కురులకు టాల్కమ్ పౌడర్!
బ్యూటిప్స్
- షాంపూతో తలస్నానం చేశాక జుట్టు బాగా చిక్కు పడుతుంది. అలాగే దువ్వితే జుట్టు రాలడం అధికమవుతుంది. అలా కాకుండా ఉండాలంటే చిక్కు ఉన్న చోట బేబీ టాల్కమ్ పౌడర్ రాసుకొని దువ్వితే సులువుగా దువ్వుకోవచ్చు.
- కొబ్బరి నూనెలాగే కొబ్బరి పాలు కూడా కురుల సౌందర్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పాలను తలకు ఉపయోగించడం కూడా మంచి చిట్కా. షాంపూతో తలస్నానం చేసే ముందు కొబ్బరి పాలతో మాడును బాగా మర్దన చేసుకోవాలి. ఈ పాలను తలస్నానం చేశాక కూడా నూనెలా రాసుకోవచ్చు. జిడ్డుతనం ఉండదు కాబట్టి ఇది మంచి కండిషనర్‌గా ఉపయోగపడుతుంది. జుట్టు త్వరగా చిక్కులు పడదు.
- ప్రతిరోజూ ఉద్యోగాలకంటూ బయటివెళ్లే మహిళలకు ఫేస్‌స్క్రబ్ తప్పక ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు మార్కెట్లో దొరికే ప్రాడక్టులు వాడేకంటే ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరం. రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండికి నాలుగు టీస్పూన్ల తేనె, పేస్ట్‌లా తయారు చేసుకోవడానికి కావాల్సినంత రోజ్‌వాటర్ తీసుకోవాలి. ఆ మిశ్రమంతో స్క్రబ్ చేసుకుంటే ముఖంపై అంటుకున్న దుమ్ము, ధూళిని తరిమి శుభ్రంగా ఉంచుతుంది.
- గుమ్మడికాయతో కూర వండుకోవచ్చు, వడియాలు పెట్టుకోవచ్చు ఇవే మనకు తెలిసిన విషయాలు. కానీ ఈ గుమ్మడికాయ గుజ్జు ముఖ సౌందర్యాన్ని పెంచుతున్న అంశం కొత్తగా ఉంది కదూ. గుమ్మడికాయ గుజ్జులో ఒక గుడ్డు తెల్ల సొన, రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పాలను కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసుకొని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖంపై ఉన్న మొటిమలు, నల్ల మచ్చలు మటుమాయమై కాంతిమంతంగా నిగారిస్తుంది.