‘ఘన’తంత్ర వేడుకలు
ముఖ్య అతిథిగా అబుదాబి యువరాజు
► వర్షంలోనూ ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు
► ఆకట్టుకున్న వివిధ రాష్ట్రాల శకటాలు
► విదేశాల్లోనూ వేడుకలు
న్యూఢిల్లీ: భారత 68వ గణతంత్ర దినోత్సవాలు ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో గురువారం ఘనంగా జరిగాయి. వేడుకలకు అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా విచ్చేయడం తెలిసిందే. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, వివిధ దేశాల రాయబారులు రిపబ్లిక్‌డే పరేడ్‌ను తిలకించారు. కవాతుకు 149 మంది సభ్యులు గల యూఏఈ సైనికుల బృందం సారథ్యం వహించింది. సైనిక బృందాల గౌరవ వందనాన్ని ప్రణబ్ స్వీకరించారు. మోదీ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నహ్యన్ , మోదీ పక్క పక్కనే కూర్చుని కవాతును వీక్షించారు.
ఢిల్లీలో ఉదయం నుంచి చినుకులు పడుతూ, ఆకాశం మేఘావృతమై ఉన్నా, పరేడ్‌ను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మన దేశ మిలిటరీ శక్తి, వారసత్వ, సాంస్కృతిక, చారిత్రక, కళా సంపదను తెలిపేలా 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు పలు శకటాలతో ప్రదర్శనలు నిర్వహించాయి. క్షిపణులను ప్రయోగించే టీ–90 భీష్మ, పదాతి దళానికి చెందిన యుద్ధ వాహనం బీఎంపీ–2కే, బ్రహ్మోస్ లాంచర్, స్వాతి రాడార్, ఆకాష్ క్షిపణి, ధనుష్ తుపాకులు తదితరాలను సైనికులు ప్రదర్శించారు. కేంద్ర ఎౖక్సైజ్, కస్టమ్స్ మండలి ప్రదర్శించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) శకటం చూపరులను ఆకట్టుకుంది. నేవీ కూడా వివిధ యుద్ధ నౌకలు, జలాంతర్గాములను ప్రదర్శించింది. అశ్విక దళం, పదాతి దళం, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఢిల్లీ పోలీస్, ఎన్ సీసీ, ఎన్ ఎస్ఎస్ తదితర సిబ్బంది కూడా పరేడ్‌లో పాల్గొన్నారు.
కవాతు మొదలవ్వడానికి కొద్ది సేపటి ముందు మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, త్రివిధ దళాల అధిపతులు కలిసి ఇండియా గేట్ దగ్గర్లోని అమర్ జవాన్ జ్యోతి వద్ద పూల మాలలు వేసి అమరులైన సైనికులకు నివాళులర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ మొత్తం మీద దాదాపు 60 వేల మంది సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉక్రెయిన్ తొలి ఉప ప్రధాని స్టెపాన్ కుబివ్ కూడా రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరయ్యారు.
ఎట్ హోంకు అడ్డంకిగా వర్షం
ప్రణబ్ ముఖర్జీ చివరి ‘ఎట్ హోం’కార్యక్రమానికి వర్షం ప్రతిబంధకంగా నిలిచింది. మొఘల్ గార్డెన్స్ లో జరగాల్సిన కార్యక్రమాన్ని భారీ వర్షం కారణంగా దర్బార్ హాల్, అశోక హాళ్లలోకి మార్చారు. ఈ కార్యక్రమానికి ప్రణబ్‌తోపాటు మోదీ, నహ్యన్, హమీద్ అన్సారీ, మన్మోహన్ సింగ్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ , కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ తదితరులు హాజరయ్యారు.
విదేశాల్లోనూ ఘనంగా...
బీజింగ్/కైరో: భారత 68వ గణతంత్ర దినోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉత్సాహంగా జరిగాయి. చైనా రాజధాని బీజింగ్‌లో భారత రాయబార కార్యాలయం వద్ద రాయాబారి విజయ్ గోఖలే త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ‘ఎ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇండియా’అనే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. నేపాల్, ఈజిప్టు, సింగపూర్లలోనూ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. సింగపూర్‌లోని సన్ టెక్ కన్వెన్షన్ సెంటర్లో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్దదైన హెచ్డీ వీడీయో వాల్‌ను వెలిగించారు. అందులో ‘భారత్‌కు 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అని రాసి మన జెండాను ప్రదర్శించారు.
అస్సాం, మణిపూర్‌లో ఏడుచోట్ల పేలుళ్లు
న్యూఢిల్లీ: ఓ పక్క దేశమంతా గణతంత్ర ఉత్సవాలు జరుపుకుంటుండగా.. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్‌లో గురు వారం ఏడుచోట్ల పేలుళ్లు చోటుచేసు కున్నాయి. అల్ఫా వేర్పాటు వాదులు అస్సాంలో ఐదు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు.చరైడో, సిబ్సాగర్, దిబ్రూగఢ్, తిన్సూకియా జిల్లాలో ఈ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. దిబ్రూగఢ్‌లో పరేడ్ గ్రౌండ్ నుంచి కేవలం 500 మీటర్ల దూరంలోనే పేలుడు జరిగింది. అలాగే మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు, ఇంపాల్ పశ్చిమ జిల్లాల్లో రెండుచోట్ల పేలుళ్లు సంభవించాయి. అయితే ఇరు రాష్ట్రాల్లో ఎక్కడా గణతంత్ర వేడుకలకు ఆటంకం కలగలేదు. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. కాగా, కశ్మీర్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొబైల్స్, ఇంటర్నెట్ను నిలుపుదల చేయకుండా ఉత్సవాలు జరపడం దశాబ్దకాలంలో ఇది రెండోసారి. పంజాబ్, హరియా ణా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఢిల్లీలో వేడుకల సమయంలో కొద్దిపాటి వర్షం కురిసింది.
ఈ ఏడాది ప్రత్యేకతలు...
♦ బ్లాక్ క్యాట్ కమాండోలుగా పిలిచే జాతీయ భద్రతా దళం (ఎన్ ఎస్జీ) గణతంత్రదిన మార్చ్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి.
♦ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ తొలిసారిగా రిపబ్లిక్ డే ప్రదర్శనలో పాల్గొంది.
♦ భారత గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనడానికి తమ సైనికులను పంపిన రెండో దేశం యూఏఈ. గతేడాది ఫ్రాన్స్ ఈ పని చేసింది.
♦ జాతీయ సాహస పురస్కారాలు పొందిన బాలబాలికలు పరేడ్‌లో ఓపెన్ జీప్లలో ప్రయాణించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 21 మంది పరేడ్‌లో పాల్గొన్నారు.
♦ వర్షం పడుతున్నా వేడుకల్లో శతఘ్నిదళం మాత్రం కచ్చితమైన సమయానికి 21 సార్లు తుపాకులను పేల్చి వందనాన్ని సమర్పించింది.