నకిలీ రూ.2 వేల నోట్ల పట్టివేత
♦ నగరంలో మార్పిడికి యత్నం.. ముగ్గురి అరెస్టు
♦ రూ.1.9 లక్షల విలువైన నోట్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: నగరంలో నకిలీ రూ.2 వేల నోట్లను మార్పిడికి యత్నించిన ముగ్గురిని మధ్య మండలం టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.9 లక్షల విలువైన రూ.2వేల నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ బి.లింబారెడ్డి శుక్రవా రం వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులోని మాల్దా నుంచి ఈ నోట్లు వచ్చినట్టు తెలిపారు.
గతంలో మాల్దా నుంచి నకిలీ నోట్లు తెచ్చి నగరంలో చలామణి చేస్తూ యాకత్‌పురకు చెందిన మహ్మద్ గౌస్ గతంలో పోలీసులకు చిక్కా డు. ఇతడు జైల్లో ఉండగా నకిలీ నోట్ల కేసులోనే అరెస్టయి జైల్లో ఉన్న మాల్దా వాసి ఖయాముల్ హక్, చైన్ స్నాచింగ్ కేసుల్లో జైలుకు వెళ్లిన షేక్ అర్షద్ అలీలతో పరిచయమైంది. జైలు నుంచి విడుదలైన అనంతరం వీరు కొత్త కరెన్సీ నకిలీ నోట్లు చలామణి చేయాలని నిర్ణయించుకున్నారు.
నగరంలో మార్పిడి చేయడానికి రూ.2 లక్షల నకిలీ రూ.2 వేల నోట్లు కావాలని మాల్దాలో ఉన్న హక్‌ను గౌస్ కోరాడు. ఇక్కడ నిఘా ఎక్కువగా ఉండటంతో నాగ్‌పూర్‌లో వీటిని తీసుకోవాలని హక్ సూచించాడు. దీంతో గౌస్ అర్షద్ అలీని మంగళవారం అక్కడకు పంపా డు. నాగ్‌పూర్‌లో డబ్బు తీసుకున్న అర్షద్... హక్ అనుచరుడు అబ్దుల్ రజాక్‌తో కలసి నగరానికి వచ్చాడు. వీరికి అర్షద్ సోదరుడు ఆరిఫ్ అలీ సైతం జట్టు కట్టాడు. ఈ ముగ్గు రూ శుక్రవారం ఎల్బీనగర్లో రూ.10 వేల విలువైన ఐదు నకిలీ నోట్లకు గౌస్‌కు అందించారు. మిగిలిన రూ.1.9 లక్షల నోట్లను తీసుకుని సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చారు.
గౌస్, హక్‌ల కోసం గాలింపు...
దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ద్వారా సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాసరావు నేతృత్వంలో ని బృందం దాడి చేసింది. నిందితులైన అర్షద్, రజాక్, ఆరిఫ్‌లను అరెస్టు చేసింది. పరారీలో ఉన్న గౌస్, హక్ కోసం గాలిస్తోం ది. ఇవి గతంలో మాదిరి పాకిస్థాన్‌లోని పవ ర్ ప్రెస్‌ల్లో ముద్రితమై బంగ్లాదేశ్ మీదుగా మాల్దాకు వస్తున్నట్లు అనుమానిస్తున్నారు.