మొదలైన జూడాల సమ్మె
విజయవాడ, కర్నూలులో విధుల బహిష్కరణ
సాక్షి, విజయవాడ బ్యూరో: డిమాండ్ల పరిష్కారం కోసం విజయవాడ, కర్నూలు వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో జూని యర్ డాక్టర్లు(జూడా) శనివారం సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో సమ్మె చేస్తామని శుక్రవారం రాత్రి ప్రకటించిన జూడాల సంఘం అన్నట్లుగానే ఈ రెండుచోట్లా విధులు బహిష్కరించింది. విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో జూడాలు విధులు బహిష్కరించికళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. కర్నూలు వైద్య కళాశాలలోనూ జూడాలు విధులు బహిష్కరించి భారీ ర్యాలీ, ధర్నా చేశారు. విశాఖపట్నం కింగ్‌జార్జి, కాకినాడ రంగరాయ, తిరుపతి రుయా ఆస్పత్రుల్లో జూడాలు సమ్మె నోటీసులు ఇచ్చారు.
అనంతపురం, కర్నూలు, గుం టూరు, కడప వైద్య కళాశాలల్లో 24వ తేదీ నుంచి సమ్మె చేసేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం నుంచి మిగిలిన కళాశాలల్లోనూ సమ్మె చేస్తామని జూనియర్ డాక్టర్ల సంఘం స్పష్టం చేసింది. చర్చలు విఫలమైన తర్వాత మళ్లీ ప్రభుత్వం తరఫు నుంచి తమను ఎవరూ సంప్రదించలేదని జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. అత్యవసర వైద్య సేవలు మినహా మిగిలిన అన్ని సేవలకు జూడాలు హాజరుకారని ఆయన స్పష్టం చేశారు. ఒక సంవత్సరం గ్రామీణ సర్వీసు నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ సర్వీసుకు తాము వ్యతిరేకం కాదని అయితే అక్కడి ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేకుండా తమను వైద్యం చేయమనడం సరికాదన్నారు. సమ్మెతో రోగులు అవస్థలు పడ్డారు.