Explosives caught
-
మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర?
ఖలీల్‌వాడి: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై మరోమారు హత్యకు కుట్ర జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం నగరంలోని నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధి కేసీఆర్ కాలనీ న్యూ హౌసింగ్ బోర్డులో బొంత సుగుణ అనే మహిళ ఇంట్లో పోలీసులు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు రూరల్ ఎస్‌హెచ్‌వో లింబాద్రి తనిఖీలు చేపట్టారు. 95 జిలెటెన్ స్టిక్స్, 10 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా మాక్లూర్ మండలం కల్లెడ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ తన ఇంట్లో వీటిని పెట్టినట్లు తెలిపింది. ప్రసాద్ గౌడ్ గత ఏడాది ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హైదరాబాద్‌లో హత్యాయత్నం కేసులో చంచల్‌గూడ జైలుకు వెళ్లాడు. జనవరి 9న జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తర్వాత జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను కొనుగోలు చేసి మహిళ ఇంట్లో దాచిపెట్టాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ప్రసాద్‌గౌడ్ ఒకరిపై కత్తితో దాడిచేసిన కేసులో నిజామాబాద్ జిల్లా జైలులో ఉన్నాడు. -
ఒబామా నివాసానికి పేలుడు పదార్థాలు
వాషింగ్టన్/న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, 2016 ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ నివాసాలకు గుర్తుతెలియని దుండగులు పేలుడు పదార్థాలు పంపేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. అయితే బుధవారం వాటిని యూఎస్ సీక్రెట్ సర్వీస్ మధ్యలోనే అడ్డగించి పేల్చివేసింది. రోజువారీ బట్వాడా చేయడానికి ముందు పార్సిల్స్‌ను తనిఖీచేస్తుండగా ఒబామా, హిల్లరీ పేరిట వచ్చిన ప్యాకేజీల్లో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించామని సీక్రెట్ సర్వీస్ తెలిపింది. అవి వారికి చేరడానికి మందే పేల్చివేశామని, ఒబామా, హిల్లరీకి ఎలాంటి ముప్పులేదని స్పష్టంచేసింది. ఒబామా పేరిట వచ్చిన ప్యాకేజీని వాషింగ్టన్లో, హిల్లరీ చిరునామాతో వచ్చిన ప్యాకేజీని న్యూయార్క్‌లో గుర్తించారు. ఈ ఘటనపై సీక్రెట్ సర్వీస్ పూర్తిస్థాయి విచారణ ప్రారంభించింది. ఇదిలా ఉండగా, అనుమానాస్పద ప్యాకేజీ కనిపించడంతో న్యూయార్క్‌లోని బ్యూరో భవనాన్ని ఖాళీచేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ వెల్లడించింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు బాంబు నిర్వీర్య బృందాలు, అధికారులను పంపినట్లు న్యూయార్క్ పోలీసులు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలన్నింటిలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీఎన్ఎన్ అధ్యక్షుడు జెఫ్ జుకర్ చెప్పారు. అనుమానాస్పద పేలుడు పదార్థాలు బయటపడటంపై అధ్యక్షుడు ట్రంప్‌కు వివరించినట్లు శ్వేతసౌధం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒబామా, హిల్లరీపై దాడులకు జరిగిన ప్రయత్నాలను శ్వేతసౌధం ఖండించింది. ఇలాంటి వాటికి బాధ్యులైన వారిని చట్ట పరిధిలో శిక్షిస్తామని తెలిపింది. -
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
రాయిపూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టు తీవ్ర ప్రభావిత ప్రాంతం సుక్మా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు. బెజ్జి నుంచి మంగళవారం ఉదయం సీఆర్పీఎఫ్, జిల్లా రిజర్వు పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భెజ్జి- ఇంజారం గ్రామాల మధ్య బెజ్జి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని కల్వర్టు కింద ఉంచిన పేలుడు పదార్థాలను కనుగొన్నారు. అయితే, తక్కువ తీవ్రత కలిగిన వీటిని పోలీసు బలగాలే లక్ష్యంగా పెట్టి ఉంటారని సుక్మా ఎస్పీ ఇందిరా కల్యాణ్ ఎలిసెల తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోందని వివరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు.