నకిలీ పాస్‌పుస్తకాలతో పీఏసీఎస్‌లో రుణాలు
-
ఓ రైతుకు రుణం రెన్యూవల్ చేయకపోవడంతో వెలుగులోకి
-
12 మంది రుణాలు పొందినట్లు వెల్లడించిన సదరు రైతు
చెన్నారావుపేట : నకిలీ పాస్‌పుస్తకంతో పీఏసీఎస్‌లో రు ణం పొందిన ఓ రైతుకు రుణాన్ని ఈసారి రెన్యూవల్ చేయకపోవడంతో ఆగ్రహం చెందాడు. తనలాగే మరికొందరు రైతులకు నకిలీ పాస్‌పుస్తకాలపై రుణాలు ఇచ్చి, ఈసారి రెన్యూవల్ చేశారని తనకెందుకు చేయరని సంబంధిత అధికారులను నిలదీశాడు. దీంతో సదరు రైతును మిగతా ‘నకిలీ’ రైతులు చితకబాదారు. ఈ సంఘటన మండల కేంద్రంలోని సహకార సంఘంలో సోమవారం జరిగింది. బాధిత రైతు ఈర్యా కథనం ప్రకారం.. గూడురు మండ లం గుండెంగ గ్రామానికి చెందిన లావుడ్య ఈర్యా, బోడ భాస్కర్, రవి, రాజుతో సహా 12 మంది గత సంవత్సరం నకిలీ పట్టా పాస్ పుస్తకాలపై చెన్నారావుపేట సహకార సంఘంలో అక్రమంగా రుణాలు పొందారు. ఈ సంవత్స రం కూడా నకిలీ పాస్‌పుస్తకాలపై ఖరీఫ్ రుణాలు రెన్యూవల్ చేసి బోడ భాస్కర్, రవి, రాజుతోపాటు మరికొందరికి రుణాలు ఇచ్చారు. కానీ తన వద్ద రూ.35 వేలు తీసుకున్నప్పటికీ రుణం ఎందుకు రెన్యూవల్ చేయడం లేదని లావుడ్యా ఈర్య సొసైటీ కార్యాలయానికి వచ్చి సీఈఓ రవి, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీను, డైరెక్టర్ కామగోని శ్రీనుతో గొడవపడ్డాడు. మిగతా వారికి రుణాలను రెన్యూవల్ చేసి మళ్లీ ఇచ్చారని.. తనకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన భాస్కర్, రవి, రాజు నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు తీసుకున్నామని తమ పేర్లు ఎందుకు చెబుతున్నావంటూ కొట్టారని ఈర్య ఆవేదనతో చెప్పాడు. వారి దాడిలో ఈర్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.
ఆరోపణలు అవాస్తవం
నకిలీ పాస్ పుస్తకాలపై ఈ ఏడాది ఖరీఫ్ పంట రుణాలు ఇచ్చామనే ఆరోపణలు అవాస్తవం. గతంలో గుండెంగకు చెందిన 12 మంది రైతులు నకిలీ పాసుపుస్తకాలతో పంట రుణాల కోసం సంప్రదించారు. నకిలీ పాసు పుస్తకాలను గూడూరు తహసీల్దార్‌కు అప్పగించాం. వీటిపై గతేడాది పీఏసీఎస్‌లో తీసుకున్న పంట రుణాలను తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
– రాదారపు సాంబరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, చెన్నారావుపేట