దిగుమతి ఆంక్షలతో పెరిగిన బంగారం స్మగ్లింగ్
న్యూఢిల్లీ: దిగుమతులపై ఆంక్షల కారణంగా బంగారం అక్రమ రవాణా గతేడాది భారీగా పెరిగింది. 2013-14లో ఏకంగా రూ.678 కోట్ల విలువైన పసిడిని అధికారులు స్వాధీనపర్చుకున్నారు. అంతకుముందు ఏడాది స్వాధీనపర్చుకున్న బంగారం విలువ రూ.94 కోట్లు. గత సంవత్సరం ముంబై, ఢిల్లీ, చెన్నై, కాలికట్ విమానాశ్రయాల్లో బంగారాన్ని అత్యధికంగా జప్తు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖకు అందించిన సమాచారంలో కస్టమ్స్, రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు.
పసిడి అక్రమ రవాణాకు సంబంధించి గతేడాది 2,419 కేసులను కస్టమ్స్ విభాగం నమోదు చేసింది. అంతక్రితం ఏడాది 919 కేసులు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో(ఏప్రిల్-జూన్) 1,264 కేసులలో రూ.354 కోట్ల విలువైన పుత్తడిని అధికారులు సీజ్ చేశారు. ఏప్రిల్‌లో 461 కిలోలు, మేలో 362 కిలోలు, జూన్‌లో 464 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కరెంట్ అకౌంట్ లోటును అదుపు చేసేందుకు కేంద్రం గతేడాది పసిడి దిగుమతులపై ఆంక్షలతో పాటు దిగుమతి సుంకాన్ని 10%కి పెంచింది.