కన్నేశారు.. మాయం చేశారు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో కోట్లాది రూపాయల భూమిని కాజేసేందుకు కొందరు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చొరవతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విలువైన ఈ స్థలాన్ని కబ్జాచేసేందుకు దశాబ్దం క్రితమే పథకం వేశారు. అందులో భాగంగానే కార్పొరేషన్‌కు చెందాల్సిన ఈ భూమి రికార్డులు కనిపించకుండా చేశారనే ప్రచారం జరుగుతోంది.
ఈ మొత్తం వ్యవహారం వెనుక రూ.కోట్లల్లో చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి లేఖతో అటు అధికారులు.. అక్రమార్కులు ఉలిక్కిపడ్డారు. కోట్లు విలువచేసే రెండెకరాలకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమైనట్లు కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి. వివరాల్లో కెళితే... నగరంలోని ఇస్కాన్ సిటీ పరిధిలో సర్వేనంబర్ 680, 681, 684లో రెండెకరాల ప్రభుత్వ భూమి ఉంది.
ప్రస్తుతం ఆ భూమి విలువ సుమారు రూ.10కోట్లుపైనే ఉంటుందని అంచనా. విలువైన ప్రభుత్వ భూమిని గత పాలకులు కొందరు కాజేసేందుకు పథకం రచించినట్లు తెలిసింది. అందులో భాగంగా ఓ మాజీ మహిళా ప్రజాప్రతినిధి సహకారంతో రికార్డులను సైతం తారుమారు చేసినట్లు తెలిసింది. ఆ రికార్డులతో కొద్దిరోజుల క్రితం 30 సెంట్ల స్థలాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆ స్థలం వెనుక కథ...
నగరంలో ఇస్కాన్ సిటీ పరిధిలో కొందరు రియల్టర్లు లేఅవుట్లు వేశారు. విస్తీర్ణాన్ని బట్టి రియల్టర్లు కొంత స్థలాన్ని కార్పొరేషన్‌కు వదిలిపెట్టాలి. అలా కేటాయించిన స్థలంలో ప్రజావసరాలకు వినియోగించాలి. పార్కులు, కమ్యునిటీ భవనాల వంటివి నిర్మించి ప్రజావసరాలకు ఉపయోగించుకోవచ్చు. అలా ఆ రెండెకరాల భూమిని వదిలిపెట్టారు. అయితే ప్రస్తుతం ఆ రెండెకరాలకు సంబంధించిన రికార్డులు లేవు. వాటిని మాయం చేయటానికి కొందరు కీలక పాత్ర పోషించారు. ఈ స్థలం ఉన్న విషయాన్ని నగరంలోని ఓ ప్రముఖ ఆలయ చైర్మన్‌కు తెలిసింది.
విలువైన ఆ రెండెకరాల స్థలాన్ని ఎలాగైనా నొక్కేయాలని పథకం వేశారు. గత పాలకులతో కుమ్మక్కై రికార్డులు లేకుండా చేశారు. అందులో భాగంగా రెండేళ్ల క్రితం ఆ రెండెకరాల్లో కొంత స్థలాన్ని పెన్సింగ్ వేయాలని భావించి కార్పొరేషన్ సిబ్బందితో అక్కడి వెళ్లినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కొందరు పెద్దలు అధికారులను హెచ్చరించినట్లు తెలిసింది. అదేస్థలంలోని 30 సెంట్లను ఇటీవల వేరొకరికి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. మిగిలిన స్థలాన్ని విక్రయించే ప్రయత్నాలు ప్రారంభించారు.
విక్రయించేందుకు అవసరమైన రికార్డుల కోసం ఆరాతీసే సమయంలో ఈ స్థలం కార్పొరేషన్‌కు సంబంధించినదని బయటపడింది. ఈ విషయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి దృష్టికి వచ్చింది. స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరా తీయటంతో విషయం బయటపడింది. వెంటనే ఎమ్మెల్యే కార్పొరేషన్ కమిషనర్‌కు లేఖరాశారు. ‘ఇస్కాన్‌సిటీ పరిధిలో విలువైన రెండెకరాల ప్రభుత్వ స్థలం ఉంది.
ఆ స్థలం అన్యాక్రాంతమవుతోంది. ప్రజావసరాల కోసం కేటాయించిన ఆ స్థలాన్ని వెంటనే గుర్తించి హద్దులు ఏర్పాటు చేసి కంచె ఏర్పాటు చేయండి. ఒకవేళ అటువంటి స్థలమే లేదనుకుంటే నాకు రాతపూర్వకంగా రాసివ్వండి’ అని కోరటం గమనార్హం. అయితే ఈ విషయంపై కార్పొరేషన్ అధికారులు స్పందిస్తారా? లేదా? అనేది వేచిచూడాలి.