exise police
-
హైదరాబాద్‌లో మరోసారి బయటపడ్డ నకిలీ మద్యం.. రూ. 2 కోట్ల విలువైన..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి నకిల మద్యం బయటపడింది. శివారు ప్రాంతాల్లో జోరుగా నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్‌శాఖ అధికారులు.. హయత్ నగర్‌లోని ఓ బెల్ట్ షాపులో నకిలీ మద్యం అమ్ముతున్నట్లు గుర్తించారు. ఆ బెల్ట్ షాప్ ఇచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు.. పెద్ద అంబర్ పేట్, హయత్ నగర్, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, దేవలమ్మ నాగారం ఏరియాలో నకిలీ మద్యం తయారు చేస్తున్న డంప్‌లపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో చౌటుప్పల్ మండలం దేవాలమ్మ నాగారానికి చెందిన మద్యం వ్యాపారి బింగి బాలరాజుగౌడ్కు చెందిన గోదాంలో నకిలీ మద్యం పట్టుకున్నారు. దాదాపు రూ. 2 కోట్ల విలువ చేసే నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలరాజు గౌడ్, కొండల్‌రెడ్డి కలిసి నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు తేలింది. వీరిద్దరూ 20 వైన్ షాపులకు నకిలీ మద్యం పంపిణీ చేస్తున్నట్లు నిర్ధారించారు. గతంలో కూడా బింగి బాలరాజు గౌడ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ఇదే మద్యం సరఫరా అయినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కర్రలతో కొట్టుకున్న ప్రైవేటు కాలేజ్ విద్యార్థులు.. వీడియో వైరల్ -
మద్యం దుకాణం సూపర్వైజర్ అరెస్టు
రణస్థలం: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కోటపాలెం మద్యం దుకాణ సూపర్వైజర్ పాకాడ అప్పలస్వామిని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇంచార్జి సీఐ ఎ.గణపతిబాబు శనివారం అరెస్టు చేశారు. కోటపాలెం ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి అక్రమంగా మద్యం సరఫరా అవుతుందనే ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ సిబ్బంది, ఎన్ఫోర్స్మెంట్ సీఐ బి.నర్సింహులు, సిబ్బంది శుక్రవారం నిఘా వేశారు. బైల్టు దుకాణం నడుపుతున్న సుగ్గు రవికి అప్పలస్వామి 48 మద్యం సీసాలను ఒకేసారి విక్రయించాడు. అక్కడే మాటు వేసిన ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వీరిద్దరినీ పట్టుకున్నారు. వీరిని అరెస్టు చేశామని ఇన్చార్జి సీఐ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రణస్థలం ఎస్ఐ బి.బంగారురాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
అర్ధరాత్రీ అడిగినంత మద్యం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బెల్టు షాపులపై ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ తనిఖీలు ‘ఫార్సు’లా మారాయి. మద్యం సిండికేట్లు అర్ధరాత్రి వేళల్లోనూ జోరుగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే ఉన్న మద్యం షాపులు తెల్లవారుజాము వరకు అమ్మకాలు సాగిస్తున్నా.. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది మే నుంచి ఇప్పటివరకు బెల్టు షాపులపై ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం ఎక్సైజ్ శాఖ నిర్లిప్తతకు అద్దం పడుతోంది. మద్యం సిండికేట్లకు ప్రయోజనం కలిగించడానికే ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ పోస్టును గత ఆర్నెల్లుగా సర్కారు భర్తీ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం షాపులు, బార్ల పక్కనే బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసి సిండికేట్లు అమ్మకాలు సాగిస్తున్నారు. పగలూ, రాత్రీ తేడా లేకుండా సాగుతున్న అమ్మకాలతో సర్కారు ఖజానా నింపుకునే పనిలో ఉంది. ఏడాది ఆఖరు కావడంతో ఈవెంట్ పర్మిట్లు కూడా ఇచ్చేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రతిపాదనలు కోరుతున్నారు. ఇటు అధికార పార్టీ నేతల పర్యటనలకు మద్యం సరఫరా పూర్తిగా బెల్టు షాపుల నుంచే జరుగుతోంది. గురజాల నియోజకవర్గంలో బెల్టు షాపులు ఏర్పాటు చేసి మరీ మద్యం సరఫరా చేస్తున్నా.. ఎక్సైజ్ శాఖ చేష్టలుడిగి చూస్తోంది. మద్యం షాపులు, బార్లకు మద్యం బాటిళ్ల నిల్వలకు గోడౌన్లకు ఎక్సైజ్ అధికారులు అనుమతులిస్తున్నారు. ఈ గోడౌన్ల కేంద్రంగానూ బెల్టు షాపులు ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతుండటం గమనార్హం. రైల్వే స్టేషన్ల పరిసరాలు, రైల్వే యార్డుల్లో బెల్టు షాపులు అడ్డూ అదుపూ లేకుండా కొనసాగిస్తున్నారు. విజయవాడలోని రాయనపాడు రైల్వే వ్యాగన్ వర్క్ షాపు పరిధిలో బెల్టు అమ్మకాలు యథేచ్చగా సాగుతున్నాయి. గుంటూరు– విజయవాడ రహదారి పక్కన మద్యం షాపులు, బార్ల పక్కనే బెల్టు అమ్మకాలు సాగిస్తున్నారు. మరోవైపు కార్తీక మాసం కావడంతో సముద్ర స్నానాలకు వెళ్లే భక్తులకు ఇబ్బందిగా బీచ్‌లలోనే బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. బాపట్ల, సూర్యలంక, చీరాల వద్ద రామాపురం ప్రాంతాల్లో బెల్టు అమ్మకాలు సాగుతున్నాయి. డ్యాష్ బోర్డులో కనిపించని బెల్టు కేసులు సీఎం కోర్ డ్యాష్ బోర్డులో బెల్టు షాపుల దాడులు, కేసులపై వివరాలు కనిపించకపోవడం గమనార్హం. రాష్ట్రంలో బెల్టు షాపులు అసలేవీ లేవని ప్రచారం చేసుకునేందుకు మాత్రమే ఈ ఏడాది మే నెల తర్వాత ఈ వివరాలను ప్రకటించడం లేదని అవగతమౌతోంది. ఈ ఏడాది ప్రారంభంలో బెల్టు షాపులపై ఫిర్యాదులకు 1100 నంబరు ప్రకటించి.. కొద్ది నెలల తర్వాత ఫిర్యాదులను తీసుకోవడం మానేశారు. ఎవరైనా 1100 నంబరుకు ఫిర్యాదు చేస్తే, వారి ఆధార్ నంబరు, పూర్తి వివరాలు చెప్పాలని కాల్ సెంటర్ ప్రతినిధులు ఒత్తిడి చేయడం గమనార్హం. తెలంగాణకు భారీగా తరలుతున్న మద్యం తెలంగాణలో ఎన్నికలు జరుగుతుండటంతో సరిహద్దు జిల్లాల నుంచి మద్యాన్ని భారీగా తరలిస్తున్నారు. నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు ఏపీలోని సరిహద్దు జిల్లాలైన గుంటూరు, కృష్ణా, కర్నూలులో బెల్టు షాపుల నుంచే మద్యం తరలిపోతోంది. రాష్ట్రంలో 15,719 బెల్టు షాపులపై కేసులు: ఎక్సైజ్ కమిషనర్ ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,719 బెల్టు షాపులపై కేసులను నమోదు చేసినట్లు ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీనరసింహం తెలిపారు. మొత్తం 16,114 మందిని అరెస్టు చేశామన్నారు. బెల్టు షాపులు నిర్వహిస్తున్న 493 మద్యం షాపులపైనా, 22 బార్ల పైనా కేసులు పెట్టామన్నారు. 106 మద్యం షాపులు, 5 బార్లను సస్పెండ్ చేసి విచారణ ప్రారంభించామన్నారు. బెల్ట్‌షాపులపై సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. -
మద్యం చుక్క దొరికినా కేసులే..!
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం : ఎన్నికలు అంటేనే మద్యం, డబ్బు ప్రవాహం సాధారణమైపోయింది. అయితే, ఈసారి మద్యం ప్రవాహాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే భావనతో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాను ఆనుకుని కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉండడంతో అక్కడి నుంచి భారీగా మద్యం అక్రమంగా జిల్లాకు సరఫరా అయ్యే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం అధికారులకు అందింది. దీం తో సరిహద్దుల వద్ద ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో 24 గంటల పాటు నిఘా ఏర్పాటుచేసి చుక్క మద్యం కూడా సరిహద్దు దాటకుండా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ప్రత్యేక నిఘా, పర్యవేక్షణ సరిహద్దు వెంట ఏర్పాటుచేసిన చెక్‌పోస్టుల్లో 24గంటల పాటు నిఘా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక నిఘా, పర్యవేక్షక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి విధులు అప్పగించారు. ఒక్కో బృందానికి ఒక్కో చెక్‌పోస్టు బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధికారులు రోజువారీ తనిఖీలు, పరిశీలించిన వాహనాలు, స్వాధీనం చేసుకున్న మద్యం వివరాలపై ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా రెండు వాహనాల ద్వారా మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వీటికి తోడు జిల్లాలోని మద్యం దుకాణాలపై నిఘా ఏర్పాటు చేసి రోజువారీ కొనుగోళ్లు, అమ్మకాలపై ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా సరిహద్దుల వెంట మొబెల్ పార్టీల ద్వారా గస్తీ నిర్వహిస్తున్నారు. బెల్ట్ దుకాణాలు, నాటుసారా మద్యం దుకాణాలకు తోడు జిల్లాలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు నిర్వహించకుండా అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. గతం లో మద్యం అమ్మిన షాపులను గుర్తించి మరోసారి తనిఖీలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా అక్కడక్కడా మద్యం స్వాధీనం చేసు కుని నిర్వాహకులను బైండోవర్ చేస్తున్నారు. అంతేకాకుండా నాటుసారా తయారీ, అమ్మకంపై కూడా దృష్టి సారించారు. తయారీదారులకు బెల్లం, పటిక అందకుండా పకడ్బండీ చర్యలు చేపట్టారు. వీటికి తోడు తరచు చేపడుతున్న తనిఖీల్లో నాటుసారా స్వాధీనం అవుతోంది. కాగా, తనిఖీల కోసం ఐదు రకాల బృందాలను ఏర్పాటుచేసి ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధికారులు రోజువా రీ పరిశీలన చేపడుతుండడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. సెప్టెంబర్ 1నుంచి నమోదైన కేసులు ఎన్నికలు రానున్నాయన్న సమాచారంతో జిల్లావ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 217 సారా తయారీ కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి 209మందిని అరెస్టు చేశారు. అలాగే, 1,922లీటర్ల సారాతో పాటు 5,210 కేజీల బెల్లాన్ని సీజ్ చేశారు. దీంతో పాటు పలు కేసుల్లో ఎక్సైజ్ అధికారులు 18వాహనాలను అదుపులోకి తీసుకొని సీజ్ చేశారు. అదేవిధంగా కల్తీ కల్లు కేసులు 89నమోదు చేయగా దీంట్లో 11,476 లీటర్ల కల్లును సీజ్ చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా గ్రామాల్లో అనుమతి లేకుండా మద్యం అమ్ముతున్న బెల్టు దుకాణాలపై 299కేసులు నమోదు చేసి 291 మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఐఎంఎల్ 13వేల లీటర్లు, 2,400 లీటర్ల బీర్‌ను సీజ్ చేశారు. ఆయా బెల్టు దుకాణాల్లో 10వాహనాలు సీజ్ చేశారు. ఇవన్నీ కాకుండా అక్రమ మద్యం, గుడుంబా కేసుల్లో 497మంది అనుమానితులను రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్ చేయించినట్లు వెల్లడించారు. కేసులు, సీజ్ చేసిన మద్యం నాటుసారా తయారీ కేసులు 217 స్వాధీనం చేసుకున్న సారా 1,922 లీటర్లు సీజ్ చేసిన బెల్లం 5,210 కేజీలు సీజ్ చేసిన కల్లు 11,476 లీటర్లు ఐఎంఎల్ 13,000 లీటర్లు బీర్ 2,400 లీటర్లు తనిఖీ బృందాలు ఇవే... - సరిహద్దు చెక్‌పోస్టు బృందాలు - మొబైల్ బృందాలు - జిల్లా టాస్క్ఫోర్సు బృందం - స్టేషన్ల వారీగా బృందాలు - సమాచార సేకరణ బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాం ఎన్నికల సందర్భంగా మద్యం పంపకాలు, అక్రమ తరలింపు జరగకుండా ముం దస్తు జాగ్రత్తలు తీసు కుంటున్నాం. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రతీ అంశాన్ని క్షుణంగా పరిశీలిస్తాం. మద్యం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి కాకుండా పూర్తి నిఘా పెట్టాం. పోలీసులతో పాటు ఇతర శాఖలతో కలిసి సంయుక్తంగా నివారణ చర్యలు చేపట్టాం. చెక్‌పోస్టుల వద్ద నిత్యం వాహనాలు తనిఖీ చేస్తున్నాం. అయితే, ఎక్కడైనా అక్రమంగా మద్యం అమ్మకాలు, తరలింపు, నాటుసారా తయారీ, అమ్మకాల సమాచారం తెలిసిన వారు మాకు తెలియజేయాలని. వారి పేర్లు గోప్యంగా ఉంచడంతో పాటు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – జయసేనారెడ్డి, డీసీ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా -
నిందితుడి భార్యతో అసభ్య ప్రవర్తన
ఖమ్మం జిల్లా: రాపర్తి ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం రాత్రి నిందితుడి భార్యతో ఎక్సైజ్ పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు. స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ నిన్న రాత్రి తన స్నేహితులతో కలిసి పోలీస్‌స్టేషన్‌లోనే పార్టీ చేసుకున్నాడు. నిన్న రాత్రి అక్రమంగా బెల్టు షాపు నిర్వహిస్తున్నాడని భద్రం అనే ఓ వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు తీసుకువచ్చారు. కొడతారేమోనని భావించి అదే సమయంలో నిందితుడి భార్య, కుమారుడు స్టేషన్‌కు వచ్చారు. ఒంటరిగా ఉండటం గమనించి మద్యం మత్తులో ఆమెను గదిలో పెట్టి లాక్ చేసి అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించారు. మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు వచ్చి టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం ఉదయం మాట్లాడదామని ఎస్ఐ, బాధితులకు సర్ధి చెప్పి పంపించారు. ఈ విషయమై సోమవారం నిందితుడిని వివరణ కోరగా..తన భార్యను వదిలిపెట్టమని బతిమిలాడుకున్నానని అయినా పోలీసులు కనికరించలేదని, స్థానికులు రావడంతో గండం నుంచి గట్టెక్కామని మీడియా ఎదుట వాపోయారు. నిందితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. -
గంజాయి స్వాధీనం..ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్ : మల్కాగిరిరి ఎక్షైజ్ పోలీసులు గంజాయి తరలిస్తున్న ఓ ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి రూ.16 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. ఓ వ్యక్తి ఎక్సైజ్ పోలీసుల రాక గమనించి పరారయ్యాడు. విశాఖపట్నం జిల్లా పాడేరు నుంచి ఈ గంజాయిని హైదరాబాద్ మీదుగా ముంబాయి తరలించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 135 కేజీల గంజాయితో పాటు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. -
నందికొట్కూరులో కల్తీకల్లు స్వాధీనం
–టాటాఏస్ వాహనం సీజ్ నందికొట్కూరు: పట్టణంలో కల్లు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించి..1400 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనం చేసుకున్నారు. అలాగే టాటా ఏస్ వాహనాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ అధికారి సుధాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు కల్తీ కల్లు దుకాణాలపై దాడులు చేశామన్నారు. కల్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దాడుల్లో ఎక్సైజ్ శాఖ కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శ్రీనివాసులు, రమణారెడ్డి, విజయవాడ ఎస్టీఫ్ అధికారి శ్రీకాంత్, నందికొట్కూరు ఎక్సైజ్ శాఖ ఎస్ఐలు దస్తగిరి, లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.