fake passbook
-
నకిలీ పాస్‌పుస్తకాలతో పీఏసీఎస్‌లో రుణాలు
ఓ రైతుకు రుణం రెన్యూవల్ చేయకపోవడంతో వెలుగులోకి 12 మంది రుణాలు పొందినట్లు వెల్లడించిన సదరు రైతు చెన్నారావుపేట : నకిలీ పాస్‌పుస్తకంతో పీఏసీఎస్‌లో రు ణం పొందిన ఓ రైతుకు రుణాన్ని ఈసారి రెన్యూవల్ చేయకపోవడంతో ఆగ్రహం చెందాడు. తనలాగే మరికొందరు రైతులకు నకిలీ పాస్‌పుస్తకాలపై రుణాలు ఇచ్చి, ఈసారి రెన్యూవల్ చేశారని తనకెందుకు చేయరని సంబంధిత అధికారులను నిలదీశాడు. దీంతో సదరు రైతును మిగతా ‘నకిలీ’ రైతులు చితకబాదారు. ఈ సంఘటన మండల కేంద్రంలోని సహకార సంఘంలో సోమవారం జరిగింది. బాధిత రైతు ఈర్యా కథనం ప్రకారం.. గూడురు మండ లం గుండెంగ గ్రామానికి చెందిన లావుడ్య ఈర్యా, బోడ భాస్కర్, రవి, రాజుతో సహా 12 మంది గత సంవత్సరం నకిలీ పట్టా పాస్ పుస్తకాలపై చెన్నారావుపేట సహకార సంఘంలో అక్రమంగా రుణాలు పొందారు. ఈ సంవత్స రం కూడా నకిలీ పాస్‌పుస్తకాలపై ఖరీఫ్ రుణాలు రెన్యూవల్ చేసి బోడ భాస్కర్, రవి, రాజుతోపాటు మరికొందరికి రుణాలు ఇచ్చారు. కానీ తన వద్ద రూ.35 వేలు తీసుకున్నప్పటికీ రుణం ఎందుకు రెన్యూవల్ చేయడం లేదని లావుడ్యా ఈర్య సొసైటీ కార్యాలయానికి వచ్చి సీఈఓ రవి, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీను, డైరెక్టర్ కామగోని శ్రీనుతో గొడవపడ్డాడు. మిగతా వారికి రుణాలను రెన్యూవల్ చేసి మళ్లీ ఇచ్చారని.. తనకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన భాస్కర్, రవి, రాజు నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు తీసుకున్నామని తమ పేర్లు ఎందుకు చెబుతున్నావంటూ కొట్టారని ఈర్య ఆవేదనతో చెప్పాడు. వారి దాడిలో ఈర్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. ఆరోపణలు అవాస్తవం నకిలీ పాస్ పుస్తకాలపై ఈ ఏడాది ఖరీఫ్ పంట రుణాలు ఇచ్చామనే ఆరోపణలు అవాస్తవం. గతంలో గుండెంగకు చెందిన 12 మంది రైతులు నకిలీ పాసుపుస్తకాలతో పంట రుణాల కోసం సంప్రదించారు. నకిలీ పాసు పుస్తకాలను గూడూరు తహసీల్దార్‌కు అప్పగించాం. వీటిపై గతేడాది పీఏసీఎస్‌లో తీసుకున్న పంట రుణాలను తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. – రాదారపు సాంబరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, చెన్నారావుపేట -
నకిలీ పాస్ పుస్తకాల ముఠా గుట్టురట్టు
అనంతపురం : అనంతపురం జిల్లా కదిరి కేంద్రంగా నకిలీ పాస్ పుస్తకాల తయారు చేస్తున్న ముఠా గుట్టును అనంతపురం పోలీసులు శనివారం రట్టు చేశారు. అందుకు సంబంధించిన 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 247 నకిలీ పాస్ పుస్తకాలు, రెండు కంప్యూటర్లు, 148 స్టాంప్లతోపాటు 25 రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు సమక్షంలో ముఠా సభ్యులను విలేకర్ల సమావేశంలో పోలీసులు నిలబెట్టారు. -
నకిలీ.. మకిలీ
మిర్యాలగూడ : నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలకు మిర్యాలగూడ పట్టణం అడ్డాగా మారింది. పట్టణం సమీపంలోని దామరచర్ల, త్రిపురారం మండలాలకు చెందిన కొంతమంది గ్రూపుగా ఏర్పడి ఈ దందా సాగిస్తున్నారు. అసలు భూమి లేకున్నా 10 వేల రూపాయలు ఇస్తే పట్టాదారు పాస్‌పుస్తకం అందజేస్తున్నారు. అచ్చం ఒరిజినల్ పుస్తకం మాదిరిగా ఉండడం వల్ల మిర్యాలగూడలోని బ్యాంకులలో పంట రుణాలు పొందుతున్నారు. ఈ తతంగం ఎన్నో సంవత్సరాలుగా సాగుతోంది. పోలీసులు, రెవెన్యూ అధికారుల విచారణలో గుట్టు బయటపడినా, పోలీసులు వారిని అరెస్టులు చేసినా ఈ నకిలీ పాస్‌పుస్తకాల జారీ ప్రక్రియ మాత్రం ఆగడం లేదు. మిర్యాలగూడలో ఈ నెల9వ తేదీన నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల ముఠాను పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్న వ్యక్తితో లింకు పెట్టుకున్న నకిలీ ముఠా సభ్యులు యథేచ్ఛగా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారు. మిర్యాలగూడలో ఇల్లు అద్దెకు తీసుకొని నకిలీ పుస్తకాల వ్యవహారాన్ని నిర్వహిస్తున్నారు. ముఠాలో ఎంతమంది సభ్యులు ఉన్నారనే విషయంతోపాటు ఎవరెవరికి పాస్ పుస్తకాలు జారీ చేశారనే విషయంపై పోలీసులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం. గతంలో వెలుగు చూసిన అక్రమాలు మిర్యాలగూడ పట్టణంలోని ఎస్బీహెచ్ ఏడీబీలో దామరచర్ల, త్రిపురారం మండలాలకు చెందిన 26 మంది రైతులు నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో 18 లక్షల రూపాయల రుణాలు పొందారు. బ్యాంకు అధికారుల విచారణలో పాస్ పుస్తకాలు నకిలీవని తేలడంతో 2012 సెప్టెంబర్‌లో వారిని పోలీసులు అరెస్టు చేశారు. వేములపల్లి మండల కేంద్రంలోని ఎస్బీహెచ్లో దామరచర్ల, త్రిపురారం, పెద్దవూర మండలాలకు చెందిన 29 మంది రైతులు నకిలీ పాస్ పుస్తకాలతో 2008లో 7.10 లక్షల రూపాయలు రుణాలు పొందారు. బ్యాంకు అధికారుల విచారణతో పాస్ పుస్తకాలు నకిలీవని తేలడంతో 2012 జూన్ మాసంలో వారిని వేములపల్లి పోలీసులు అరెస్టు చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని ఎస్బీహెచ్ ఏడీబీలో దామరచర్ల మండలంలోని కల్లెపల్లి గ్రామానికి చెందిన 19 మంది రైతులు నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు పొందగా బ్యాంకు అధికారులు విచారించారు. అధికారులు నకిలీ పాస్‌పుస్తకాలుగా గుర్తించి 2011లో వారిని అరెస్టు చేశారు. దామరచర్ల మండలంలోని కేశవపురానికి చెందిన 32 మంది, దిలావర్పూర్కు చెందిన 16 మంది మిర్యాలగూడ ఎస్బీహెచ్ ఏడీబీలో నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు పొందారని 2010లో అధికారులు గుర్తించారు. కాగా విచారణ సాగుతోంది. దామరచర్ల మండలం వీర్లపాలెంలో 2012లో రెండు ఇళ్లలో రెవెన్యూ అధికారులు సోదాలు చేయగా 32 నకిలీ పాస్‌పుస్తకాలు లభించగా ఒకరిని అరెస్టు చేశారు. ఫోర్జరీ సంతకాలతో జారీ.. నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేస్తున్న ముఠా రెవెన్యూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తోంది. ఆర్డీఓ, తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్ఓ సంతకాలు ఫోర్జరీ చేస్తున్నారు. సంతకాలతోపాటు ముద్రలు కూడా నకిలీవి తయారు చేస్తున్నారు. దామరచర్ల, త్రిపురారం, పెద్దవూర మండలాల్లో ఎక్కువగా అటవీ భూములు ఉండడం వల్ల సర్వేనంబర్లకు బై నంబర్లు వేసి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నారు. గతంలో ఒక్క దామరచర్ల మండలంలోని వంద ఎకరాల భూమికి నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలతో జారీ చేసినట్లు సమాచారం. ఈ పుస్తకాలతో వివిధ బ్యాంకులలో కోట్ల రూపాయల రుణాలు పొందారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రుణమాఫీ వల్ల నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా పొందిన రుణాలు కూడా మాఫీ అయ్యాయి. అదే విధంగా ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేస్తుండటం వల్ల ఇప్పుడు కూడా వివిధ బ్యాంకులలో నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు పొందిన వారివి మాఫీ కానున్నాయి.