కత్తిలాంటి కళ!
సినిమాలో ఫైటింగ్ సన్నివేశం వచ్చిందంటే మనకి చెమటలు పట్టేస్తాయి. ఫ్యాక్షన్ సినిమాలైతే ... కత్తులతో పొడుచుకోవడం, గొడ్డళ్లతో నరుక్కోవడం. అవన్నీ డమ్మీ ఆయుధాలన్న సంగతి మరిచిపోతుంటాం. వాటిని నిజమైన ఆయుధాల్లా తీర్చిదిద్దిన కళాకారుల నైపుణ్యం అది. కత్తి, గొడ్డలి, బల్లెం, రాడ్... అన్నీ డమ్మీవే. ప్రముఖ ఆర్ట్ డెరైక్టర్ రవీంద్రరెడ్డిని పలకరిస్తే వీటికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
వాటిదే ట్రెండ్...
సినిమాల్లో ఫైటింగ్ ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతోంది. ఒకప్పుడు ఆయుధం లేకుండా పాతికమంది విలన్లని చితక్కొట్టడం హీరో ప్రత్యేకత. దశాబ్దం క్రితం పరిచయమైన ఫ్యాక్షన్ ఫైటింగ్‌ల వల్ల డమ్మీ ఆయుధాలకు గిరాకీ పెరిగింది. శివ సినిమాలో హీరో ఆయుధం సైకిల్ చైన్... అక్కడి నుంచి హీరో చేతిలో ఏదో ఒకటి వెరైటీ ఆయుధం ఉండటం ట్రెండ్‌గా మారింది. కత్తులు, గొడ్డళ్లతో సరిపెట్టకుండా రాజమౌళి వంటి దర్శకులు కొత్తరకం ఆయుధాలకు తెరతీశారు. ఆయుధాలకు సంబంధించి బాగా పేరు తెచ్చిన సినిమాలు ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర, మర్యాద రామన్న... ఇంకా చాలా ఉన్నాయి. చూడ్డానికి నిజమైనవాటిలా కనిపించే ఆ ఆయుధాల వెనుక చాలా శ్రమ దాగి ఉంది.
మూడు రకాలు...
డమ్మీ ఆయుధాలకు వాడే మెటీరియల్‌లో ముఖ్యమైంది లెటెక్స్. ద్రవరూపంలో ఉండే ఈ మెటీరియల్‌ని పైపూతగా వాడతారు. ఆయుధాల రూపంలో మలచడానికి హోమ్షీట్, రబ్బర్షీట్, సాఫ్ట్బోర్డు, థర్మోకోల్ని వాడతారు. ‘‘హీరో చేతిలో ఉండే కత్తిని తయారుచేయాలంటే ముందు పేపర్‌పై ఆకారాన్ని గీసుకుని, దానికి తగ్గట్టు మూడు రకాల షీట్లను కట్ చేసుకుని, కత్తిలా ఉండే రూపం ఇస్తాం. ఆ తర్వాత రంగు వేసి పైన నున్నగా కనిపించడానికి లెటెక్స్ పూస్తాం.
ఇలా గొడ్డలి, రాడ్లు, ఊచలు, గునపాలు, బల్లెం... ఫైటింగ్ సీన్లో ఏ యే ఆయుధాలు అవసరమో అన్నీ చేస్తాం. అయితే ఎక్కువగా వాడే ఆయుధం మధ్యలో విరిగిపోతే ఇబ్బంది కాబట్టి, అదనంగా నాలుగైదు చేసి పెట్టుకుంటాం. అలాగే లాంగ్షాట్కి, క్లోజప్ షాట్‌కి వేరువేరు ఆయుధాలు తయారుచేస్తాం. లాంగ్షాట్కి తక్కువరకం మెటీరియల్ వాడినా సరిపోతుంది. క్లోజప్‌లో కనిపించే ఆయుధాలకు ఖర్చు ఎక్కువవుతుంది’’ అంటూ డమ్మీ ఆయుధాల వెనుక తమ కృషిని గురించి చెప్పారు రవీంద్రరెడ్డి.
ఆయుధాలకు సంబంధించి ఎన్నెన్నో విషయాలు వివరించారు ఈ ఆర్ట్ డెరైక్టర్. సినిమాల్లో కనిపించే అబద్ధపు ఆయుధాల వెనకున్న కృషికి నిజమైన సాక్ష్యాలు ఇక్కడ ఇచ్చిన బొమ్మలు.
- భువనేశ్వరి