
దేశ రాజధానిలో అత్యంత రద్ధీ ఉండే మార్కెట్ ఏరియాల్లో ఒకటైన కన్నాట్‌ప్లేస్ మరో రికార్డు సృష్టించింది. ఇండియాలోనే ఆఫీస్ రెంట్/లీజు పరంగా అత్యధిక అద్దె లభించే ప్రాంతంగా గుర్తింపు పొందింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ తాజాగా ప్రకటించిన వివరాల్లో అత్యంత కాస్ట్‌లీ ఏరియా రికార్డులకెక్కింది.
కన్నాట్‌ప్లేస్
ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ జేఎల్‌ఎల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 112 నగరాల్లోని 127 ఆఫీస్ మార్కెట్‌లకు సంబంధించి ప్రతీ ఏడు సర్వే చేపడుతోంది. అందులో భాగంగా తాజాగా 2020కి సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించింది. ఇందులో ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ ఏరియాలో చదరపు అడుగు స్థలానికి 109 డాలర్ల రెంట్ (రూ.8276)తో ఇండియాలోనే ప్రథమ స్థానంలో ప్రపంచ వ్యాప్తంగా 17వ స్థానంలో నిలిచింది. ఇంతకుముందు ప్రకటించిన జాబితాలో కన్నాట్‌ప్లేస్ 23వ స్థానంలో ఉండగా తాజాగా సవరించిన ధరలతో ఇక్కడ రెంట్ మరింత ప్రియంగా మారింది. కన్నాట్‌ప్లేస్‌లో ఆఫీస్ వర్క్‌ప్లేస్ డిమాండ్ అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన శాన్‌ఫ్రాన్సిస్కో కంటే ఖరీదైంది కావడం గమనార్హం.
రెండో స్థానంలో ముంబై బాంద్రా
న్యూఢిల్లీ తర్వాత ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ఏరియా రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు ఆఫీస్ స్పేస్ రెంట్ 102 డాలర్లుగా ఉంది. ఆ తర్వాత స్థానంలో ముంబైలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏరియా 58 డాలర్లు, బెంగళూరులో 51 డాలర్లు, గురుగ్రామ్ 48 డాలర్లు, నేషనల్ క్యాపిటల్ రీజియన్ సగటు 44 డాలర్లుగా జేఎల్‌ఎల్ పేర్కొంది. ఇక అత్యంత చవకగా ఆఫీస్ స్పేస్ రెంట్‌కి లభించే నగరంగా చెన్నై నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు స్థలం రెంట్ ఏడాదికి కేవలం 21 డాలర్లుగా ఉంది.
ఫస్ట్‌ప్లేస్‌లో న్యూయార్క్
న్యూయార్క్ మిడ్‌టౌన్, హాంగ్‌కాంగ్ సెంట్రల్ ఏరియాలో ఆఫీస్ రెంట్ ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. ఇక్కడ చదరపు అడుగు స్థలానికి అద్దెగా ఏకంగా 261 డాలర్లు చెల్లించాల్సిందే. ఆ తర్వాతి స్థానంలో బీజింగ్‌లో ఫినాన్స్ స్ట్రీట్, లండన్ వెస్ట్‌ఎండ్, యూఎస్‌లోని సిలికాన్ వ్యాలీ నగరాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment