'విద్వేష ప్రబోధకులతో సమాజానికి ముప్పు'
నైరోబి: ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ముద్రల ప్రపంచమంతా విస్తరిస్తున్న నేపథ్యంలో కెన్యా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. హింస, విద్వేష ప్రబోధకులు సమాజ సమగ్రతకు ముప్పుగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉగ్రవాద భావజాలాన్ని ఎదుర్కొనేందుకు యువత సానుకూల భావజాలాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఢాకా ఉగ్రవాద పేలుళ్లకు కారణమయ్యారంటూ వివాదాస్పద ముస్లిం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
నైరుబీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఆర్థిక పురోగతి ఫలాలు ప్రజలకు అందాలంటే సమాజ భద్రత అత్యంత కీలకమని నొక్కి చెప్పారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, ఉగ్రవాదులను రాజకీయ సాధనంగా వాడుకోవడాన్ని కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాద భావజాల నిరోధానికి కావాల్సిన సానుకూల భావజాలం పెంపొందించడంలో యువత కీలకపాత్ర పోషించాల్సిన అవసరముందని చెప్పారు.