'నా సోదరుడి మృతి వెనక కుట్ర దాగి ఉంది'
కొల్కతా : నా సోదరుడి ఎంపీ కపిల్ కృష్ణ ఠాకూర్ మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని తాజాగా టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మంజుల్ కృష్ణ ఠాకూర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కొల్కతాలో విలేకర్ల సమావేశంలో మంజుల్ మాట్లాడుతూ... కపిల్ది సహజ మరణం కాదని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆయన మృతి వెనకు కుట్ర దాగి ఉందని ఆరోపించారు. సీబీఐ విచారణతో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కపిల్ కృష్ణ ఠాకూర్ 24 ఉత్తర పరిగణల జిల్లాలోని బంగన్ లోక్సభ స్థానం నుంచి టీఎంసీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే గతేడాది అక్టోబర్ స్వల్ప అస్వస్థతతో ఆయన మరణించిన విషయం విదితమే. దాంతో బంగన్ లోక్ సభ స్థానానికి ఫిబ్రవరి 13 ఉప ఎన్నిక జరగనుంది.
మమతా బెనర్జీ కేబినెట్లో మంజుల్ కృష్ణ ఠాకూర్ శరణార్థులు, పునరావాస, సహాయ చర్యల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన గురువారం మంత్రి పదవితోపాటు టీఎంసీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం కమలం తీర్థం పుచ్చుకున్నారు. దాంతో మమతా దీదీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు శారదా స్కామ్లో చిక్కుకుని పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.