మహిళా సంఘాలపై అసత్య ప్రచారం తగదు
గుంటూరు ఈస్ట్: రాజ్యహింసపై మహిళలను చైతన్యవంతుల్ని చేస్తున్న మహిళా సంఘాలపై ప్రచారంలో ఉన్న వ్యతిరేక వ్యాఖ్యాల్ని అందరూ ఖండించాలని చైతన్య మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి రాధ పిలుపునిచ్చారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో మంగళవారం మహిళలపై పెరుగతున్న హింస అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలను చైతన్య పరచడంలో ముందున్న సంఘాలపై అసత్య ప్రచారం చేస్తూ పోస్టర్లు కూడా వేయడం దారుణమన్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రతిఘటించేందుకు వెనుకాడేది లేదన్నారు. కార్యవర్గ సభ్యులు సిపోర మాట్లాడుతూ.. ఆదివాసీలపై జరుగుతన్న అత్యాచారాలు, దాడుల గురించి తెలుసుకోవడానికి అక్కడికి వెళ్లిన ప్రొఫెసర్లు అర్చన ప్రసాద్, నందినీ సుందర్, జర్నలిస్టు మాలిని సుబ్రహ్మణ్యంపై హత్యానేరం నమోదు చేయడం అన్యాయమన్నారు. ప్రగతి శీల మహిళా సంఘం నాయకురాలు బి.శివపార్వతి మాట్లాడుతూ.. రాజ్యహింసను ఎదుర్కొనేందుకు మహిళలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కార్యవర్గ సభ్యులు రాజేశ్వరి, వివిధ ప్రజా సంఘాల నాయకులు సి.ప్రసాదరావు, పి.శ్రీనివాసులు ,కృష్ణ, చిరతనగండ్ల వాసు, బి.విజయ భాస్కరరావు, ఎం.జాన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.