‘అరుణోదయ’ మహాసభలకు సర్వం సిద్ధం
ప్రజాపోరాట, విప్లవ కళా సంస్కృతిని పాదుకొల్పే లక్ష్యంతో పురుడు పోసుకున్న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 5వ రాష్ట్ర మహాసభలకు నగరం ముస్తాబైంది. 1980లో ఒంగోలులో మొదటి మహాసభలు నిర్వహించగా సరిగ్గా 34 ఏళ్ల తరువాత శనివారం మళ్లీ ఆ కళా వైభవం సాక్షాత్కరించనుంది. వెయ్యి మంది కళాకారులు గజ్జకట్టి ఆడి, గళమెత్తి పాడి తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు.
ఒంగోలు టౌన్ : అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 5వ రాష్ట్ర మహాసభలకు ఒంగోలు నగరం ముస్తాబైంది. 34 ఏళ్ల తర్వాత మరోసారి మహాసభలకు జిల్లా కేంద్రం వేదికైంది. శని, ఆదివారాల్లో మహాసభలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు 1000 మంది కళాకారులు హాజరు కానున్నారు. మహాసభలను విజయవంతం చేసేందుకు కొన్ని రోజుల నుంచి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
విప్లవ కళా సంస్కృతులతో పురుడు
బూర్జువా, భూస్వామ్య, సామ్రాజ్యవాద సంస్కృతిని ధ్వంసం చేసి ప్రజాపోరాట సంస్కృతిని, విప్లవ కళా సంస్కృతులను నెలకొల్పాలనే లక్ష్యంతో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పురుడు పోసుకుంది. జాతీయంగా, అంతర్జాతీయంగా పోరాటాలు పెల్లుబుకుతున్న 70వ దశకంలో ఉస్మానియా ఇంజినీరింగ్ విద్యార్థి జంపాల చంద్రశేఖరరావు చొరవతో 1974లో అరుణోదయ మొగ్గ తొడిగింది. హైదరాబాద్‌లో ప్రారంభమైన సంస్థ కార్యకలాపాలు క్రమేణా అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించింది. 1980లో ఒంగోలులో ప్రథమ మహాసభ జరుపుకొని రాష్ట్ర స్థాయి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొంది.
దేశంలో, రాష్ట్రంలో అనేక కళా సంస్థలు ఉన్నా చారిత్రక అవసరాల రీత్యా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏర్పడింది. ప్రపంచ పురోగతి.. శ్రమజీవి నెత్తుటి బొట్టులోనే ఉందని నమ్మింది. సకల సంపదలే కాకుండా సమస్త కళలు, సంస్కృతి శ్రమ నుంచే పుట్టాయని ఎరిగింది. ప్రజాకళారూపాలైన బుర్రకథ, హరికథ, జముకుల కథ, ఒగ్గుకథ, వీధి భాగోతం, నాటిక, నాటకం, నృత్యరూపకం తదితర ప్రజాకళారూపాలను ఆయుధంగా మలచుకున్న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య.. దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ వస్తోంది.
గజ్జతో ఆడటం.. గళంతో పాడటం..
దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గజ్జ కట్టి ఆడటం.. గళం విప్పి పాడటం ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేస్తోంది. కళ.. కళ కోసం కాదు, ప్రజల కోసం అని కళల్ని ప్రజాపథం చేసిన గరికపాటి రాజారావు మొదలు, తన పెన్నూ గన్నూ పీడిత ప్రజల కోసం అంకితం చేసిన సుబ్బారావు పాణిగ్రాహి వరకు అనేక మంది కవులు, కళాకారులు చేసిన పోరాటాలు, త్యాగాలను కళారూపాల ద్వారా ప్రదర్శించి వారి ఆశయాలు, భవిష్యత్ పోరాటాలను మరింత పట్టుదలగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ముందుకు తీసుకెళ్తోంది.
నేడు కళాకారుల మహా ప్రదర్శన : తొలిరోజైన శనివారం ఒంగోలులో కళాకారుల మహా ప్రదర్శన నిర్వహించనున్నారు. స్థానిక ఏబీఎం కాలేజీ నుంచి హెచ్‌సీఎం కాలేజీ వరకు మహా ప్రదర్శన జరగనుంది. అనంతరం హెచ్‌సీఎం కాలేజీ గ్రౌండ్‌లోని డాక్టర్ గాండ్ల వెంకట్రావు నగర్లో బహిరంగ సభ జరగనుంది. సభలో సినీనటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి, ప్రముఖ కవి, కళాకారుడు గోరేటి వెంకన్న, పీఓడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య పాల్గొని ప్రసంగించనున్నారు.
రేపు ప్రతినిధుల సభ
స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులోని సుబ్బారావు పాణిగ్రాహినగర్లో ఆదివారం ఉదయం రాష్ట్ర ప్రతినిధుల సభ జరగనుంది. ప్రముఖ సంపాదకులు సతీష్‌చందర్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ప్రపంచీకరణ, సాంస్కృతికోద్యమం గురించి ప్రముఖ కళాకారుడు, రచయిత శక్తి ప్రసంగించనున్నారు. విప్లవ సాంస్కృతికోద్యమంపై ప్రజా రచయిత, కవి ఎన్.తిర్మల్ మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యల నూతన కా ర్యవర్గాలను ఎన్నుకోనున్నారు.