‘పరీక్షా’ కాలం
ఒకేసారి మూడు ఎన్నికలు
విద్యార్థులకు విషమ పరీక్షే
సమైక్య ఉద్యమంతో రోజులతరబడి జరగని తరగతులు
వరుస ఎన్నికలతో నేతలు, పార్టీలకూ కీలక పరీక్షే
అవును.. ఇది నిజంగా పరీక్షా కాలమే. విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు.. రాజకీయ నేతలు.. పార్టీలకు కీలక పరీక్షలు ఒకేసారి వచ్చాయి. తమ భవితకు, ఉన్నత చదువుల మెట్టు ఎక్కేందుకు విద్యార్థులకు పదోతరగతి పరీక్ష.. బిడ్డల జీవితాలపై ఆశలు పెట్టుకునే తల్లిదండ్రులకూ ఇది అగ్ని పరీక్ష.. పదవుల కుర్చీ ఎక్కేందుకు నేతల జాతకాలకు ఎన్నికల పరీక్ష.. మనుగడ కోసం రాజకీయ పార్టీలకు ఇదే కీలక పరీక్ష.. ఇలా అందరికీ ఒకేసారి పరీక్షా కాలం ముంచుకొచ్చింది.
సాక్షి, మచిలీపట్నం : మరోసారి ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. ఈసారి మున్సిపల్, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు మూడూ ఒకేసారి రావడం.. అదీ విద్యార్థులకు పరీక్షల సీజన్ కావడంతో విద్యార్థులకు మాత్రం ఇది విషమ పరీక్షేనని చెప్పొచ్చు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సార్వత్రిక ఎన్నికలు ఏ మాత్రం అవరోధం కాకూడదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావించారు. అయినా వారి ఆశలు ఫలించలేదు. ఇప్పుడు పదో తరగతి పరీక్షలు, ఎన్నికలు పోటీపడి మరీ జరుపుకోవాల్సి వచ్చింది. దీంతో అటు విద్యార్థులు, ఇటు రాజకీయ నాయకులు భవిత కోసం ఈ పరీక్షల్లో పాస్ అయ్యేందుకు అవసరమైన కసరత్తు ప్రారంభించారు.
ఏడాదంతా అవాంతరాలే...
ఈ ఏడాదంతా విద్యార్థులకు అవాంతరాలే ఎదురయ్యాయి. జిల్లాలో ఈ ఏడాది రాష్ట్ర విభజన నేపథ్యంలో పెద్ద ఎత్తున సమైక్య ఉద్యమం సాగింది. దాదాపు వంద రోజులకు పైగా ఉద్యమాలు ఉవ్వెత్తున సాగాయి. ఫలితంగా విద్యాసంస్థలు మునుపెన్నడూ లేని విధంగా రోజులతరబడి మూతపడ్డాయి. విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని తీవ్రంగా నష్టపోయారు. ప్రైవేటు క్లాసులు పెట్టినా సిలబస్ పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. అరకొర చదువులతోనే పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాల్సిన దుస్థితి దాపురించింది. దీనికితోడు కరెంటు కోతలు, ఎన్నికల వాతలు విద్యార్థుల ఏకాగ్రతను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది.
విద్యార్థులందరికీ ఇబ్బందికరమే...
ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 15 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో సుమారు 60 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. మార్చి 12 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న లక్షా 30 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు ఈ నెల ఆరో తేదీ నుంచి జరుగుతున్నాయి.
టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు పూర్తయిన తరువాత జిల్లాలో ఎంసెట్, ఐసెట్, ఎడ్ సెట్ (బీఈడీ), డైట్ సెట్ (డీఈడీ), సీప్ (పాలిటెక్నిక్ ఎంట్రన్స్), జామ్ (ఇంజినీరింగ్ తరువాత కోర్సు), భాషా పండితులకు పండిట్ ఎంట్రన్స్ టెస్ట్ వంటి వరుస పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థుల భవితకు పరీక్షలు ఎన్నికల సమయంలోనే జరగడం ఇబ్బందికరమేనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
పార్టీలకూ పెద్ద పరీక్షే...
జిల్లాలో ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించడంతో విజయవాడతో పాటు మచిలీపట్నం, గుడివాడ, పెడన, నూజివీడు, జగ్గయ్యపేట మున్సిపాలిటీలు, నందిగామ, తిరువూరు, ఉయ్యూరు నంగర పంచాయతీలు పరీక్షకు సిద్ధమయ్యాయి, ఒక కార్పొరేషన్లో 59 మంది కార్పొరేటర్లు, ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో 218 మంది కౌన్సిలర్లు ఎన్నిక కావాల్సి ఉంది.
దీంతో ఆయా మున్సిపాలిటీల్లో పదవీయోగం కోసం పరీక్షకు సిద్ధమైన అభ్యర్థులు అప్పుడే వ్యూహరచనలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో మే ఏడో తేదీన జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం రాజకీయ పార్టీలకు పెద్ద పరీక్షగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేని దుస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీకి వలస వెతలు తీవ్రమయ్యాయి. సమైక్యాంధ్ర చాంపియన్గా నిలిచిన వైఎస్సార్సీపీ జిల్లాలో ధీమాగా ఎన్నికల పరీక్షలకు సిద్ధమైంది. వరుస పరీక్షల్లో విజేతలెవరనేది ఫలితాల వరకు ఎదురుచూడాల్సిందే మరి.