త్రీమంకీస్ - 55
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 55
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
‘‘రాకూడని విధంగా వచ్చింది. ఇదే కాలేజ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ లాంటి సందర్భంలో వచ్చి ఉంటే బావుండేది’’ మర్కట్ చెప్పాడు.
‘‘ఆకలిగా ఉంది. ఆతిథ్యం సంగతి చూడు’’ కపీష్ రుధిరని కోరాడు.
‘‘మీకు పీజా ఓకే కదా అంకుల్స్?’’ అడిగింది.
‘‘ఓకే.’’
రుధిర పీజా హట్‌కి ఫోన్ చేసి నలుగురికీ నాలుగు ఛీజ్ పీజా విత్ ఎక్స్ట్రా టాపింగ్స్, జింజర్ బ్రెడ్, కోక్ని ఆర్డర్ చేసింది.
‘‘అలా గాలి పీల్చుకు వస్తాం’’ కపీష్ ఆమెతో చెప్పాడు.
‘‘స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలని నాకూ ఉంది’’ మర్కట్ చెప్పాడు.
‘‘స్వతంత్ర పవనాలు పీల్చుకోవాలని నాకూ ఉంది’’ వానర్ కూడా చెప్పాడు.
‘‘ఇప్పుడే టివిలో మీ ఫొటోలని చూశారుగా? మిమ్మల్ని ఎవరైనా గుర్తు పడితే ప్రమాదం. కిటికీ దగ్గర నిలబడి గాలిని పీల్చుకోండి’’ రుధిర సూచించింది.
ఐతే మిగిలిన ఇద్దరు మిత్రులతో ఏకాంతం కోరే కపీష్ చెప్పాడు - ‘‘మన వాళ్ళల్లో అంత సామాజిక స్పృహ ఉండదు. మనకెందుకులే’ అనుకునే రకాలు మన వాళ్ళు. ఆ మధ్య ఓ ఛానల్ వాళ్ళు రేప్ చేయబడే అరుపుల్ని, మాటల్ని రికార్డ్ చేసి ఓ వేన్లోంచి బయటకి వినపడేలా ఏర్పాటు చేస్తే దాని పక్క నించి వెళ్ళిన ఒక్కరంటే ఒక్కరు కూడా పోలీసులకి ఫోన్ చేయలేదు. సహాయానికి కూడా వెళ్ళలేదు. ఫర్వాలేదు. రోడ్ మీదకి కాదు. టెర్రేస్ మీదకే వెళ్ళేది.’’
‘‘జాగ్రత్త సుమా!’’
ముగ్గురూ మెట్లెక్కి టెర్రేస్ మీదకి వెళ్ళారు. ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు ఏకాంతం కోరి తూర్పు, పడమర, దక్షిణాల వైపు పిట్ట గోడలకి ఆనుకుని నిలబడి తమ బాయ్‌ఫ్రెండ్స్‌తో సెల్ ఫోన్లలో మాట్లాడుతున్నారు. మిత్రులు ముగ్గురూ ఉత్తరం పిట్ట గోడ దగ్గరకి వెళ్ళారు.
‘‘ఇంత పొద్దున్నే వీళ్ళు బాయ్‌ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నారే?’’ మర్కట్ ఆశ్చర్యపోయాడు.
‘‘నేననుకోవడం రాత్రి నించి మాట్లాడుతూండి ఉంటారు. సొరంగంలో నాకో మేప్ దొరికింది. మనం దీని గురించి ఆలోచించాలి’’ కపీష్ జేబులోంచి దాన్ని తీసి మిగిలిన ఇద్దరికీ చూపించాడు.
‘‘బేంక్ పక్కనే రైట్ టైం అనే బిల్డింగ్. వాటి మధ్య దూరం పన్నెండు అడుగులు అని కూడా రాశారు. దీని అర్థం ఏమిటి?’’ మేప్‌ని చూసి వానర్ అడిగాడు.
‘‘దొంగల దగ్గర దొరికిన మేప్‌లో బేంక్ అని రాసి ఉందంటే, దొంగలు ఆ బేంక్‌ని దోచుకోవాలనే పథకంతో ఈ మేప్‌ని తయారు చేసి ఉంటారు’’ మర్కట్ చెప్పాడు.
‘‘కరెక్ట్. రైట్ టైంని మేప్‌లో ప్రత్యేకంగా రాశారంటే దానర్థం ఆ బేంక్ దోపిడీలో దీని పాత్ర కూడా ఉందన్నమాట’’ మర్కట్ ఆలోచనగా చెప్పాడు.
‘‘సొరంగం తవ్విన దొంగలు తయారు చేసిన మేప్ కాబట్టి బహుశ ఈ బిల్డింగ్‌లోంచి బేంక్‌లోకి సొరంగాన్ని తవ్వదలచుకుని ఉంటారు’’ వానర్ ఉత్సాహంగా చెప్పాడు.
‘‘లేక ఇప్పటికే కొంత తవ్వేశారా? లేదా వీళ్ళ తోడు దొంగలు తవ్వుతున్నారా? అది మనం కనుక్కోవాలి’’ కపీష్ సూచించాడు.
‘‘బేంక్ పేరు రాసుంటే బావుండేది. హైద్రాబాద్‌లో ఎక్కడని వెతకడం?’’ మర్కట్ ఆలోచనగా చెప్పాడు.
‘‘అడ్రన్ కూడా రాస్తే బావుండేది’’ వానర్ చెప్పాడు.
‘‘అది వాళ్ళ తల్లో ఉండి ఉంటుంది. అవును. రేపు ఇంకోసారి సొరంగంలో పాకాల్సి ఉంటుంది అన్న మాటలు నాకు వాళ్ళు మాట్లాడుకుంటూంటే వినిపించాయి.’’
‘‘బహుశ వాళ్ళు సొరంగాన్ని దాదాపుగా పూర్తి చేశాక ఆ దొంగతనాన్ని చేయకుండానే జైలుకి వచ్చినట్లున్నారు. మనం అది తెలుసుకోవాలి’’ కపీష్ చెప్పాడు.
‘‘రైట్ టైం అనే పేరు ఏ షాపుకి పెట్టచ్చు?’’ మర్కట్ ఆలోచనగా అడిగాడు.
‘‘ఎయిర్ లైన్స్ కంపెనీకి అది సరిగ్గా సరిపోతుంది’’ వానర్ చెప్పాడు.
‘‘లేదా సిటీల మధ్య బస్లని నడిపే కంపెనీలకి కూడా.’’
‘‘ముందా కంపెనీ ఏదో కనుక్కుంటే, దాని అడ్రస్ని బట్టి బేంక్ ఏదో కనుక్కోవచ్చు. హైద్రాబాద్‌లో వేల కొద్దీ బేంక్లు ఉంటాయి’’ కపీష్ సూచించాడు.
‘‘ఐతే నువ్వు కంప్యూటర్ సావీ కదా. గూగుల్ చేసి కనుక్కో’’ మర్కట్ వానర్‌కి సూచించాడు.
‘‘ఐతే మనం మన జైలర్ ఇంటికి వెళ్ళాలి’’ వానర్ వెంటనే చెప్పాడు.
‘‘దేనికి?’’ కపీష్ తుళ్ళిపడ్డాడు.
‘‘ఆయన చెప్పిన మాటలు గుర్తు లేదా? ‘నాకు గూగుల్ అవసరం లేదు. నా భార్యకి అన్నీ తెలుసు’ అన్నాడుగా?’’
‘‘అది భార్య అన్నీ తెలుసన్నట్లుగా మాట్లాడుతుందని ఎకసక్కెంగా అన్న మాటలు తప్ప నిజం కాదు’’ మర్కట్ అసహనంగా చెప్పాడు.
ఆ మేప్లోని బేంక్ పేరుని, ఎడ్రస్ని పట్టుకోడానికి ఇంటర్నెట్లో ఎలా సెర్చ్ చేయాలి అన్న అంశం మీద ముగ్గురు మిత్రులు కొద్దిసేపు చర్చించుకున్నారు. సొరంగం నించి బేంక్‌కి వెళ్ళి దోచుకున్నాక తిరిగి వెళ్ళడానికి వీలుగా ఓ కారుని కూడా దొంగిలించి సమీపంలో పార్క్‌చేసి ఉంచాలని నిర్ణయించారు.
(ముగ్గురు మిత్రులూ రుధిరతో కలిసి
చెప్పుకున్న జోక్స్ ఏమిటి?)