గొలుసును పోగొట్టుకుని..చైన్ స్నాచింగ్ అంటూ ఫిర్యాదు
తన గొలుసును ఎక్కడో పోగొట్టుకున్న ఓ మహిళ.. కుటుంబసభ్యులకు చెప్పేందుకు భయపడి... చైన్‌స్నాచింగ్ జరిగిందంటూ నాటకమాడింది. చివరికి పోలీసుల దర్యాప్తులో దొరికిపోయింది. సరూర్‌నగర్ సీఐలు లింగ య్య, సునీల్ తెలిపిన వివరాలివీ... తమ ఇంటి సమీపంలోని దుకాణానికి నడిచి వెళుతుండగా వెనక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తన మెడలోని మూడు తులాల బంగారు గొలుసు తెంచుకు పోయారని మాతాలక్ష్మీనగర్ కాలనీలోని సాయి ఎన్క్లేవ్ అపార్టుమెంటులో నివసించే గెంటి వనజాక్షి(43) బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసిన సీఐ సునీల్, సీఐ శ్రీనివాసులు కేసు విచారణలో భాగంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫిర్యాదు చేసిన మహిళ వనజాక్షిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె ఉండే అపార్టుమెంట్లో ఉన్న సీసీ ఫుటేజి పరిశీలించగా చైన్‌స్నాచింగ్ సమయంలో కానీ, అంతకు ముందు కానీ వనజాక్షి బయటకు వెళ్లలేదని గుర్తించారు. దీంతో ఆమెను గట్టిగా ప్రశ్నించగా చైన్ స్నాచింగ్ జరగలేదని స్పష్టం చేసింది. కొన్ని రోజుల క్రితం గొలుసు ఎక్కడో పడిపోయిందని కుటుంబ సభ్యులు ఏమైనా అంటారేమోనని అబద్ధం చెప్పినట్లు ఒప్పుకుంది. ఇంటి పక్కన నివసించే ఓ వ్యక్తి స్నాచింగ్ జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎలాగోలా గొలుసు రికవరీ చేసి ఇస్తారని చెప్పటంతో ఈ పని చేసినట్టు చెప్పింది.
తప్పుడు పిర్యాదు చేస్తే చర్యలు...
ఎవరైనా ఇలాంటి తప్పుడు పిర్యాదుచేస్తే వారిపైనే కేసులు నమోదు చేస్తామని సీఐలు లింగయ్య, సునీల్ స్పష్టం చేశారు. తప్పుడు ఫిర్యాదుల కారణంగా వాస్తవంగా నష్టపోయిన వారికి అన్యాయం జరిగే ప్రమాదముందని తెలిపారు.