రసాయనాల ఫ్యాక్టరీతో ప్రాణాలకు ముప్పు
తక్షణం నిర్మాణ పనులు ఆపాలి
వైఎస్సాసీపీ నేత డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి డిమాండ్
జి.దొంతమూరులో రెండు గ్రామాల ప్రజల నిరాహార దీక్ష
వివిధ పార్టీల నేతలు సంఘీభావం
జి.దొంతమూరు (రంగంపేట) :
ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే కేపీఆర్ రసాయన మూలకాల ఫ్యాక్టరీ నిర్మాణాన్ని తక్షణం నిలుపుదల చేయాలని వెఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ కో–ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు ఏళ్ల తరబడి ఆందోళనలు చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యేకు చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆయన ఒక్కసారైనా అసెంబ్లీలో ప్రస్తావించారాని ప్రశ్నించారు. కేపీఆర్ కాస్టిక్ సోడా, సల్ఫూ్యరిక్ యాసిడ్, ఫెస్టిసైడ్స్, థర్మల్, రసాయన మూలకాల తయారీ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా జి.దొంతమూరులో భారీ సంఖ్యలో ప్రజలు ఆదివారం రిలే నిరాహార దీక్ష చేశారు. పోరాట సమితి అధ్యక్షుడు గిరిజాల సత్తిబాబు, బిక్కవోలు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పడాల వెంకటరామారెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్ష శిబిరంలో డాక్టర్ సూర్యనారయణ రెడ్డి మాట్లాడారు.
ఫ్యాక్టరీ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక కమిటీ వేయిస్తానని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఇప్పటి వరకూ ఎందుకు అమలు చేయలేదన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో పోలీసులు పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని చెప్పి, ఎన్నికల్లో గెలిచిన తరువాత ఒక్కరిపై కూడా కేసులు, రౌడీ షీట్లు ఎందుకు రద్దు చేయించలేక పోయారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాగ్దానాలను విస్మరించి ప్రజల్ని మోసగించిన ఎమ్మెల్యేకు సరైన సమయం ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఉద్యమానికి వైఎస్సార్ సీపీ మద్దతునిస్తూ బలభద్రపురం గ్రామ పంచాయతీ ద్వారా ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజాపోరాటాలను చూసి కేపీఆర్ సంస్థలకు బ్యాంకులు కూడా అప్పులు మంజూరు చేయడం మానేశాయన్నారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాభివృద్ధికి, ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా, రాజకీయ పార్టీలకతీతంగా అంకిత భావంతో పనిచేసే వ్యక్తినే సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సూచించారు. పడాల వెంకటరామారెడ్డి మాట్లాడుతూ 20 కేసుల్లో 400 మందిపై పెట్టిన కేసులను తక్షణం ఎత్తివేయాలని, కాలుష్యాన్ని వెదజల్లే ఈ ఫ్యాక్టరీకి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ మార్గంలోనే శాంతియుతంగా చేతులకు నల్లరిబ్బన్లతో సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపామని, 1337 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుకలిగించే కేపీఆర్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమాలకు అండాగా నిలుస్తామని ఏపీ రైతుకూలీ సంఘ రాష్ట్ర కార్యదర్శి కర్నాకుల ఆంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి బాబ్జి, సీపీఐ (ఎంఎల్) జనశక్తి జిల్లా కార్యదర్శి బి.రమేష్ తదితరులు హామీ ఇచ్చారు. వీరంపాలెం ఎంపీటీసీ సభ్యుడు మత్సా వీరభద్రరావు మాట్లాడుతుండగా స్థానిక టీడీపీ నేతలకు, వైఎస్సార్ సీపీ నేతలకు మధ్య వాగ్వివాదం జరిగింది. పార్టీలకతీతంగా జరిగే ఈ ఉద్యమానికి అంతా సహకరించాలని పడాల రాము, గూడుపు సూరిబాబు కోరడంతో వివాదం సద్దుమణిగింది. తొలుత ఉద్యమకారులు బాలవరంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పాదయాత్రగా జి.దొంతమూరు వచ్చి దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్ సీపీ రైతు విభాగం సంయుక్త కార్యదర్శి లంక చంద్రన్న, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వంటిమి సూర్యప్రకాశం, అడబాల వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదిర్శి పేపకాయల రాంబాబు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గుడాల శామ్యూల్, మాజీ సర్పంచ్ దుప్పలపూడి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పి.ఏడుకొండలు, ఆత్మ డైరెక్టర్ పి.వెంకటేశ్వర్లు, జగ్గంపేట మార్కెట్ కమిటీ సభ్యుడు కరుపోతు సత్యనారాయణ, బాలవరం, జి.దొంతమూరు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.