ఏఎన్‌యూ (గుంటూరు) : ఏఎన్‌యూ కళాశాలలు, ఒంగోలు పీజీ సెంటర్‌లో మంజూరైన శాశ్వత అధ్యాపక పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఏఎన్‌యూ కళాశాలల్లోని కాంట్రాక్ట్, బ్యాక్‌లాగ్ రెగ్యులర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్న ఏఎన్‌యూ ఉన్నతాధికారులు.. ఇక రెగ్యులర్ పోస్టుల భర్తీపై దృష్టి సారించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఏఎన్‌యూ నియమించిన రోస్టర్ కమిటీ ఆయా పోస్టులకు రూపొందించిన రోస్టర్(రిజర్వేషన్)కు గుంటూరు సాంఘిక సంక్షేమ శాఖ ఆమోదం తెలిపింది.
ఈ జాబితాకు కొద్ది రోజుల్లో జరుగనున్న ఏఎన్‌యూ పాలకమండలి సమావేశంలో ఆమోదం లభించిన అనంతరం మొత్తం 88 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ప్రక్రియ సకాలంలో జరిగితే ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఏఎన్‌యూ కళాశాలలు, ఒంగోలు పీజీ సెంటర్లో రెగ్యులర్ అధ్యాపక పోస్టుల నియామక ప్రక్రియ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంది.
ఏఎన్‌యూ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలు, ఒంగోలు పీజీ సెంటర్, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల, యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో మొత్తం 20 పోస్టుల భర్తీకి ప్రభుత్వం 2011లో అనుమతినిచ్చింది. కానీ వర్సిటీ అప్పట్లో ఈ పోస్టులను భర్తీ చేయలేదు. గత ఏడాది ఏఎన్‌యూ ఆర్ట్స్, కామర్స్ అండ్ లా, సైన్స్ కళాశాలల్లో 7 ప్రొఫెసర్, 23 అసోసియేట్ ప్రొఫెసర్, 38 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో పాటు మరికొన్ని బ్యాక్‌లాగ్ అధ్యాపక పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది.
గతేడాది డిసెంబర్ మూడో తేదీన జరిగిన వర్సిటీ పాలకమండలి సమావేశంలో మొత్తం 88 శాశ్వత రెగ్యులర్ అధ్యాపకపోస్టుల భర్తీకి అనుమతి లభించింది. వెంటనే భర్తీకి సంబంధించిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో ఉన్నతాధికారులు ప్రకటించారు కానీ చాలా కాలంగా ఆ ప్రక్రియ పెండింగ్‌లోనే ఉంది. రెగ్యులర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేయనుండటంతో ఆశావాహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
అధ్యాపక పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
Published Mon, Sep 8 2014 2:07 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement