రజక కుటుంబాల బహిష్కరణ
ముత్యాలమ్మకు సల్లకుండ
పట్టలేమన్నందుకు గ్రామపెద్దల దుశ్చర్య
నేలకొండపల్లి: ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలం ఆరెగూడెంలో పది రజక కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేస్తున్నట్లు స్థానిక ఊరి పెద్దలు టమకా వేయించి అవమానించారు. బాధితుల కథనం ప్రకారం..ఆదివారం ముత్యాలమ్మ తల్లి పండుగ జరుపుకునేందుకు ఏర్పాట్ల కోసం శనివారం గ్రామంలో పెద్దలు సమావేశం నిర్వహించి..ప్రతిఏటా మాదిరి ఇంటింటికీ తిరిగి సల్లకుండను పట్టాల్సిందిగా రజకులను కోరగా..ఉన్న పది కుటుంబాల్లోని వృద్ధులు తిరగలేరని, పిల్లలు చదువుకుంటుండడంతో ఈ పనిచేయలేరని వారు తిరస్కరించారు. దీంతో ఆగ్రహించిన పెద్దలు..అలా అయితే అమ్మవారి ఆలయం వద్ద జీవాలను కూడా కోయొద్దని, శంకరగిరితండా గిరిజనులతో కోయించారు. ఇకపై..ఈ రజకులతో గ్రామస్తులు ఎలాంటి పనులు చేయించుకోవద్దని, అలా చేస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని టమకా వేయించారు. కొందరు రజక మహిళలు బట్టలు ఉతికేందుకు ఇళ్లకు వెళ్లగా వెనక్కి పంపించేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా సాంఘిక బహిష్కరణ చేసి..ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని రజకులు ఆంజనేయులు, బిక్షం, బి.వెంకటేశ్వర్లు, పుల్లయ్య, ఉపేందర్, రజక సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ డిమాండ్ చేశారు.