అడ్డదారిలో అందలం!
- అస్మదీయులకు పోస్టుల పందేరం
- అధ్యాపక పోస్టుల భర్తీలో నిబంధన ఉల్లంఘన
- అడ్డదారిలో ముగ్గురు అధ్యాపకుల నియామకం
- ఏయూలో ఓ ఉన్నతాధికారి తీరు ఇదీ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వడ్డించేవాడు మనవాడైతే ఎలా ఉంటుంది?... ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అడ్డగోలుగా పోస్టుల భర్తీ చందంగా ఉంటుం ది. నిబంధనలకు వక్రభాష్యం చెబుతూ అస్మదీయులకు పోస్టుల పందేరానికి తెరలేచింది. గుట్టుచప్పుడు కాకుండా పోస్టులు కట్టబెట్టేస్తూ నిరుద్యోగుల అవకాశాలకు గండికొడుతున్న తీరు ఇదిగో ఇలా ఉంది.
పోస్టుల పందేరం: ఏయూలో చడీచప్పుడు కాకుండా అస్మదీయులకు అధ్యాపక పోస్టులు కట్టబెట్టేస్తున్నారు. ఓ ఉన్నతాధికారి అంతా తానై చక్రం తిప్పుతున్నారు. ఈ నెల 9న ముగ్గురు అధ్యాపకులను నియమించేశారు. అకడమిక్ స్టాఫ్ కాలేజీలో ఒక అసోసియేట్ ప్రొఫెసర్, సోషల్ వర్క్ విభాగంలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, సోషియాలజీ విభాగంలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను నియమించేశారు.
నిబంధనలు ఇవీ...
యూజీసీ నిబంధనల ప్రకారం అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి పొందాలి.
అధ్యాపకుల పోస్టుల అర్హతలపై నోటిఫికేషన్ జారీ చేయాలి.
ప్రభుత్వ నామినీతోసహా ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించాలి.
దరఖాస్తుల ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి అధ్యాపక పోస్టుల భర్తీకి అభ్యర్థులను ఎంపిక చేయాలి. ఆ ఎంపికకు ఏయూ పాలకమండలి ఆమోదముద్ర వేయాలి.
ఇలా నియమిస్తే ఎలా..
ఎన్‌ఏడీ పాల్ అనే ఆయన్ను కొన్నేళ్ల క్రితం ఎన్‌ఎస్‌ఎస్ ట్రైనింగ్ అండ్ ఓరియంటేషన్ సెంటర్(టీవోసీ) కో-ఆర్డినేటర్‌గా కాంట్రాక్టు విధానంలో మూడేళ్ల కాలపరిమితితో నియమించారు. అవసరమైతే మరో ఏడాది పొడిగించుకోవచ్చని కూడా చెప్పారు. నాలుగేళ్లు దాటి మరో రెండేళ్లు గడిచినప్పటికీ ఆయనను అదే పోస్టులో కొనసాగించారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రామ్ ఆఫీసర్‌గా కూడా బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి దాదాపు రూ.2 కోట్ల నిధుల వ్యయంతో సంబంధం ఉన్న ఈ బాధ్యతను ఏయూలో రెగ్యులర్ అధ్యాపకుడికి అప్పగించాలి. కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఎన్‌ఏడీ పాల్‌కు కట్టబెట్టారు. ఏకంగా అకడమిక్ స్టాఫ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియమించేశారు.
టీవోసీలోనే కాంట్రాక్టు విధానంలో కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా ఉన్న ఎస్.హరనాథ్‌ను సోషల్‌వర్క్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు కట్టబెట్టారు.
సార్క్ స్టడీస్ విభాగంలో కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్న వి.శ్రీమన్నారాయణమూర్తిని సోషియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించేశారు.
వీసీ ఆదేశాల మేరకు ఈ ముగ్గుర్నీ నియమిస్తున్నట్టు డిప్యూటీ రిజిస్ట్రార్ టి.చిట్టిబాబు ఈ నెల 9న నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వారికి ఇంతవరకు ఇస్తున్న జీతాలు, అలవెన్సుల ప్రాతిపదికనే ఈ కొత్త పోస్టులు ఇచ్చినట్టు అందులో పేర్కొన్నారు. కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఆ ముగ్గుర్ని కొత్త పోస్టుల్లో ‘అబ్జార్బ్’ చేసుకున్నట్టు ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. అంటే ఆ పోస్టులను దాదాపుగా భర్తీ చేసేసినట్లే. భవిష్యత్తులో వాటిని ఖాళీలుగా చూపించే అవకాశం లేదని తెలుస్తోంది. అంటే నిరుద్యోగులకు ఆ పోస్టులు అందకుండా పోతాయన్నమాట.
పాలకమండలి ఆమోదముద్ర కోసం యత్నాలు
ఏయూ పెద్దలు నిబంధనలకు విరుద్ధంగా చేయాల్సిందంతా చేసేసీ ఇప్పుడు ‘శంఖంలో పోయాలి’అనుకుంటున్నారు. ఈ నెల 22న నిర్వహించనున్న పాలకమండలి సమావేశంలో ఈ పోస్టుల భర్తీని ర్యాటిఫై చేసేసి రాజముద్ర వేయించాలన్నది వారి ఉద్దేశం. మరి పాలకమండలి అయినా నిబంధనలను పాటిస్తూ ఈ పోస్టుల భర్తీని అడ్డుకుంటుందా?...ఈ విషయంపై ఏయూ రిజిస్ట్రార్ కె.రామ్మోహన్‌రావును సంప్రదించగా ప్రస్తుతం కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నవారికి కొత్తగా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కల్పించకుండానే అధ్యాపకులుగా నియమించామన్నారు.