రైతులకు ఎక్స్ గ్రేషియాపై కౌంటర్ ఇవ్వండి: హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదించింది. మెదక్ జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 238 రైతుల కుటుంబాలను గుర్తించి ఒక్కో కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా కింద రూ.లక్ష చెల్లించడంతో పాటు వన్ టైం సెటిల్మెంట్ కింద రూ.50 వేల వరకు రుణాలను మాఫీ చేయడం జరిగిందని కోర్టుకు నివేదించింది. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించడం లేదని, మృతుల కుటుంబాలకు పరిహారాన్ని అందించేలా ఆదేశించడంతో పాటు, ప్రధాన మంత్రి ప్రకటించిన రూ.50వేల ఆర్థిక సాయం కూడా బాధిత కుటుంబాలకు అందేలా చూడాలంటూ మెదక్ జిల్లాకు చెందిన పాకాల శ్రీహరిరావు హైకోర్టులో 2012లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం, ఎవరికైతే పరిహారాన్ని తిరస్కరించారో, వారికి తిరిగి పరిహారం అందచేయాలని, ఈ మొత్తం ప్రక్రియను వారాల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను అమలు చేయలేదంటూ అధికారులపై శ్రీహరిరావు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు, ప్రతివాదిగా ఉన్న మెదక్ జిల్లా కలెక్టర్‌ను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు కలెక్టర్ రాహుల్ బొజ్జా కౌంటర్ దాఖలు చేశారు. ధర్మాసనం ఆదేశాల మేరకు విచారణ జరిపిన అర్హులను గుర్తించి, వారికి ప్రభుత్వ జీవో ప్రకారం అన్ని రకాల ప్రయోజనాలను అందజేశామని, ఈ విషయంలో పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన తన కౌంటర్లో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను ఏ దశలో కూడా ఉల్లంఘించలేదని తెలిపారు. అందువల్ల కోర్టు ధిక్కార కేసును మూసివేయాలని ఆయన కోర్టును కోరారు. ఈ కౌంటర్‌ను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, ఈ కౌంటర్‌కు సమాధానం ఇవ్వాలని పిటిషనర్ శ్రీహరిరావును ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.