జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు
ముంబై: నేత్రదానంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో అనేక అపోహలున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే నేత్రాలను దానం చేయొచ్చని.. నేత్రదానం చేస్తున్నట్లు ముందుగా ప్రకటించినవారు మాత్రమే తమ కళ్లను దానం చేయొచ్చని.. ఇలాంటి అపోహలను తొలిగించేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తోంది. ప్రచార కార్యక్రమాలు, నేత్రదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తద్వారా ప్రజను నేత్రదానం వైపు ప్రోత్సహించేలా ప్రయత్నాలు చేస్తోంది.
ఎవరైనా నేత్రదానం చేయొచ్చు...
నేత్రదానం చేయడానికి వయసుకు పరిమితులు లేవు. ఒకరు రెండు కళ్లు దానం చేయడం ద్వారా ఇద్దరికి కంటి చూపు వస్తుంది. నేత్రదానం చేస్తున్నట్లు ప్రకటించినా, ప్రకటించకపోయినా కళ్లను దానం చేయొచ్చు. కళ్లజోడు పెట్టుకునేవారు. అధిక బ్లడ్ ప్రెషర్, మధుమేహం, ఉబ్బసం వ్యాధులతో ఉన్నవారు, కంటి శుక్లాల ఆపరేషన్ చేయించుకున్న వారూ తమ నేత్రాలు దానం చేయొచ్చు. నేత్రాలు దానం చేయూలనుకుంటే వెంటనే దగ్గరిలోని నేత్రదాన ంపై అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు, ఐ బ్యాంకులకు సమాచారం ఇవ్వాలి.
ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ నేత్రదానం కోసం 1919/1053 అనే ఉచిత (టోల్‌ఫ్రీ) నంబర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. నేత్రాలను దానం చేయాలనుకునేవారు ఈ నంబర్లకు ఫోన్ చేసి తమ వివరాలు తెలియజేయాలి. తమవారెవరైనా మరణించిన, బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉన్నా వారి నేత్రాలను దానం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు భావిస్తున్నా ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. అయితే వ్యక్తి మరణించిన వెంటనే సమాచారం ఇవ్వాలి.