1984 అల్లర్లలో పోలీసుల వైఫల్యం
నాటి సిక్కుల ఊచకోతపై కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను నియంత్రించడంలో ఢిల్లీ పోలీసులు బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారని కోబ్రా పోస్ట్ వెబ్సైట్ ఆరోపించింది. నాటి ఢిల్లీ పోలీసుల భూమికపై కోబ్రాపోస్ట్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో వెల్లడైన అంశాలను మంగళవారం మీడియాకు వెల్లడించింది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో సుమారు 3 వేల మందికిపైగా ఊచకోత జరిగింది.
అల్లర్లను అడ్డుకోవడంలో ఢిల్లీ పోలీసు బలగాలు పూర్తిగా విఫలం అయ్యాయని, ఉన్నతాధికారులు అప్పటి ప్రభుత్వంతో మిలాఖతై సిక్కులకు గుణపాఠం నేర్పాలనుకున్నారని స్టింగ్ ఆపరేషన్లో గుట్టురట్టైందని కోబ్రాపోస్ట్ వెల్లడించింది. ‘ఇందిరాగాంధీ జిందాబాద్ నినాదాలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని పోలీసులకు ఉన్నతాధికారులు సందేశాన్ని పంపారు. అల్లర్లకు పాల్పడిన వారిపై కాల్పులు చేయాలనే ఆదేశాలను సీనియర్ పోలీసులు అధికారులు తమ పరిధిలోని అధికారులకు ఇవ్వలేదు’ అన్న విషయం ఆపరేషన్లో వెలుగుచూసింది.