నల్లధనం వివరాలన్నీ వెల్లడించలేం
విదేశీ ఖాతాల సమాచారంపై సుప్రీంకు కేంద్రం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: నల్లధనం విషయంలో ఎన్డీయే సర్కారు కూడా గత యూపీఏ బాట పట్టింది. భారత్‌తో రెండుసార్లు పన్ను పడకుండా మినహాయింపు ఒప్పందం(డీటీఏఏ) కుదుర్చుకున్న దేశాలు అందించిన భారతీయుల ఖాతాల మొత్తం వివరాలను బహిర్గతం చేయలేమని తాజాగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది. డీటీఏఏ ఒప్పందం ఉన్న దేశాలు అందించే సమాచారాన్ని వెల్లడిస్తే ఆ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తాయంది. ఒకసారి బహిర్గతం చేస్తే ఇక ఆ దేశాలు సమాచారం ఇవ్వక పోవచ్చని, ఇతర దేశాలతో డీటీఏఏ కుదుర్చుకోవడం కూడా కష్టమవుతుందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనానికి శుక్రవారం 800 పేజీల నివేదిక సమర్పించింది.
కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఈ వివరాలను కోర్టుకు వివరించారు. భారతీయుల ఖాతాల వివరాలను బహిర్గతం చేసే విషయంలో జర్మనీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందని, విచారణ జరపాలని భావిస్తున్న ఖాతాలను మాత్రం వెల్లడించేందుకు సుముఖంగా ఉందన్నారు. అందువల్ల ఆ దేశానికి చెందిన లీచెన్‌స్టెయిన్ బ్యాంకు అందించిన ఖాతాల వివరాలను బహిర్గతం చేయాలన్న గత ఆదేశాలను సవరించాలని కోరారు. ఈ వాదనను పిటిషనర్, సీనియర్ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ వ్యతిరేకించారు. విదేశాల్లో నల్లధనాన్ని దాచుకున్న వారిని కాపాడేం దుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. విదేశాల్లో భారతీయులు దాచుకున్న సొమ్మునంతా నల్లధనంగా చూడలేమని, విదేశాల్లో ఖాతాలు తెరవడం నేరమేమీ కాదని రోహత్గీ వ్యాఖ్యానించారు.