రూ.7 వేల కోట్ల విలువైన పొగాకు ఎగుమతి లక్ష్యం
రాజమండ్రి రూరల్: విదేశాలకు రూ. ఏడు వేల కోట్ల విలువైన పొగాకు ఎగుమతి లక్ష్యమని టుబాకో బోర్డు చైర్మన్ డాక్టర్ కె. గోపాల్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజ మండ్రిలోని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థలో బుధవారం జరిగిన వార్షిక పరిశోధనా సమావేశాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం 103 దేశాలకు పొగాకు ఎగుమతి చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది 172 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి లక్ష్యం కాగా 205 మిలియన్ కిలోలను బోర్డు కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్రంలో పొగాకు వేలానికి 19 ప్లాట్‌ఫారాలు ఉండగా ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో ఐదు ప్లాట్‌ఫారాల్లో మాత్రమే వేలం జరుగుతోంద న్నారు. అక్కడ కూడా 15 రోజుల్లో వేలం పూర్తవుతుందన్నారు. గత రెండేళ్లుగా అనధికారిక పొగాకు అమ్మకాలను నిరోధించడంతో రైతులకు గిట్టుబాటుధర వచ్చిందన్నారు. నాణ్యతలో విదేశాలతో పోటీ పడేలా పండించాలని రైతులకు సూచించారు. ప్రత్యామ్నాయ పంటలకు మళ్లాలని సూచించారు.