పెద్ద నోట్ల మార్పిడిపై ఆర్ బీఐ వివరణ
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్లను మార్చుకునేందుకు గుర్తింపు కార్డు నకలు ఇవ్వాల్సిన అవసరం లేదని భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బీఐ) స్పష్టం చేసింది. రూ. 500, రూ. వెయ్యి నోట్లు మార్చుకునేందుకు వెళ్లినవారిని కొన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఐడీ కార్డు కాపీలు ఇవ్వాలని అడుగుతున్నాయి. దీనిపై ఆర్ బీఐ వివరణయిచ్చింది. నగదు మార్పిడి సమయంలో ధ్రువీకృత ఐడీ కార్డు చూపిస్తే సరిపోతుందని, పోటోకాపీ సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఈ విషయాన్ని ఎస్ బీఐ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. నగదు మార్పిడి దరఖాస్తులో పేర్కొన్న నంబర్లు సరైనవా, కాదా అని సరిచూసేందుకు మాత్రమే ఐడీ కార్డు చూపించమంటున్నామని వివరణయిచ్చారు. పోటోకాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.
అయితే ఎస్ బీఐ సహా చాలా బ్యాంకులు ఐడీ కార్డు జిరాక్సులు అడుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒరిజినల్ ఐడీ కార్డులు తెచ్చిన వారిని జిరాక్సులు తేవాలని చెబుతుండడంతో అప్పటివరకు గంటల తరబడి క్యూలో నించున్న ప్రజలకు మరింత సమయం వృధా అవుతోంది. నగదు మార్పిడికి ఒరిజినల్ ఐడీ కార్డు తీసుకెళితే సరిపోతుందని, పోటోకాపీ అవసరం లేదని ఆర్ బీఐ చేసిన ప్రకటనను బ్యాంకులు, పోస్టాఫీసులు పట్టించుకుంటే ప్రజలు కష్టాలు కొంతవరకు తీరతాయి.