ప్రభుత్వాన్ని నడిపే పని చెయ్యెచ్చు కదా! ఈ నెల మూడవ తేదీన జరిగిన బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్టు 2019లో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి నంద్యాల ఉప ఎన్నిక ఫలితం నాంది అని చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు.

అసలు ఉపఎన్నికలు రావడమే ఆయనకు ఇష్టం లేదు. తన పాలన పట్ల ప్రజాభిప్రాయం ఎట్లా ఉందోనని పలుమార్లు ఆయన స్వయంగా చేయించుకున్న సర్వేలు స్పష్టం చేశాయి, మరి. కానీ భూమా నాగిరెడ్డి హఠాత్తుగా చనిపోవడంతో, ఏదో సామెత చెప్పినట్టు చంద్రబాబు ప్రాణం మీదికి వచ్చింది. ఏ మాత్రం వీలున్నా, ఎన్నికల కమిషన్‌ కూడా స్పీకర్ల వ్యవస్థ లాగా తన చెప్పు చేతల్లో నడిచేదే అయితే, తప్పకుండా ఆయన ఈ ఉపఎన్నికను జరగకుండా ఆపించి ఉండేవారు. ఎన్నిక తప్పనిసరి కావడంతో ఆయన నంద్యాల ప్రజలకు చంద్రుడిని కూడా తెచ్చిస్తానని చెపుతున్నారు. అయితే నంద్యాలలో మకాం వేసిన మంత్రివర్యులంతా ‘‘మరి చంద్రబాబు నాయుడు చంద్రుడిని సగం దూరం తెచ్చారు, మీరు ఈ ఉప ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించకపోతే ఆ చంద్రుడు వెనక్కి వెళ్లి పోతాడు’’ అన్నట్టు రోజూ హెచ్చరిçకలు చేస్తూ వీధుల వెంట తిరుగుతున్నారు.

ఎవరు గెలిచినా ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా జరగాల్సిందే. ప్రతిపక్షాల నియోజకవర్గాలు అభివృద్ధికి, సంక్షేమానికి పనికి రావు అని మన రాజ్యాంగం చెప్పలేదు, చట్టాల్లో రాసి లేదు. అదే నిజమయితే అధికార పక్షం ఓడిపోయిన ప్రతి నియోజక వర్గమూ వెనకబడి పోవాల్సిందే కదా. నంద్యాల ప్రజలకు, ఆ మాట కొస్తే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజలం దరికీ ఆ విషయం బాగా తెలుసు. నిజానికి ప్రస్తుత నంద్యాల ఉపఎన్నికను మిగిలిన అన్ని అంశాలనూ పక్కన పెట్టి రాజకీయాల్లో నైతికత, అనైతికత మధ్య పోరాటంగా పరిగణించి ఓటర్లు తీర్పు చెప్పాలి.


దేవులపల్లి అమర్‌
datelinehyderabad@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement