Expensive area
-
పెంట్ హౌస్ రూ.1,133కోట్లు!
వామ్మో అనుకుంటున్నారా? కానీ ఇది నిజంగా నిజం. దుబాయ్‌లో అత్యంత ఖరీదైన పామ్ జుమెరియా ప్రాంతంలో కడుతున్న కోమో రెసిడెన్సెస్ అనే 71 అంతస్తుల ఆకాశహర్మ్యంపై ఈ పెంట్ హౌస్ రానుంది. ఓ అజ్ఞాత కుబేరుడు దీన్ని ఏకంగా రూ.1,133 కోట్లకు కొనుక్కున్నాడు! ఈ ఐదు పడకగదుల పెంట్ హౌస్ విస్తీర్ణం 22 వేల చదరపు అడుగులు. ప్రపంచ రియల్టీ మార్కెట్లో అత్యంత ఎక్కువ ధర పలికిన మూడో పెంట్ హౌస్‌గా ఇది కొత్త రికార్డు సృష్టించింది. దుబాయ్ వరకూ అయితే దీనిదే రికార్డు. 2027లో కోమో టవర్ నిర్మాణం పూర్తయ్యాక ఇది కొనుగోలుదారుకు అందుబాటులోకి రానుంది! అతని వివరాలను రహస్యంగా ఉంచినట్లు నిర్మాణ భాగస్వామి ప్రావిడెంట్ ఎస్టేట్ పేర్కొంది. అయితే ‘‘ఆ కుబేరుడు తూర్పు యూరప్ ప్రాంతానికి చెందిన వ్యక్తి’’ అని ప్రావిడెంట్ ఎస్టేట్‌కు అసోసియేట్ పార్ట్నర్ అయిన శామ్ హొరానీ వెల్లడించారు. రియల్టీ స్వర్గధామమైన దుబాయ్‌లో అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, విల్లాలు, పెంట్ హౌస్‌ల ధరలు చుక్కలనంటడం ఇది తొలిసారేమీ కాదు. కొద్ది నెలల క్రితం మర్సా అల్ అరబ్ హోటల్ పెంట్ హౌస్ ఏకంగా రూ.956 కోట్లకు అమ్ముడైంది. ప్రత్యేకతలెన్నో... ఎన్నెన్నో ప్రత్యేకతలు కోమో రెసిడెన్స్ పెంట్ హౌస్ సొంతం ► ఇందులో 360 డిగ్రీల స్కై పూల్ ఉంటుంది. ►ఇది వ్యూహాత్మకంగా కూడా చాలా కీలకమైన చోట రానుంది. ►దీనిపై నుంచి ఇటు చూస్తే ప్రపంచంలోకెల్లా ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా, అటు చూస్తే దానికి సాటి వచ్చే బుర్గ్ అల్ అరబ్, దుబాయ్ మరీనా వంటి ఆకాశాన్నంటే నిర్మాణాలెన్నో కను విందు చేస్తాయి. ►కోమో రెసిడెన్సెస్ టవర్ ఎత్తు 300 మీటర్ల (984 అడుగుల) పై చిలుకే. ►ఇంతా చేసి, ఈ అపార్ట్మెంట్లో ఒక్కో ఫ్లోర్లో కేవలం ఒకట్రెండు ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి. ►రెండు నుంచి ఏడు పడకగదులతో కూడుకుని ఉండే ఈ ఫ్లాట్లకు ప్రైవేట్ లిఫ్టులు, ప్రైవేట్ శాండీ బీచ్‌లు, 25 మీటర్ల లాప్ పూల్స్, రూఫ్ టాప్ ఇన్ఫినిటీ పూల్ వంటి చాలా ప్రత్యేకతలుంటాయి. ►ఈ ఫ్లాట్ల ధర రూ.47.5 కోట్ల నుంచి మొదలవుతుంది. ప్రపంచ రికార్డు రూ.3,670 కోట్లు మొనాకోలోని ఓడియన్ టవర్ పెంట్ హౌస్ రూ.3,670 కోట్లతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెంట్ హౌస్‌గా రికార్డు సృష్టించింది. లండన్‌లోని వన్ హైడ్ పార్క్ పెంట్ హౌస్ రూ.1,975 కోట్లతో రెండో స్థానంలో ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దేశంలో ఆఫీస్ స్పేస్.. ఆ నగరం చాలా కాస్ట్లీ గురూ!
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఖరీదైన ఆఫీస్ మార్కెట్లలో ఢిల్లీ–ఎన్సీఆర్ పదో స్థానంలో ఉన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ తెలిపింది. 2022 ఏప్రిల్–జూన్ కాలానికి సంబంధించి ప్రైమ్ ఆఫీస్ రెంటల్ ఇండెక్స్ గణాంకాలను విడుదల చేసింది. ఢిల్లీలో వాణిజ్య స్థలం చదరపు అడుగు లీజు రేటు ఏడాదికి 51.6 డాలర్లుగా (రూ.4,128) ఉన్నట్టు తెలిపింది. హాంగ్‌కాంగ్ అత్యంత ఖరీదైన ఆఫీస్ స్పేస్ మార్కెట్‌గా ఉంది. ఇక్కడ ఏడాదికి చదరపు అడుగు అద్దె 175.4 డాలర్లుగా ఉంది. ముంబై 11వ స్థానంలో నిలిచింది. ముంబైలో చదరపు అడుగు వాణిజ్య స్థలానికి లీజు రేటు 45.8 డాలర్లుగా (రూ.3,664) ఉంది. బెంగళూరులో చదరపు అడుగు లీజు రేటు ఏడాదికి 20.5 డాలర్లుగా (రూ.1,640) ఉండగా, ఇండెక్స్‌లో 22వ స్థానంలో నిలిచింది. గడిచిన ఏడాదిలో బెంగళూరులో వాణిజ్య స్థలం లీజు రేటు 12 శాతం పెరిగినట్ట నైట్‌ఫ్రాంక్ తెలిపింది. కరోనా షాక్‌ల నుంచి ఆర్థిక వ్యవస్థ కుదురుకోవడంతో, ఎన్నో రంగాల నుంచి కొత్త స్థలాల లీజుకు డిమాండ్ పెరిగినట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. ఈ ఇండెక్స్‌లో అత్యంత ఖరీదైన మార్కెట్లుగా సిడ్నీ, సింగపూర్, టోక్యో, హోచిమిన్ సిటీ, బీజింగ్, మెల్బోర్న్, పెర్త్, బ్రిస్బేన్ వరుసగా రెండు నుంచి తొమ్మిదో స్థానం వరకు ఉన్నాయి. -
ఇండియాలో అత్యధిక రెంట్ వచ్చేది ఎక్కడో తెలుసా?
దేశ రాజధానిలో అత్యంత రద్ధీ ఉండే మార్కెట్ ఏరియాల్లో ఒకటైన కన్నాట్‌ప్లేస్ మరో రికార్డు సృష్టించింది. ఇండియాలోనే ఆఫీస్ రెంట్/లీజు పరంగా అత్యధిక అద్దె లభించే ప్రాంతంగా గుర్తింపు పొందింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ తాజాగా ప్రకటించిన వివరాల్లో అత్యంత కాస్ట్లీ ఏరియా రికార్డులకెక్కింది. కన్నాట్‌ప్లేస్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 112 నగరాల్లోని 127 ఆఫీస్ మార్కెట్లకు సంబంధించి ప్రతీ ఏడు సర్వే చేపడుతోంది. అందులో భాగంగా తాజాగా 2020కి సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించింది. ఇందులో ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ ఏరియాలో చదరపు అడుగు స్థలానికి 109 డాలర్ల రెంట్ (రూ.8276)తో ఇండియాలోనే ప్రథమ స్థానంలో ప్రపంచ వ్యాప్తంగా 17వ స్థానంలో నిలిచింది. ఇంతకుముందు ప్రకటించిన జాబితాలో కన్నాట్‌ప్లేస్ 23వ స్థానంలో ఉండగా తాజాగా సవరించిన ధరలతో ఇక్కడ రెంట్ మరింత ప్రియంగా మారింది. కన్నాట్‌ప్లేస్‌లో ఆఫీస్ వర్క్‌ప్లేస్ డిమాండ్ అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన శాన్ఫ్రాన్సిస్కో కంటే ఖరీదైంది కావడం గమనార్హం. రెండో స్థానంలో ముంబై బాంద్రా న్యూఢిల్లీ తర్వాత ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ఏరియా రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు ఆఫీస్ స్పేస్ రెంట్ 102 డాలర్లుగా ఉంది. ఆ తర్వాత స్థానంలో ముంబైలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏరియా 58 డాలర్లు, బెంగళూరులో 51 డాలర్లు, గురుగ్రామ్ 48 డాలర్లు, నేషనల్ క్యాపిటల్ రీజియన్ సగటు 44 డాలర్లుగా జేఎల్ఎల్ పేర్కొంది. ఇక అత్యంత చవకగా ఆఫీస్ స్పేస్ రెంట్‌కి లభించే నగరంగా చెన్నై నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు స్థలం రెంట్ ఏడాదికి కేవలం 21 డాలర్లుగా ఉంది. ఫస్ట్‌ప్లేస్‌లో న్యూయార్క్ న్యూయార్క్ మిడ్‌టౌన్, హాంగ్‌కాంగ్ సెంట్రల్ ఏరియాలో ఆఫీస్ రెంట్ ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. ఇక్కడ చదరపు అడుగు స్థలానికి అద్దెగా ఏకంగా 261 డాలర్లు చెల్లించాల్సిందే. ఆ తర్వాతి స్థానంలో బీజింగ్‌లో ఫినాన్స్ స్ట్రీట్, లండన్ వెస్ట్ఎండ్, యూఎస్‌లోని సిలికాన్ వ్యాలీ నగరాలు ఉన్నాయి. చదవండి:హైదరాబాద్ తర్వాతే ముంబై, బెంగళూరు నగరాలు -
కన్నేశారు.. మాయం చేశారు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో కోట్లాది రూపాయల భూమిని కాజేసేందుకు కొందరు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చొరవతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విలువైన ఈ స్థలాన్ని కబ్జాచేసేందుకు దశాబ్దం క్రితమే పథకం వేశారు. అందులో భాగంగానే కార్పొరేషన్‌కు చెందాల్సిన ఈ భూమి రికార్డులు కనిపించకుండా చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక రూ.కోట్లల్లో చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి లేఖతో అటు అధికారులు.. అక్రమార్కులు ఉలిక్కిపడ్డారు. కోట్లు విలువచేసే రెండెకరాలకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమైనట్లు కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి. వివరాల్లో కెళితే... నగరంలోని ఇస్కాన్ సిటీ పరిధిలో సర్వేనంబర్ 680, 681, 684లో రెండెకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రస్తుతం ఆ భూమి విలువ సుమారు రూ.10కోట్లుపైనే ఉంటుందని అంచనా. విలువైన ప్రభుత్వ భూమిని గత పాలకులు కొందరు కాజేసేందుకు పథకం రచించినట్లు తెలిసింది. అందులో భాగంగా ఓ మాజీ మహిళా ప్రజాప్రతినిధి సహకారంతో రికార్డులను సైతం తారుమారు చేసినట్లు తెలిసింది. ఆ రికార్డులతో కొద్దిరోజుల క్రితం 30 సెంట్ల స్థలాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ స్థలం వెనుక కథ... నగరంలో ఇస్కాన్ సిటీ పరిధిలో కొందరు రియల్టర్లు లేఅవుట్లు వేశారు. విస్తీర్ణాన్ని బట్టి రియల్టర్లు కొంత స్థలాన్ని కార్పొరేషన్‌కు వదిలిపెట్టాలి. అలా కేటాయించిన స్థలంలో ప్రజావసరాలకు వినియోగించాలి. పార్కులు, కమ్యునిటీ భవనాల వంటివి నిర్మించి ప్రజావసరాలకు ఉపయోగించుకోవచ్చు. అలా ఆ రెండెకరాల భూమిని వదిలిపెట్టారు. అయితే ప్రస్తుతం ఆ రెండెకరాలకు సంబంధించిన రికార్డులు లేవు. వాటిని మాయం చేయటానికి కొందరు కీలక పాత్ర పోషించారు. ఈ స్థలం ఉన్న విషయాన్ని నగరంలోని ఓ ప్రముఖ ఆలయ చైర్మన్‌కు తెలిసింది. విలువైన ఆ రెండెకరాల స్థలాన్ని ఎలాగైనా నొక్కేయాలని పథకం వేశారు. గత పాలకులతో కుమ్మక్కై రికార్డులు లేకుండా చేశారు. అందులో భాగంగా రెండేళ్ల క్రితం ఆ రెండెకరాల్లో కొంత స్థలాన్ని పెన్సింగ్ వేయాలని భావించి కార్పొరేషన్ సిబ్బందితో అక్కడి వెళ్లినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కొందరు పెద్దలు అధికారులను హెచ్చరించినట్లు తెలిసింది. అదేస్థలంలోని 30 సెంట్లను ఇటీవల వేరొకరికి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. మిగిలిన స్థలాన్ని విక్రయించే ప్రయత్నాలు ప్రారంభించారు. విక్రయించేందుకు అవసరమైన రికార్డుల కోసం ఆరాతీసే సమయంలో ఈ స్థలం కార్పొరేషన్‌కు సంబంధించినదని బయటపడింది. ఈ విషయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి దృష్టికి వచ్చింది. స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరా తీయటంతో విషయం బయటపడింది. వెంటనే ఎమ్మెల్యే కార్పొరేషన్ కమిషనర్‌కు లేఖరాశారు. ‘ఇస్కాన్‌సిటీ పరిధిలో విలువైన రెండెకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలం అన్యాక్రాంతమవుతోంది. ప్రజావసరాల కోసం కేటాయించిన ఆ స్థలాన్ని వెంటనే గుర్తించి హద్దులు ఏర్పాటు చేసి కంచె ఏర్పాటు చేయండి. ఒకవేళ అటువంటి స్థలమే లేదనుకుంటే నాకు రాతపూర్వకంగా రాసివ్వండి’ అని కోరటం గమనార్హం. అయితే ఈ విషయంపై కార్పొరేషన్ అధికారులు స్పందిస్తారా? లేదా? అనేది వేచిచూడాలి.