వేవిళ్లు ఎక్కువగా ఉంటే!
అపోహ-వాస్తవం
అపోహ : గర్భిణికి వేవిళ్లు ఎక్కువగా ఉంటే కడుపులో ఆడశిశువు ఉన్నట్లు !
వాస్తవం : ఈ అభిప్రాయం ఏ రకంగానూ ఆమోదయోగ్యం కాదంటారు వైద్య రంగ నిపుణులు. గర్భధారణ జరిగాక మొదటి మూడు నెలల సమయంలో ఉదయం నిద్రలేవగానే తల తిరగడం, వాంతులు, విపరీతమైన నిద్ర వంటి ఇబ్బందులు వేధిస్తాయి. అయితే ఒక్కొక్కరిలో వీటి తీవ్రత ఎక్కువగా ఉంటే, కొందరికి తక్కువగా ఉంటుంది. వేవిళ్లు తీవ్రంగా ఉంటే అమ్మాయి, తక్కువగా ఉంటే అబ్బాయి పుడతారని అని నిర్ధారించడం ఏ రకంగానూ సాధ్యం కాదు. ఇలాంటి అభిప్రాయం కలగడాన్ని ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు... ఒక స్త్రీకి మొదటి కాన్పులో అమ్మాయి, రెండవ కాన్పులో అబ్బాయి పుట్టినట్లయితే అమ్మాయిని గర్భంతో ఉన్నప్పుడు వేవిళ్లు తీవ్రంగా ఉండవచ్చు. సాధారణంగా... వేవిళ్లు తొలి కాన్పులో ఉన్నంత తీవ్రంగా రెండవ కాన్పులో ఉండవు. అంతేతప్ప ఆ ఒక్క అంశాన్ని చూసి, పుట్టబోయేది ఆడపిల్ల అయితే వేవిళ్లు ఎక్కువగా ఉంటాయనుకోవడం తప్పు.