Faculty posts Reservation
-
అధ్యాపక రిజర్వేషన్లలో పాత పద్ధతి
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపక నియామకాల్లో 200–పాయింట్ రోస్టర్ ఆధారిత రిజర్వేషన్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టడం కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ప్రతిపాదనను కేంద్రకేబినెట్ ఆమోదించింది. ఈ విషయంలో 2017లో అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు∙తీర్పుల నుంచి మినహాయింపు పొంది, రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయుల నియామకాల్లో ఒక్కో విభాగాన్ని లేదా ఒక్కో సబ్జెక్ట్‌ను ఒక యూనిట్‌గా పరిగణించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గతేడాది మార్చిలో స్పష్టం చేసింది. 2017 ఏప్రిల్‌లో అలహాబాద్ హైకోర్టు తీర్పును అనుసరించి యూజీసీ ఈ ఆదేశాలిచ్చింది. విశ్వవిద్యాలయం మొత్తాన్ని కాకుండా అందులోని ఒక్కో విభాగాన్ని ఒక్కో యూనిట్‌గా పరిగణించడం వల్ల ఒకటి లేదా రెండు ఉద్యోగ ఖాళీలే ఉన్న చోట రిజర్వేషన్ వర్తించేది కాదు. ఆ ఉద్యోగాలను జనరల్ కేటగిరీ కింద భర్తీ చేయాల్సి వచ్చేది. అదే విశ్వవిద్యాలయం మొత్తాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తే, అన్ని విభాగాల్లో కలిపి ఖాళీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కుతాయి. దీంతో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవరించాలనీ, యూజీసీ ఆదేశాలను రద్దు చేయాలంటూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే కేంద్రం పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత నెలలో కొట్టేసింది. దీంతో 200–పాయింట్ రోస్టర్ ఆధారిత పాత రిజర్వేషన్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టడం కోసం కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొస్తుందని హెచ్ఆర్డీ మంత్రి ప్రకాశ్ జవడేకర్ గత నెలలో లోక్‌సభలో ప్రకటించారు. అధ్యాపక నియామకాలు ప్రారంభించండి కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో అధ్యాపక నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) దేశంలోని విశ్వవిద్యాలయాలను కోరింది. ఈ మేరకు యూజీసీ వర్సిటీ వైస్ చాన్స్లర్లకు సూచించింది. -
వర్సిటీల్లో రిజర్వేషన్లకు కోత!
న్యూఢిల్లీ: దేశంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకానికి సంబంధించి రిజర్వేషన్ల అమలులో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం యూనివర్శిటీల వారీగా రిజర్వేషన్లు ఉండగా వీటికి బదులు శాఖల్లోని పోస్టులకు అనుగుణంగా రిజర్వేషన్ అమలుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొత్త రిజర్వేషన్ విధానంలో యూనివర్శిటీకి బదులుగా ఒక్కో విభాగాన్ని యూనిట్‌గా పరిగణిస్తారు. దీంతో కేంద్ర విశ్వవిద్యాలయాల్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అధ్యాపకుల సంఖ్య తగ్గుతుంది. ఈ విధానం కోసం యూజీసీ చేసిన ప్రతిపాదనకు కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ ఓకే చెప్పిందని, త్వరలో నోటిఫికేషన్రానుందని సమాచారం. అలహాబాద్ హైకోర్టు తీర్పు మేరకు.. అలహాబాద్ హైకోర్టులో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల నియామకం కేసు విచారణ సందర్భంగా గత ఏప్రిల్‌లో ఈ అంశం తెరపైకి వచ్చింది. మొత్తం యూనివర్శిటీని ప్రాతిపదికగా తీసుకోకుండా.. ఒక్కో విభాగాన్ని యూనిట్‌గా పరిగణిస్తూ రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లతో ముడిపడిన పది కేసుల్లో కోర్టు తీర్పుల్ని అధ్యయనం చేసిన అనంతరం.. అలహాబాద్ కోర్టు తీర్పును అన్ని విశ్వవిద్యాలయాలకు వర్తింపచేయవచ్చని యూజీసీ స్టాండింగ్ కమిటీ నివేదిక సమర్పించింది. ప్రస్తుతం యూనివర్శిటీల వారిగా రిజర్వేషన్ వర్గాలకు అధ్యాపక పోస్టుల్ని నిర్ణయిస్తున్నారు. విశ్వవిద్యాలయంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఒకే గ్రేడ్ పోస్టుల్ని(ఉదా: అసిస్టెంట్ ప్రొఫెసర్) లెక్కించి రిజర్వేషన్ కోటాను అమలు చేస్తున్నారు. కొత్త విధానం ప్రకారం ఒక శాఖలో ఒకే గ్రేడ్‌కు చెందిన మొత్తం పోస్టులకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఆ శాఖలో ఒకే ప్రొఫెసర్ పోస్టుంటే రిజర్వేషన్ అమలుకాదు. అలా కాకుండా యూనివర్సిటీలోని అన్ని శాఖల పోస్టుల్ని కలిపి రిజర్వేషన్లు అమలు చేస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కొన్ని పోస్టులు దక్కుతాయి. రిజర్వేషన్ వర్గాలకు తక్కువ ప్రాతినిధ్యం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల నుంచి ఉన్నత విద్య బోధించే అధ్యాపకుల సంఖ్య ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. 2016 ప్రభుత్వ నివేదిక ప్రకారం...కాలేజీలు, విశ్వవిద్యాలయాలు కలిపి ప్రతి వంద మంది టీచర్లలో ఏడుగురు మాత్రమే అణగారిన వర్గాల వారున్నారు. మొత్తం 716 యూనివర్శిటీలు, 38,056 కాలేజీల్లోని 14.1 లక్షల టీచర్లలో ఎస్సీలు 1.02 లక్షలు(7.22 శాతం), ఎస్టీలు 30 వేల(2.12 శాతం) మంది ఉన్నారు. గత ఏప్రిల్ వరకూ 41 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని 17,106 టీచింగ్ పోస్టుల్లో 5,997 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
అధ్యాపక పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
ఏఎన్‌యూ (గుంటూరు) : ఏఎన్‌యూ కళాశాలలు, ఒంగోలు పీజీ సెంటర్లో మంజూరైన శాశ్వత అధ్యాపక పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఏఎన్‌యూ కళాశాలల్లోని కాంట్రాక్ట్, బ్యాక్లాగ్ రెగ్యులర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్న ఏఎన్‌యూ ఉన్నతాధికారులు.. ఇక రెగ్యులర్ పోస్టుల భర్తీపై దృష్టి సారించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఏఎన్‌యూ నియమించిన రోస్టర్ కమిటీ ఆయా పోస్టులకు రూపొందించిన రోస్టర్(రిజర్వేషన్)కు గుంటూరు సాంఘిక సంక్షేమ శాఖ ఆమోదం తెలిపింది. ఈ జాబితాకు కొద్ది రోజుల్లో జరుగనున్న ఏఎన్‌యూ పాలకమండలి సమావేశంలో ఆమోదం లభించిన అనంతరం మొత్తం 88 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ప్రక్రియ సకాలంలో జరిగితే ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఏఎన్‌యూ కళాశాలలు, ఒంగోలు పీజీ సెంటర్లో రెగ్యులర్ అధ్యాపక పోస్టుల నియామక ప్రక్రియ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంది. ఏఎన్‌యూ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలు, ఒంగోలు పీజీ సెంటర్, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల, యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో మొత్తం 20 పోస్టుల భర్తీకి ప్రభుత్వం 2011లో అనుమతినిచ్చింది. కానీ వర్సిటీ అప్పట్లో ఈ పోస్టులను భర్తీ చేయలేదు. గత ఏడాది ఏఎన్‌యూ ఆర్ట్స్, కామర్స్ అండ్ లా, సైన్స్ కళాశాలల్లో 7 ప్రొఫెసర్, 23 అసోసియేట్ ప్రొఫెసర్, 38 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో పాటు మరికొన్ని బ్యాక్లాగ్ అధ్యాపక పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. గతేడాది డిసెంబర్ మూడో తేదీన జరిగిన వర్సిటీ పాలకమండలి సమావేశంలో మొత్తం 88 శాశ్వత రెగ్యులర్ అధ్యాపకపోస్టుల భర్తీకి అనుమతి లభించింది. వెంటనే భర్తీకి సంబంధించిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో ఉన్నతాధికారులు ప్రకటించారు కానీ చాలా కాలంగా ఆ ప్రక్రియ పెండింగ్‌లోనే ఉంది. రెగ్యులర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేయనుండటంతో ఆశావాహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.