కళ్లజోళ్లలో.. కనికట్టు
తూర్పుగోదావరి, మండపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్ల పంపిణీకి ముఖ్యమంత్రి ఐ కేంద్రం పేరిట కంటి పరీక్ష కేంద్రాలను గత ఫిబ్రవరిలో ప్రభుత్వం ప్రారంభించింది. అనపర్తి, జగ్గంపేట, కడియం, కొత్తపేట, మండపేట, ముమ్మిడివరం, పెద్దాపురం, పిఠాపురం, ప్రతిపాడు, రాజానగరం, రంపచోడవరం, రాజోలు, పి.గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేసింది. కంటి పరీక్షల నిమిత్తం ఒక్కో కేంద్రంలోను రూ.10 లక్షల విలువైన యంత్ర సామగ్రిని ఏర్పాటు చేశారు. రోగులకు ఫండస్, రిఫ్రాక్షన్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్నారు. కళ్లజోళ్ల సరఫరాను ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఒక్కో కళ్లజోడుకు రూ. 280 నుంచి పవర్‌ను బట్టి రూ.300కు పైగా సంస్థకు చెల్లిస్తున్నట్టు సమాచారం.
నాసిరకం ఫ్రేములు
కళ్లజోళ్లలోని ఫ్రేములు నాసిరకంగా అందజేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 13 కేంద్రాల్లో ఇప్పటి వరకు 14,017 కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఇందుకోసం దాదాపు రూ.40 లక్షలకు పైగానే ప్రజాధనాన్ని ప్రభుత్వం వెచ్చించింది. కాగా ఫ్రేములు అల్పంగా ఉండటంతో పెట్టుకునే సమయంలో విరిగిపోతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. నాసిరకంవి సరఫరా చేస్తున్నారని వారంటున్నారు. కళ్లజోడు ఇచ్చిన వెంటనే పెట్టుకుందామనుకుంటే ఐ కేంద్రంలో సిబ్బంది ముందే విరిగిపోయిందని సత్తి ధనుంజయరెడ్డి తెలిపారు. అద్దాలు బాగానే ఉండటంతో మళ్లీ రూ. 250 ఖర్చు పెట్టి కొత్త ఫ్రేమును వేయించుకున్నానన్నారు. కళ్లజోళ్ల ఫ్రేములు విరిగిపోతున్నట్టు పలువురు లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఇప్పటికే సంస్థ ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినట్టు పలు ఐ కేంద్రాలకు చెందిన సిబ్బంది తెలిపారు. ఇటీవల జరిగిన మండపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ ప్రతిపక్ష నేత రెడ్డి రాజుబాబు ఇదే విషయమై అధికారులను నిలదీశారు. నాసిరకం ఫ్రేములు సరఫరా చేస్తూ పేదవర్గాల వారిని ఇబ్బందులు పాల్జేస్తున్నారని విమర్శించారు. నాణ్యత కలిగిన ఫ్రేములు అందజేయాలని పేదవర్గాల వారు కోరుతున్నారు.