న్యూఢిల్లీ: దేశంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకానికి సంబంధించి రిజర్వేషన్ల అమలులో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం యూనివర్శిటీల వారీగా రిజర్వేషన్లు ఉండగా వీటికి బదులు శాఖల్లోని పోస్టులకు అనుగుణంగా రిజర్వేషన్ అమలుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొత్త రిజర్వేషన్ విధానంలో యూనివర్శిటీకి బదులుగా ఒక్కో విభాగాన్ని యూనిట్‌గా పరిగణిస్తారు. దీంతో కేంద్ర విశ్వవిద్యాలయాల్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అధ్యాపకుల సంఖ్య తగ్గుతుంది. ఈ విధానం కోసం యూజీసీ చేసిన ప్రతిపాదనకు కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ ఓకే చెప్పిందని, త్వరలో నోటిఫికేషన్‌రానుందని సమాచారం.
అలహాబాద్ హైకోర్టు తీర్పు మేరకు..
అలహాబాద్ హైకోర్టులో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల నియామకం కేసు విచారణ సందర్భంగా గత ఏప్రిల్‌లో ఈ అంశం తెరపైకి వచ్చింది. మొత్తం యూనివర్శిటీని ప్రాతిపదికగా తీసుకోకుండా.. ఒక్కో విభాగాన్ని యూనిట్‌గా పరిగణిస్తూ రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లతో ముడిపడిన పది కేసుల్లో కోర్టు తీర్పుల్ని అధ్యయనం చేసిన అనంతరం.. అలహాబాద్ కోర్టు తీర్పును అన్ని విశ్వవిద్యాలయాలకు వర్తింపచేయవచ్చని యూజీసీ స్టాండింగ్ కమిటీ నివేదిక సమర్పించింది.
ప్రస్తుతం యూనివర్శిటీల వారిగా రిజర్వేషన్ వర్గాలకు అధ్యాపక పోస్టుల్ని నిర్ణయిస్తున్నారు. విశ్వవిద్యాలయంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఒకే గ్రేడ్ పోస్టుల్ని(ఉదా: అసిస్టెంట్ ప్రొఫెసర్) లెక్కించి రిజర్వేషన్ కోటాను అమలు చేస్తున్నారు. కొత్త విధానం ప్రకారం ఒక శాఖలో ఒకే గ్రేడ్‌కు చెందిన మొత్తం పోస్టులకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఆ శాఖలో ఒకే ప్రొఫెసర్ పోస్టుంటే రిజర్వేషన్ అమలుకాదు. అలా కాకుండా యూనివర్సిటీలోని అన్ని శాఖల పోస్టుల్ని కలిపి రిజర్వేషన్లు అమలు చేస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కొన్ని పోస్టులు దక్కుతాయి.
రిజర్వేషన్ వర్గాలకు తక్కువ ప్రాతినిధ్యం
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల నుంచి ఉన్నత విద్య బోధించే అధ్యాపకుల సంఖ్య ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. 2016 ప్రభుత్వ నివేదిక ప్రకారం...కాలేజీలు, విశ్వవిద్యాలయాలు కలిపి ప్రతి వంద మంది టీచర్లలో ఏడుగురు మాత్రమే అణగారిన వర్గాల వారున్నారు. మొత్తం 716 యూనివర్శిటీలు, 38,056 కాలేజీల్లోని 14.1 లక్షల టీచర్లలో ఎస్సీలు 1.02 లక్షలు(7.22 శాతం), ఎస్టీలు 30 వేల(2.12 శాతం) మంది ఉన్నారు. గత ఏప్రిల్ వరకూ 41 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని 17,106 టీచింగ్ పోస్టుల్లో 5,997 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment