ఉనికి పాట్లు
పతనం అంచునున్న కాంగ్రెస్‌కు జవసత్వాలు తేవడానికి ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు సోమవారం పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించ తలపెట్టారు. పార్టీ పునర్ వైభవానికి ఈ సమావేశం ఏమేరకు ఫలితమిస్తుందో చూడాలి మరి!.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు
కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్ కలిగిన నెల్లూరు జిల్లాలో రానురాను ఆ పార్టీ ఉనికి కోల్పోతోంది. టీడీపీని ఢీ కొనగలిగే సత్తా ఉన్నా... నాయకుల మధ్య సమన్వయలోపం.. గ్రూపు తగాదాలు పార్టీ పతనానికి కారణాలు. గత అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. వాస్తవానికి పార్టీకి మహామహులను అందించిన జిల్లాగా పేరున్నా ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. పెద్ద తలకాయలున్నా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తలబొప్పి కట్టి తలెత్తుకు తిరగలేకపోతున్నారు.
ఏసీ సుబ్బారెడ్డి, నేదురమల్లి జనార్ధనరెడ్డి, రాజ్యలక్ష్మి, మాగుంట సుబ్బరామిరెడ్డి, తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి, ఆనం సంజీవరెడ్డి, రాం నారాయణరెడ్డి వంటి నాయకులను అందించిన జిల్లా ఇది. ఈ ఏడాది ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ నేతలు డిపాజిట్లు కోల్పోయారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకే ఒక్క డివిజన్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. ఆత్మకూరు మున్సిపాలిటీని కూడా మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చుచేయటంతోనే దక్కించుకోగలిగారన్న ప్రచారం ఉంది. దీన్నిబట్టి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగైందనే చెప్పొచ్చు.
ఉనికి కోసం ఆనం సోదరుల పాట్లు!
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉందనుకుంటున్న తరుణంలో ఆనం వివేకానందరెడ్డి పార్టీని భుజానికెత్తుకుంటున్నారు. అది కూడా ఆనం సోదరులు ఉనికిని కాపాడుకోవటానికేననే ప్రచారం ఉండనే ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తరువాత ‘సోదరులు’ టీడీపీ లేదా బీజేపీలో చేరాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టమే ఇందుకు నిదర్శనమని పార్టీ శ్రేణుల అభిప్రాయం.
విధిలేని పరిస్థితుల్లో ఒక వేదిక అవసరం కావటంతోనే ఆనం సోదరులు కాంగ్రెస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో పార్టీలో ఉన్న కేడర్‌ను తట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారు. దీని కోసం ఏకంగా రాష్ట్ర పీసీసీ కార్యవర్గ సమావేశాన్ని ఎంచుకున్నారు. అందుకే ఈ సమావేశాన్ని జిల్లాలో ఏర్పాటు చేశారు. పార్టీ బతికే ఉందనే ప్రయత్నం చేస్తున్నారు.
నిరాశ నిస్పృహల్లో నేతలు
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సైతం పదవుల్లో ఉన్న కొందరు నాయకులు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. సీడీసీఎంఎస్ చైర్మన్ సుమంత్‌రెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు ధనుంజయరెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి వంటి వారు కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. డీసీసీబీ చైర్మన్ టీడీపీలో అధికారికంగా వెళ్లకపోయినా పచ్చ పార్టీలో కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అదే విధంగా పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు మేయర్ పదవిని అనుభవించిన భానుశ్రీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లంతా టీడీపీతో సత్సంబంధాలు నెరుపుతున్న విషయం బహిరంగ సత్యం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బతికించుకునే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించలేదు. ఆనం సోదరుల రాజకీయ చతురత పార్టీ పటిష్ఠానికి ఎంతవరకు ఫలితమిస్తుందో అనుమానమే. నేటి సమావేశం సక్సెస్ కూడా వీరిపైనే ఆధారపడి ఉందనేది చెప్పక తప్పదు.
కమిటీలపై దృష్టి
క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌కు పట్టుకోల్పోయింది. దీన్ని నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా పార్టీ క్షేత్రస్థాయిలో మండల, నియోజక వర్గల్లో కమిటీలను వేసి పార్టీని బలోపేతం చేసే పనిలో పడింది. అనుబంధ విభాలను కూడా బలోపేతం చేసేందుకు పూనుకుంది. నియోజక వర్గాల వారీగా సమీక్ష సమావేశం, సభ్యత్వ నమోదుపై దృష్టి సారించనున్నట్లు తెలిసింది. మున్ముందు పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలను సైతం నెల్లూరు నుంచి ప్రకటించే విధంగా నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించారు.