ఒబామా నివాసానికి పేలుడు పదార్థాలు | 'Pipe bombs' sent to Hillary Clinton, Obama residences | Sakshi
Sakshi News home page

ఒబామా నివాసానికి పేలుడు పదార్థాలు

Published Thu, Oct 25 2018 3:32 AM | Last Updated on Thu, Oct 25 2018 10:21 AM

'Pipe bombs' sent to Hillary Clinton, Obama residences - Sakshi

సీఎన్‌ఎన్‌ ఆఫీసు వద్ద అప్రమత్తంగా భద్రతాబలగాలు

వాషింగ్టన్‌/న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, 2016 ఎన్నికల్లో ట్రంప్‌ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌ నివాసాలకు గుర్తుతెలియని దుండగులు పేలుడు పదార్థాలు పంపేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. అయితే బుధవారం వాటిని యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ మధ్యలోనే అడ్డగించి పేల్చివేసింది. రోజువారీ బట్వాడా చేయడానికి ముందు పార్సిల్స్‌ను తనిఖీచేస్తుండగా ఒబామా, హిల్లరీ పేరిట వచ్చిన ప్యాకేజీల్లో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించామని సీక్రెట్‌ సర్వీస్‌ తెలిపింది. అవి వారికి చేరడానికి మందే పేల్చివేశామని, ఒబామా, హిల్లరీకి ఎలాంటి ముప్పులేదని స్పష్టంచేసింది. ఒబామా పేరిట వచ్చిన ప్యాకేజీని వాషింగ్టన్‌లో, హిల్లరీ చిరునామాతో వచ్చిన ప్యాకేజీని న్యూయార్క్‌లో గుర్తించారు.

ఈ ఘటనపై సీక్రెట్‌ సర్వీస్‌ పూర్తిస్థాయి విచారణ ప్రారంభించింది. ఇదిలా ఉండగా, అనుమానాస్పద ప్యాకేజీ కనిపించడంతో న్యూయార్క్‌లోని బ్యూరో భవనాన్ని ఖాళీచేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ వెల్లడించింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు బాంబు నిర్వీర్య బృందాలు, అధికారులను పంపినట్లు న్యూయార్క్‌ పోలీసులు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలన్నింటిలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీఎన్‌ఎన్‌ అధ్యక్షుడు జెఫ్‌ జుకర్‌ చెప్పారు. అనుమానాస్పద పేలుడు పదార్థాలు బయటపడటంపై అధ్యక్షుడు ట్రంప్‌కు వివరించినట్లు శ్వేతసౌధం సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఒబామా, హిల్లరీపై దాడులకు జరిగిన ప్రయత్నాలను శ్వేతసౌధం ఖండించింది. ఇలాంటి వాటికి బాధ్యులైన వారిని చట్ట పరిధిలో శిక్షిస్తామని తెలిపింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement