faculty vacancies
-
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేయండి
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్తుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. జిల్లాల వారిగా ఖాళీలు, అర్హతలు, వేతనాలు, ఇతర వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎన్హెచ్ఎం, ఆంధ్రప్రదేశ్‌లో 858 ఖాళీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం.. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) కింద రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల డీఎంహెచ్ఓల ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 858 ► పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌లు–53, మెడికల్ ఆఫీసర్లు–308, స్టాఫ్ నర్సులు–324, ల్యాబ్ టెక్నీషియన్లు–14, పారామెడికల్ స్టాఫ్–90, కన్సల్టెంట్–13, సపోర్ట్ స్టాఫ్–56. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్ఎం/బీఎస్సీ(నర్సింగ్), డీఎంఎల్ /టీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ(సోషల్ వర్క్), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021 ► వెబ్సైట్: visakhapatnam.ap.gov.in డీఎంహెచ్‌వో, కృష్ణా జిల్లాలో 55 మెడికల్ స్టాఫ్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్ ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 55 ► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్‌లు–01, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్‌లు–01, జనరల్ ఫిజీషియన్–01, కార్డియాలజిస్ట్–01, మెడికల్ ఆఫీసర్లు–20, స్టాఫ్ నర్సు–17, ల్యాబ్ టెక్నీషియన్–02, ఫిజియోథెరపిస్ట్/ఆక్యుపే షనల్ థెరపిస్ట్–02, ఆడియోమెట్రీషియన్–03, సోషల్ వర్కర్–02, కన్సల్టెంట్/క్వాలిటీ మానిటర్–01, హాస్పిటల్ అటెండెంట్–02, శానిటరీ అటెండెంట్–02. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్ఎం/బీఎస్సీ(నర్సింగ్), బ్యాచిలర్స్ డిగ్రీ(ఫిజియోథెరపీ), ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ (సోషల్ వర్క్), ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు(సైకియాట్రిస్ట్‌లు, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్‌లు, జనరల్ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్)వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మిగతా పోస్టుల్ని టెక్నికల్ అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ► వాక్ ఇన్ తేదీలు: 2021, సెప్టెంబర్ 02 నుంచి 08 వరకు ► దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021 ► వెబ్సైట్: https://krishna.ap.gov.in డీఎంహెచ్‌వో, ప్రకాశంలో 61 ఖాళీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ప్రకాశం జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో)..నేషనల్ హెల్త్ మిషన్(ఎన్ హెచ్ ఎం) ద్వారా ఒప్పంద/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 61 ► పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్లు–23, స్టాఫ్ నర్సులు–26, సైకియాట్రిక్ నర్స్–01, ఫిజియోథెరపిస్ట్/ఆక్యుపేషనల్ థెరపిస్ట్–02, ఆటోమెట్రీషియన్–02, సోషల్ వర్కర్–02, కన్సల్టెంట్–క్వాలిటీ మానిటర్–01, హాస్పిటల్ అటెండెంట్–02, శానిటరీ అటెండెంట్–02. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్ఎం/బీఎస్సీ(నర్సింగ్), బ్యాచిలర్స్ డిగ్రీ(ఫిజియోథెరపీ), ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ (సోషల్ వర్క్), ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.53,495 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మెడికల్–హెల్త్ ఆఫీస్, ప్రకాశం జిల్లా, ఒంగోలు, జీజీహెచ్, కాంపౌండ్, ఒంగోలు చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021 ► వెబ్సైట్: https://prakasam.ap.gov.in డీఎంహెచ్‌వో, శ్రీకాకుళంలో 71 మెడికల్ స్టాఫ్ కొలువులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ ఎం) ద్వారా ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపది కన మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 71 ► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్–01, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్–01, జనరల్ ఫిజిషియన్–01, ఎన్పీసీడీసీ ౖÐð ద్యాధికారులు–11, ఎన్‌బీఎస్‌యూసీ వైద్యాధికారులు–07, స్టాఫ్ నర్సులు–15, సెకియాట్రిక్ నర్స్–01, జిరియాట్రిక్/పెల్లవేటివ్ కేర్ నర్సులు–03, మెడికల్ కాలేజి ల్యాబ్ టెక్నీషియన్లు–19, ఫ్లోరోసిస్ ల్యాబ్ టెక్నీషియన్లు–01, ఎన్‌పీహెచ్‌సీఈ ఫిజియోథెరపిస్ట్/ఆక్యుపేషనల్ థెరపిస్ట్–02, ఆడియో మెట్రీషియన్–02, ఎన్ఎంహెచ్పీ సోషల్ వర్కర్–01, ఎన్టీసీపీ సోషల్ వర్కర్–01, కన్సల్టెంట్ క్వాలిటీ మానిటర్–01, ఎన్‌పీహెచ్‌సీఈ హాస్పిటల్ అటెండెంట్–02, ఎన్‌పీహెచ్‌సీఈ అటెండెంట్–02. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్ఎం /బీఎస్సీ(నర్సింగ్), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యాశాఖాధికారి కార్యాలయం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021 ► వెబ్సైట్: srikakulam.ap.gov.in ఐఐఎం, విశాఖపట్నంలో ఫ్యాకల్టీ పోస్టులు విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం).. వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. ► విభాగాలు: డెసిషన్ సైన్స్, ఎంట్రప్రెన్యూర్షిప్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఆర్గనైజేషనల్∙బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్, పబ్లిక్ పాలసీ, ఎకనామిక్స్ అండ్ సోషల్ సైన్సెస్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, మార్కెటింగ్, ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, స్ట్రాటజీ తదితరాలు. ► అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పీహెచ్డీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, సెమినార్ ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఐఐఎం విశాఖపట్నం, ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్–530003 చిరునామకు పంపించాలి. ► ఈమెయిల్: facultyrecruit2021sep@iimv.ac.in ► ఈమెయిల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021 ► దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 01.10.2021 ► వెబ్సైట్: www.iimv.ac.in -
స్ట్రెచర్‌పై వైద్యవిద్య
సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులంతా.. సహజంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే ఎంబీబీఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా గాంధీ, ఉస్మానియా, కాకతీయ తదితర ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారు. వీటిలో చోటు దక్కకపోతేనే ప్రైవేటు కాలేజీలవైపు చూస్తారు. అంతటి ప్రతిష్టాత్మక సంస్థలవి. అలాగే పీజీ మెడికల్ విద్య విషయంలోనూ.. ప్రభుత్వ కాలేజీలకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో నాణ్య తపై ఉన్న సందేహాల కారణంగానే.. ప్రభుత్వ వైద్య విద్యే మెరుగన్న భావన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీల్లో మెడికల్ పట్టభద్రులంటే ఓ గౌరవముంటుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వ కాలేజీల్లో వైద్య విద్య నాణ్యత తగ్గిపోతోంది. దీనికి కారణం ఈ కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీవ్రస్థాయిలో ఉండటమే. ఏడాదికేడాది ప్రొఫెసర్ల పదవీ విరమణ జరుగుతున్నప్పటికీ.. దానికి అనుగుణంగా ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిరాసక్తత చూపడంతో.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య నాణ్యతపై నీలినీడలు అలముకున్నాయి. ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్న విమర్శలున్నాయి. దీంతోపాటు బోధనాసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యం చేసేందుకు వైద్యులు కరువయ్యారు. 925 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీ... తెలంగాణలో ప్రస్తుతం ఏడు ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. హైదరాబాద్‌లో ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలు, వరంగల్‌లో కాకతీయ మెడికల్ కాలేజీ ఉంది. ఆదిలాబాద్‌లో రిమ్స్ మెడికల్ కాలేజీ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేటల్లోనూ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. వీటన్నింటినీ కలుపుకుని మొత్తంగా 1,150 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అత్యధికంగా ఉస్మానియాలో 250, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో 200 చొప్పున ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఏడు మెడికల్ కాలేజీల్లో 680 పీజీ మెడికల్ స్పెషాలిటీ సీట్లున్నాయి. వచ్చే ఏడాది నుంచి నల్లగొండ, సూర్యాపేటల్లోనూ మెడికల్ కాలేజీలు ఏర్పాటుకానున్నాయి. ఈ కాలేజీలన్నింటికీ అనుబంధంగా బోధనాసుపత్రులున్నాయి. నిత్యం ఆయా బోధనాసుపత్రులకు వేలాది మంది రోగులు వస్తుంటారు. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ ఆసుపత్రులకైతే జనం పోటెత్తుతారు. కానీ ప్రస్తుతం నడుస్తున్న కాలేజీల్లో అధ్యాపకుల కొరత వేధిస్తుంది. నల్లగొండ, సూర్యాపేట కాలేజీలతో మొదలుకొని మిగిలిన ఏడు కాలేజీల్లో ఉండాల్సిన అధ్యాపకులు, వైద్యుల సంఖ్య 2,359 కాగా, కాంట్రాక్టు పద్దతిని తీసుకున్న వారితో కలుపుకొని కేవలం 1,434 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మొత్తంగా 925 ఖాళీలున్నాయి. ఉదాహరణకు 100 ఎంబీబీఎస్ సీట్లున్న ఆదిలాబాద్ రిమ్స్‌లో ఉండాల్సిన అధ్యాపకుల సంఖ్య 168 మంది కాగా, ప్రస్తుతం అక్కడి స్టాఫ్ 49మంది మాత్రమే. ఇంకా 119 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 100 ఎంబీబీఎస్ సీట్లున్న నిజామాబాద్ మెడికల్ కాలేజీలో 210 మంది అధ్యాపకులు ఉండాలి. కానీ.. 102 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇంకా 108 ఖాళీలున్నాయి. 150 ఎంబీబీఎస్ సీట్లున్న మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో 112 మంది అధ్యాపకులకు గానూ.. కేవలం 53 మంది స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ 59 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే సిద్దిపేట మెడికల్ కాలేజీలో 104 ఖాళీలున్నాయి. ఇలా అన్ని మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ బోధనాసుపత్రుల్లో భారీ స్థాయిలో ఖాళీలుండటంతో రోగులు అల్లాడిపోతున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం ఏవేవో సర్దుబాట్లు చేసి లెక్కలు చూపిస్తుంటారు. ఈ ఏడాది ఎంసీఐ నుంచి ఎలాగోలా గట్టెక్కేందుకు కొంత మందిని కాంట్రాక్టు పద్దతిలో నియమించారు. కానీ ప్రొఫెసర్ల కొరత మాత్రం తీర్చలేకపోయారు. ఈ పరిస్థితి వల్ల దేశంలో 100 ప్రముఖ మెడికల్ కాలేజీల్లో తెలంగాణ నుంచి ఒక్కటి కూడా పోటీలో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏటా 50 మంది విరమణ... ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరతతో రాష్ట్రంలో వైద్యవిద్య నాణ్యత తగ్గుతోంది. పైగా ఆయా బోధనాసుపత్రులకు వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందడంలేదు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ చేస్తుండటం, సకాలంలో పదోన్నతులు చేపట్టకపోవడం, నియామకాలు లేకపోవడం వల్లే అధ్యాపకుల కొరత వేధిస్తుంది. ప్రతీ ఏటా సరాసరి 50 మంది వరకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. గతేడాది 50 మంది విరమణ పొందగా, అందులో 34 మంది మెడికల్ ప్రొఫెసర్లు ఉన్నారు. దీంతో.. ఎంబీబీఎస్, పీజీ సీట్లలో బోధన చేసేవారే లేరు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు రిటైర్ అయితే.. పీజీ సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఎంసీఐ నిబంధనల ప్రకారం ఒక ప్రొఫెసర్‌కు 3 పీజీ మెడికల్ సీట్లు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్‌కు ఒక పీజీ సీటు కేటాయిస్తారు. ఆ ప్రకారం ఫ్యాకల్టీ లేకపోతే ఉన్న సీట్లలో నిస్సందేహంగా కోత విధిస్తారు. ఇలా ఫ్యాకల్టీ తగ్గిపోవడంతో గాంధీ, ఉస్మానియా వంటి మెడికల్ కాలేజీల్లోనూ సీట్లు కోల్పోవాల్సిన దుస్థితి. నాలుగైదేళ్లలో ఇలా పెద్దసంఖ్యలో సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. అయితే.. ప్రభుత్వం కలుగజేసుకొని ఎంసీఐ వద్దకు వెళ్లి ఈ ఖాళీలను భర్తీ చేస్తామని బతిమాలుకుని.. మళ్లీ ఆ సీట్లు తెచ్చుకున్నప్పటికీ నియామకాలు మాత్రం జరపలేదు. ఈ ఏడాది 54 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. దీంతో దాదాపు 100కు పైగా పీజీ మెడికల్ సీట్లపై కత్తి వేలాడుతుండటం గమనార్హం. కీలకమైన 35 రకాల విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు వెళ్లిపోతుండటంతో రాష్ట్రంలో వైద్యవిద్య ప్రమాదంలో పడింది. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంజీఎం వంటి బోధనాసుపత్రుల్లో రోగుల సమస్యలపైనా ఈ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. విరమణ వయస్సు పెంపుపై జాప్యం రాష్ట్రంలో ఉద్యోగ విరమణ వయస్సు 58 ఏళ్లు. దీంతో వైద్య ప్రొఫెసర్లు 58 ఏళ్లు రాగానే.. రిటైర్ అయిపోతున్నారు. వారిని ప్రైవేటు మెడికల్ కాలేజీలు లక్షలకు లక్షలు జీతాలిచ్చి నియమించుకుంటున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రం సీనియర్లను వదిలేసుకొని కాంట్రాక్టు పద్దతిలో జూనియర్లను తీసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. బోధనాసుపత్రుల్లోని అధ్యాపకుల విరమణ వయస్సును 65 ఏళ్లకు పొడిగించాలని గతేడాది రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం కేవలం కాగితాలకే పరిమితమైంది. దీంతో సత్తా ఉన్న వైద్య అధ్యాపకులంతా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారు. ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్‌లో అధ్యాపకుల విరమణ వయస్సు 65ఏళ్లు కలిపి మరో ఐదేళ్లు పొడిగించారు. అంటే 70 ఏళ్ల వరకు కూడా సీనియర్ల సేవలను వినియోగించుకోనున్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం 58 ఏళ్లకే రిటైర్మెంట్ కారణంగా వైద్యవిద్య ప్రమాదంలో పడింది. పైపెచ్చు సకాలంలో పదోన్నతులు లేకపోవడంతో.. ప్రొఫెసర్ కేడర్‌లోకి రాకుండానే విరమణ పొందుతున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ముందు చూపు లేకపోవడంతోనే ఈసమస్య ఉత్పన్నమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన వైద్యులకు మధ్యప్రదేశ్ వల... ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, అధ్యాపకుల వేతనాలు చాలా తక్కువ ఉన్నాయన్న విమర్శలున్నాయి. దీంతో ప్రభుత్వ వైద్య సేవల వైపు డాక్టర్లు ఆసక్తి చూపించడంలేదు. ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ప్రొఫెసర్ వేతనం అన్నీ అలవెన్సులు కలుపుకొని లక్షన్నర రూపాయలుండగా.. కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు అధ్యాపకుని సామర్థ్యం ఆధారంగా రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు వేతనం ఇస్తున్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్‌కు ప్రభుత్వం రూ.లక్ష వరకు ఇస్తే, బయట రూ.2 లక్షలు ఇస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ప్రభుత్వం రూ.80, 90 వేలు ఇస్తే, బయట రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఇస్తున్నారు. ఇదిలావుంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది నాలుగు మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఆయా కాలేజీలకు అవసరమైన ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపక సిబ్బంది కోసం ఇటీవల ఆ రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఒక బృందం తెలంగాణకు వచ్చింది. సీనియర్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, డాక్టర్ల సంఘాలతోనూ సమావేశమైంది. తమ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో పనిచేయడానికి ముందుకు వచ్చే వారికి భారీ వేతనాలు, ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. అలాగే నివసించేందుకు మంచి క్వార్టర్లు ఇస్తామని, భార్యాభర్తల్లో ఎవరైనా అర్హత కలిగినవారు ఉంటే వారికి సరిపోయే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ఒప్పుకుంటే తక్షణమే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. అలా వివిధ రాష్ట్రాలు భారీ ప్రోత్సాహకాలు ఇస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం సీనియర్లను పోగొట్టుకుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
వర్సిటీల్లో రిజర్వేషన్లకు కోత!
న్యూఢిల్లీ: దేశంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకానికి సంబంధించి రిజర్వేషన్ల అమలులో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం యూనివర్శిటీల వారీగా రిజర్వేషన్లు ఉండగా వీటికి బదులు శాఖల్లోని పోస్టులకు అనుగుణంగా రిజర్వేషన్ అమలుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొత్త రిజర్వేషన్ విధానంలో యూనివర్శిటీకి బదులుగా ఒక్కో విభాగాన్ని యూనిట్‌గా పరిగణిస్తారు. దీంతో కేంద్ర విశ్వవిద్యాలయాల్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అధ్యాపకుల సంఖ్య తగ్గుతుంది. ఈ విధానం కోసం యూజీసీ చేసిన ప్రతిపాదనకు కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ ఓకే చెప్పిందని, త్వరలో నోటిఫికేషన్రానుందని సమాచారం. అలహాబాద్ హైకోర్టు తీర్పు మేరకు.. అలహాబాద్ హైకోర్టులో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల నియామకం కేసు విచారణ సందర్భంగా గత ఏప్రిల్‌లో ఈ అంశం తెరపైకి వచ్చింది. మొత్తం యూనివర్శిటీని ప్రాతిపదికగా తీసుకోకుండా.. ఒక్కో విభాగాన్ని యూనిట్‌గా పరిగణిస్తూ రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లతో ముడిపడిన పది కేసుల్లో కోర్టు తీర్పుల్ని అధ్యయనం చేసిన అనంతరం.. అలహాబాద్ కోర్టు తీర్పును అన్ని విశ్వవిద్యాలయాలకు వర్తింపచేయవచ్చని యూజీసీ స్టాండింగ్ కమిటీ నివేదిక సమర్పించింది. ప్రస్తుతం యూనివర్శిటీల వారిగా రిజర్వేషన్ వర్గాలకు అధ్యాపక పోస్టుల్ని నిర్ణయిస్తున్నారు. విశ్వవిద్యాలయంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఒకే గ్రేడ్ పోస్టుల్ని(ఉదా: అసిస్టెంట్ ప్రొఫెసర్) లెక్కించి రిజర్వేషన్ కోటాను అమలు చేస్తున్నారు. కొత్త విధానం ప్రకారం ఒక శాఖలో ఒకే గ్రేడ్‌కు చెందిన మొత్తం పోస్టులకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఆ శాఖలో ఒకే ప్రొఫెసర్ పోస్టుంటే రిజర్వేషన్ అమలుకాదు. అలా కాకుండా యూనివర్సిటీలోని అన్ని శాఖల పోస్టుల్ని కలిపి రిజర్వేషన్లు అమలు చేస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కొన్ని పోస్టులు దక్కుతాయి. రిజర్వేషన్ వర్గాలకు తక్కువ ప్రాతినిధ్యం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల నుంచి ఉన్నత విద్య బోధించే అధ్యాపకుల సంఖ్య ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. 2016 ప్రభుత్వ నివేదిక ప్రకారం...కాలేజీలు, విశ్వవిద్యాలయాలు కలిపి ప్రతి వంద మంది టీచర్లలో ఏడుగురు మాత్రమే అణగారిన వర్గాల వారున్నారు. మొత్తం 716 యూనివర్శిటీలు, 38,056 కాలేజీల్లోని 14.1 లక్షల టీచర్లలో ఎస్సీలు 1.02 లక్షలు(7.22 శాతం), ఎస్టీలు 30 వేల(2.12 శాతం) మంది ఉన్నారు. గత ఏప్రిల్ వరకూ 41 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని 17,106 టీచింగ్ పోస్టుల్లో 5,997 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
అడ్డదారిలో అందలం!
అస్మదీయులకు పోస్టుల పందేరం అధ్యాపక పోస్టుల భర్తీలో నిబంధన ఉల్లంఘన అడ్డదారిలో ముగ్గురు అధ్యాపకుల నియామకం ఏయూలో ఓ ఉన్నతాధికారి తీరు ఇదీ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వడ్డించేవాడు మనవాడైతే ఎలా ఉంటుంది?... ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అడ్డగోలుగా పోస్టుల భర్తీ చందంగా ఉంటుం ది. నిబంధనలకు వక్రభాష్యం చెబుతూ అస్మదీయులకు పోస్టుల పందేరానికి తెరలేచింది. గుట్టుచప్పుడు కాకుండా పోస్టులు కట్టబెట్టేస్తూ నిరుద్యోగుల అవకాశాలకు గండికొడుతున్న తీరు ఇదిగో ఇలా ఉంది. పోస్టుల పందేరం: ఏయూలో చడీచప్పుడు కాకుండా అస్మదీయులకు అధ్యాపక పోస్టులు కట్టబెట్టేస్తున్నారు. ఓ ఉన్నతాధికారి అంతా తానై చక్రం తిప్పుతున్నారు. ఈ నెల 9న ముగ్గురు అధ్యాపకులను నియమించేశారు. అకడమిక్ స్టాఫ్ కాలేజీలో ఒక అసోసియేట్ ప్రొఫెసర్, సోషల్ వర్క్ విభాగంలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, సోషియాలజీ విభాగంలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను నియమించేశారు. నిబంధనలు ఇవీ... యూజీసీ నిబంధనల ప్రకారం అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి పొందాలి. అధ్యాపకుల పోస్టుల అర్హతలపై నోటిఫికేషన్ జారీ చేయాలి. ప్రభుత్వ నామినీతోసహా ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించాలి. దరఖాస్తుల ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి అధ్యాపక పోస్టుల భర్తీకి అభ్యర్థులను ఎంపిక చేయాలి. ఆ ఎంపికకు ఏయూ పాలకమండలి ఆమోదముద్ర వేయాలి. ఇలా నియమిస్తే ఎలా.. ఎన్ఏడీ పాల్ అనే ఆయన్ను కొన్నేళ్ల క్రితం ఎన్ఎస్ఎస్ ట్రైనింగ్ అండ్ ఓరియంటేషన్ సెంటర్(టీవోసీ) కో-ఆర్డినేటర్‌గా కాంట్రాక్టు విధానంలో మూడేళ్ల కాలపరిమితితో నియమించారు. అవసరమైతే మరో ఏడాది పొడిగించుకోవచ్చని కూడా చెప్పారు. నాలుగేళ్లు దాటి మరో రెండేళ్లు గడిచినప్పటికీ ఆయనను అదే పోస్టులో కొనసాగించారు. ఎన్ఎస్ఎస్ ప్రొగ్రామ్ ఆఫీసర్‌గా కూడా బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి దాదాపు రూ.2 కోట్ల నిధుల వ్యయంతో సంబంధం ఉన్న ఈ బాధ్యతను ఏయూలో రెగ్యులర్ అధ్యాపకుడికి అప్పగించాలి. కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఎన్ఏడీ పాల్‌కు కట్టబెట్టారు. ఏకంగా అకడమిక్ స్టాఫ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియమించేశారు. టీవోసీలోనే కాంట్రాక్టు విధానంలో కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా ఉన్న ఎస్.హరనాథ్‌ను సోషల్‌వర్క్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు కట్టబెట్టారు. సార్క్ స్టడీస్ విభాగంలో కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్న వి.శ్రీమన్నారాయణమూర్తిని సోషియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించేశారు. వీసీ ఆదేశాల మేరకు ఈ ముగ్గుర్నీ నియమిస్తున్నట్టు డిప్యూటీ రిజిస్ట్రార్ టి.చిట్టిబాబు ఈ నెల 9న నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వారికి ఇంతవరకు ఇస్తున్న జీతాలు, అలవెన్సుల ప్రాతిపదికనే ఈ కొత్త పోస్టులు ఇచ్చినట్టు అందులో పేర్కొన్నారు. కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఆ ముగ్గుర్ని కొత్త పోస్టుల్లో ‘అబ్జార్బ్’ చేసుకున్నట్టు ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. అంటే ఆ పోస్టులను దాదాపుగా భర్తీ చేసేసినట్లే. భవిష్యత్తులో వాటిని ఖాళీలుగా చూపించే అవకాశం లేదని తెలుస్తోంది. అంటే నిరుద్యోగులకు ఆ పోస్టులు అందకుండా పోతాయన్నమాట. పాలకమండలి ఆమోదముద్ర కోసం యత్నాలు ఏయూ పెద్దలు నిబంధనలకు విరుద్ధంగా చేయాల్సిందంతా చేసేసీ ఇప్పుడు ‘శంఖంలో పోయాలి’అనుకుంటున్నారు. ఈ నెల 22న నిర్వహించనున్న పాలకమండలి సమావేశంలో ఈ పోస్టుల భర్తీని ర్యాటిఫై చేసేసి రాజముద్ర వేయించాలన్నది వారి ఉద్దేశం. మరి పాలకమండలి అయినా నిబంధనలను పాటిస్తూ ఈ పోస్టుల భర్తీని అడ్డుకుంటుందా?...ఈ విషయంపై ఏయూ రిజిస్ట్రార్ కె.రామ్మోహన్‌రావును సంప్రదించగా ప్రస్తుతం కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నవారికి కొత్తగా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కల్పించకుండానే అధ్యాపకులుగా నియమించామన్నారు.