- ఫోర్జరీ సంతకాలతో పాస్ పుస్తకాలు చూపి రుణాల రెన్యూవల్
- విచారణ చేపట్టినా చర్యలు తీసుకోని అధికారులు
‘నకిలీ’ రుణ గ్రహీతలపై చర్యలేవీ?
Published Wed, Aug 31 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
చెన్నారావుపేట : మండల కేంద్రంలోని సహకార సంఘంలో నకిలీ పట్టా పాస్ పుస్తకాలపై పలువురు రుణాలు తీసుకొని ఏడాది కావస్తున్నా.. నిందితులపై నేటికీ చర్యలు చేపట్టలేదు. పైగా పలువురికి కొత్త రుణాలను రెన్యువల్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. దీనిపై గొంతు విప్పిన ఓ రైతుపై సాక్షా త్తూ సొసైటీæకార్యాలయ ఆవరణలో సోమవారం దాడికి పాల్పడటం గమనార్హం. రైతుల కథనం ప్రకారం.. గూడూరు మండలంలోని గుండెంగ, గాజులగట్టు గ్రామాలకు చెందిన పలువురు 2015 డిసెంబర్‌లో నకిలీ పట్టా పాస్ పుస్తకాలతో రబీ రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతర కాలంలో సొసైటీ చైర్మన్ రాదారపు సాంబరెడ్డి నకిలీ పాస్ పుస్తకాలను గుర్తించారు. వాటిపై గూడూరు తహసీల్దార్, మహబూబాబాద్ ఆర్డీఓల ఫోర్జరీ సంతకాలు ఉండటంతో ఆయన ఈ విషయాన్ని గుర్తించగలిగారు. దీనిపై విచారణ చేసిన అధికారులు పాస్ పుస్తకాలు తీసుకొని వెళ్లిపోయారు. కానీ ఇప్పటిదాకా చర్య లు మాత్రం తీసుకోలేదు. అంతేకాకుండా సొసైటీ నుంచి పొందిన రుణాలను రికవరీ కూడా చేయలేదు. ఇదిలా ఉండగా లావుడ్యా ఈర్య సోమవారం సొసైటీ కార్యాలయానికి వచ్చి 11 మందికి రుణాలు ఇలా ఇచ్చారు, నాకు కూడా అలాగే ఇవ్వండి అంటూ నిలదీ శారు. దీంతో బోడ భాస్కర్, రాజు, రవిలు అతడిపై దాడికి పాల్పడ్డారు. దీని గురించి ఈర్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పొనుగోడు,గుండెంగ మీ సేవా కేంద్రాలకు చెందిన కొంతమంది వ్యక్తులు రైతుల నుంచి అధిక మెుత్తంలో డబ్బులు తీసుకొని నకిలీ పాస్ పుస్తకాలను అందించారనే ఆరోపణలు కూడా వినవస్తున్నాయి.
రుణం అడిగితే డబ్బులు డిమాండ్ చేశాడు
గత సంవత్సరం నకిలీ పాస్ పుస్తకాలపై ఓ పైస్థాయి వ్యక్తి డబ్బులు తీసుకొని రుణాలు ఇప్పించాడు. అలాగే ఈ సంవత్సరం కూడా రుణాలు ఇవ్వమని అడిగితే డబ్బులు డిమాండ్ చేశాడు. నేను ఇవ్వకపోవటంతోనే నాకు రుణాలు ఇవ్వకుండా ఆపాడు. నిలదీసినందుకు నన్ను కొట్టించాడు.
– బాధితుడు లావుడ్యా ఈర్య
Advertisement
Advertisement