ఒబామాను తిడితే సెన్సార్ చేయమన్నారు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను తిడుతూ, ద్వేషిస్తూ వచ్చిన కామెంట్లను నిలిపి వేయాలని ట్విట్టర్ మాజీ సీఈవో డిక్ కస్టోలో గతేడాది రహస్యంగా తన సిబ్బందిని ఆదేశించినట్టు వెల్లడైంది. గతేడాది మే నెలలో ఒబామా నిర్వహించిన 'ఆస్క్ పోటస్' టౌన్ హాల్ సమావేశం సందర్భంగా ఆయనను దూషిస్తూ వచ్చిన వ్యాఖ్యలను సెన్సార్ చేయాలని ట్విట్టర్ సిబ్బందిని డిక్ కస్టోలో రహస్యంగా ఆదేశించినట్టు అమెరికా మీడియా సంస్థ 'బజ్ ఫీడ్' వెల్లడించింది. భావప్రకటన స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తామని ట్విట్టర్ చెప్పుకుంటున్నందున ఈ వ్యవహారాన్ని గుట్టుగా ఉంచారని తెలిపింది.
టౌన్ హాల్ సమావేశం జరిగిన నెల రోజుల తర్వాత ట్విట్టర్ సీఈవో పదవి నుంచి డిక్ కస్టోలో దిగిపోయారు. అయితే అంతకుముందు 'గార్డియన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భావప్రకటన స్వేచ్ఛకు ట్విట్టర్ కట్టుబడి ఉందని చెప్పారు. నియంత్రణలతో భావప్రకటన స్వేచ్ఛ భంగం కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. సమాచారం సెన్సార్ చేస్తోందని గత కొన్నేళ్లుగా ట్విట్టర్ ఆరోపణలు ఎదుర్కొంటోంది.