ఎన్టీఆర్ కథతో వచ్చిన హిందీ సినిమా!
ఎన్టీఆర్ అంటే సూపర్‌స్టార్... గ్రేట్ డెరైక్టర్... టాప్ ప్రొడ్యూసర్. కానీ ఈ జాబితాలో ఇంకో శాఖను కూడా చేర్చాల్సిందే. ఆయనో ఫెంటాస్టిక్ స్టోరీ రైటర్. ఈ విషయం కొంతమందికే తెలుసు. చాలా గొప్ప గొప్ప సినిమాలకు ఆయనే కథారచయిత. అందులో సాంఘికాలున్నాయి. పౌరాణికాలున్నాయి. చారిత్రకాలు న్నాయి. ఆయన ఏ జానర్‌లో కథ రాసినా చాలా రీసెర్చి చేస్తారు. టైటిల్స్‌లో కథార
చయితగా ఆయన పేరు మొదట కనిపించింది ‘ఉమ్మడి కుటుంబం’లో.
ఆ తర్వాత వరకట్నం, కోడలు దిద్దిన కాపురం, తల్లా పెళ్లామా, తాతమ్మ కల, వేములవాడ భీమకవి, చాణక్య-చంద్రగుప్త, అక్బర్-సలీం-అనార్కలి, తిరుపతి వెంకటేశ్వర కల్యాణం, శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మంగారి చరిత్ర, దానవీరశూరకర్ణ... ఇత్యాది చిత్రాలకు కథనందించారు ఎన్టీఆర్. వీటిల్లో అత్యధిక శాతం ఘనవిజయం సాధించినవే. ఇక అసలు విషయానికొస్తే - ఎన్టీఆర్ కథతో ఓ హిందీ సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు ‘బిదాయి’. ఎల్వీ ప్రసాద్ దర్శక నిర్మాత. తెలుగులో విజయం సాధించిన ‘తల్లా పెళ్లామా’ రీమేక్ రైట్స్ తీసుకుని ఎల్వీ ప్రసాద్ హిందీలో ఈ సినిమా చేశారు. జితేంద్ర, లీనా చందావర్కర్, మదన్‌పురి నటించారు. లక్ష్మీకాంత్-ప్యారే
లాల్ స్వరాలందించారు.
అక్కడ హిందీ పోస్టర్లపై ‘స్టోరీ: ఎన్టీ రామారావు’ అని ప్రత్యేకంగా వేశారు. 1974 అక్టో బర్ 9న విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్‌లో కనకవర్షం కురిపించింది. లెక్కలేనంత డబ్బు. దాంతో ల్యాబ్ పెట్టాలని, ఎల్వీప్రసాద్ నిర్ణయించారు. అలా ప్రసాద్ ల్యాబ్ ఏర్పడింది. అలాగే ‘మరో చరిత్ర’ను హిందీలో ‘ఏక్ దూజే కే లియే’గా రీమేక్ చేస్తే, బంపర్ హిట్టయ్యింది. ఆ డబ్బుతోనే ప్రసాద్ ల్యాబ్‌ని బాగా విస్తరింపజేశారు.