బ్యాంకు అధికారుల పేరుతో ఏటీఎం నంబర్ల కోసం ఆరా
తప్పుడు కాల్స్‌తో మోసాలకు యత్నం
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
సిరిసిల్ల: ‘హలో.. నేను ఎస్బీఐ బ్యాంకు మేనేజర్‌ను మాట్లాడుతున్నాను. మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయింది. దాన్ని పునరుద్ధరించమంటారా?’ అంటూ మంగళవారం ఉదయం 8677995663 నంబర్ నుంచి సిరిసిల్ల శివనగర్‌కు చెందిన రాజుకు ఫోన్ వచ్చింది. మాట్లాడుతున్న వ్యక్తి హిందీలో మాట్లాడడంతో రాజు సైతం హిందీలోనే సమాధానం చెప్పారు. మా ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని మీకు ఎవరు చెప్పారు? అని ఎదురు ప్రశ్నించారు. ఆరు నెలలకోసారి ఏటీఎం కార్డు బ్లాక్ అవుతుంది. మీ ఏటీఎం కార్డుపై ఉన్న నంబర్లు చెబితే మళ్లీ పునరుద్ధరిస్తామని ఫోన్ చేసిన వ్యక్తి అడిగారు.. అనుమానం వచ్చిన రాజు అసలు మీరు ఎవరు.. నా ఏటీఎం నంబరు మీకు ఎందుకు చెప్పాలి? మీరు బ్యాంకు మేనేజరే అని మాకేంటి నమ్మకం అంటూ గట్టిగా ప్రశ్నించడంతో అవతలి వ్యక్తి ఫోన్ కట్ చేశారు. సిరిసిల్లలో పలువురికి ఇదే నంబరును నుంచి మంగళవారం వచ్చిన ఫోన్ కాల్ వచ్చింది. బాధితుల ఫిర్యాదులో పోలీసులు ఈ నంబరు బీహార్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయినట్లు నిర్ధారించారు. అయితే ఎవరూ నంబర్ చెప్పకపోవడంతో మోసపోలేదు. బ్యాంకు మేనేజర్‌నంటూ, అధికారులమంటూ తప్పుడు ఫోన్ కాల్స్ వస్తున్నందున బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని టౌన్ సీఐ అజయ్‌కుమార్ తెలిపారు. ఎవరికీ ఏటీఎం నంబర్లు, రహస్య నంబరు చెప్పొద్దని సూచించారు.