చేనేత పరిశ్రమకు జవసత్వాలు
రాష్ట్రంలో 31 మినీ క్లస్టర్లు, రెండు మెగా క్లస్టర్లు
క్లస్టరు ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు
గూడూరు : చేనేత పరిశ్రమకు జవసత్వాలు కల్పించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని బీసీ సంక్షేమ, ఎక్సైజ్ చేనేత, జౌళిశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం మండల పరిధిలోని రాయవరం గ్రామంలో ఇటీవల మంజూరైన చేనేత క్లస్టరు (సమగ్ర చేనేత అభివృద్ధి పథకం)ను మంత్రి ప్రారంభించారు. చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావుతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు.
ఎమ్మెల్యే కాగిత అధ్యక్షతన జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం తరువాత అత్యధికులు చేనేత రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. చేనేత కార్మికుల స్థితిగతులు, వారి జీవన ప్రమాణాలు వారు ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలకు మార్కెట్లో ఆదరణ కల్పించేందుకు ఈ సమగ్ర చేనేత అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. రాష్ట్రంలో నూతనంగా 31 మినీ క్లస్టర్లను ఒక్కొక్కటీ రూ. 70నుంచి60 లక్షలతో, రెండు మెగా క్లస్టర్లను ఒక్కొక్కటీ కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. జిల్లాలో పోలవరం, రాయవరం, కప్పలదొడ్డి, పెడన, చల్లపల్లి గ్రామాల్లో క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చేనేత కార్మికుల హర్షధ్వానాల నడుమ మంత్రి ప్రకటించారు.
సద్వినియోగం చేసుకోండి : కాగిత
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న చేనేత క్లస్టర్లను కార్మిక సోదరులు సద్వినియోగం చేసుకోవాలని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కోరారు. ఆధునిక డిజైన్లు, నాణ్యమైన ఉత్పత్తులతో పాటు మార్కెటింగ్ అవకాశం కల్పిస్తారని చెప్పారు. చేనేత, జౌళిశాఖ ఉపసంచాలకులు షేక్ జిలానీ, సర్పంచి తమ్మిశెట్టి వరలక్ష్మి, ఆప్కో డీఎంవో లక్ష్మణరావు, ఎంపీపీ కాసగాని శ్రీనివాసరావు, గూడూరు, బందరు జెడ్పీటీసీలు గోపాలకృష్ణగోఖలే, లంకే నారాయణప్రసాద్, చేనేత, జౌళిశాఖ అభివృద్ధి అధికారులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.